giddarulu
-
సీఎం సభలో కుప్పకూలిన కార్యకర్త
సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో ఓ కార్యకర్త మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం గిద్దలూరులో జరిగింది. పట్టణంలోని ఆదర్శ బీఈడీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సభకు వచ్చిన టీడీపీ కార్యకర్తల కోసం ముండ్లపాడు సమీపంలోని వ్యవసాయ భూముల్లో ఉన్న షెడ్డు వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. మండలంలోని కొంగళవీడుకు చెందిన టీడీపీ కార్యకర్త, వ్యవసాయ కూలీ భూపని రామయ్య (50) భోజనం తినేందుకు వచ్చాడు. భోజనం తింటూ కుప్పకూలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి ముగ్గురు కుమారులు ఉన్నారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోడిగుడ్లతో దాడి
సాక్షి, గిద్దలూరు : ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా గ్రామసభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యేపై కొందరు యువకులు కోడిగుడ్లు విసిరిన ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వైఎస్సార్ సీపీ తరపున గెలిచి టీడీపీలో చేరారు. ఆయన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా అర్ధవీడు మండలం వెలగలపాయగ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతున్న సమయంలో అశోక్‌రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో నాలుగైదు కోడిగుడ్లు విసిరేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా అలజడి రేగింది. పక్కనే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు కొంతమంది యువకులపై చేయి చేసుకోవడంతో గ్రామస్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్లు విసిరేశారనే అనుమానంతో సర్పంచి బంధువులు నలుగురు యువకులపై దాడికి దిగారు. నిందితులపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించినట్లు సమాచారం. దీనిపై పోలీసులను వివరణ కోరగా ఎవరో ఆకతాయిలు మద్యం మత్తులో కోడిగుడ్లు విసురుకున్నారని, తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. -
లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డి రైల్వే ఇంజినీర్
ఒంగోలు : ఉన్నతస్థాయిలో ఉన్న ఓ అధికారి అయిదు వేలకు కక్కుర్తి పడి సీబీఐకి అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్లో సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ బుధవారం తెల్లవారుజామున గ్యాంగ్‌మెన్ బాషా నుంచి అయిదువేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా సీబీఐ అధికారులకు చిక్కారు. ఆయనను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు లక్ష్మీనారాయణ నివాసంలో కూడా సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. రైల్వే అధికారి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లక్ష్మీనారాయణను సీబీఐ అధికారులు విశాఖ కోర్టుకు తరలిస్తున్నట్లు సమాచారం.