షవర్...బ్యాచిలర్ పార్టీ లాగే
గంటకోసారి ఫోన్ కబుర్లు, నిమిషానికోసారి టెక్స్ట్ మెసేజ్‌లు, రోజుకోసారి ఎఫ్బీ అప్డేట్లూ... ఇలా అనుక్షణం మనతోనే మన కోసమే అన్నట్టున్న మన క్లోజ్ ఫ్రెండ్ మరికొన్ని క్షణాల్లో మరొకరి జీవిత భాగస్వామి. మన కోసం వెచ్చించిన టైమ్ ఇక తన లైఫ్ పార్ట్నర్ కోసం ఖర్చు చేయాలి. మనకు చెప్పిన స్వీట్‌నథింగ్స్ తన మనిషితో పంచుకోవాలి. ఇంత దూరాన్ని భరించాలంటే దానికి ముందు ఎంత దగ్గరితనం అనుభవించాలి? అందుకే మగవాళ్ల కోసం పుట్టుకొచ్చాయి బ్యాచిలర్ పార్టీలు. అదే కోవలో అమ్మాయిలు అమ్మాయిల కోసం పుట్టించిన పార్టీలే ‘బ్రైడల్ షవర్’లు.
పెళ్లికూతురు కాబోతున్న అమ్మాయికి శుభాకాంక్షలు చెప్పేందుకు, బహుమతులు అందించేందుకు పెళ్లి రోజు దాకా ఆగాలా? ఆమెకు ప్రాణంలా మెలిగిన వారు కూడా పెళ్లిరోజునో, రిసెప్షన్ రోజునో వెళ్లి, గుంపులో గోవిందా అన్నట్టు ఓ గిఫ్ట్ప్యాకెట్ చేతిలో పెట్టేసి తిరిగి వచ్చేయాలా? ఠాట్... కుదరదంటే కుదరదనుకుంటున్నారు నవతరం. అందుకే బ్రైడల్ షవర్ పార్టీలకు హుషారుగా పచ్చజెండా ఊపేస్తున్నారు.
చారిత్రక మూలాలూ...
పెళ్లి పీటలు ఎక్కకుండానే ఏర్పాటు చేసే వేదికే బ్రైడల్ షవర్. చాలా కాలం కిందటే అంటే దాదాపు 1890 ప్రాంతం నుంచే నెదర్లాండ్స్, బెల్జియంలలో దీని ఆనవాళ్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇది కూడా కట్నకానుకల వంటి ఆచారాల సమస్యలను ఎదుర్కోవడానికి వచ్చిందట. పెళ్లి కూతురికి కావల్సినవి అందించలేక తండ్రి చేతులెత్తేసినప్పుడు, లేదా తనకు ఇష్టం లేని వివాహం చేసుకుంటున్న కూతురిని తల్లిదండ్రులు పట్టించుకోనప్పుడు... స్నేహితులే చొరవ తీసుకుని ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించేవారట. పెళ్లి చేసుకుంటున్నవారికి కావల్సిన వస్తువుల్ని, వారి సంసారానికి అవసరమైనవి సేకరించడానికి దీన్ని ఒక మార్గంగా ఆచారంలోకి తెచ్చారట. అదే కోవలో ఇంగ్లండ్‌లో బ్రైడ్ ఏలె పేరుతో కూడా ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించేవారు. పెళ్లికూతురు, ఆమె స్నేహితులు కలిసి బీరు తయారు చేసి దాన్ని విక్రయించేవారట. తద్వారా వచ్చిన డబ్బులతో పెళ్లి ఖర్చులు పెట్టుకునేవారట. ఇది పెళ్లికి ఒక్కరోజు ముందు నిర్వహించేవారట. ఏదైతేనేం... మరింత ఆధునికతను సంతరించుకున్న ఈ సరదా సందడి... ఇటీవలి కాలంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చి... సహజంగానే అక్కడ నుంచి మన దేశానికి అలా మన కాస్మొపాలిటన్ సిటీకి కూడా వచ్చేసింది.
వెళ్లిరావమ్మా... పెళ్లికూతురా...
నగరంలో బ్రైడల్ షవర్లు ప్రారంభమై ఏడాది కావస్తోంది. ఇప్పుడిప్పుడే ఇవి ఊపందుకుంటున్నాయి. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుందని తెలియగానే... ఆమె స్నేహితులంతా కలిసి చర్చించుకుని ఆ అమ్మాయి కోసం ఒక సర్ప్రైజ్ పార్టీని నిర్వహిస్తున్నారు. ఆ పార్టీలో ఆడి పాడడం, జ్ఞాపకాలు పంచుకోవడం, బహుమతులు అందించడం వంటివన్నీ సందడిగా సాగిపోతున్నాయి. వేడుక ముగిసే సమయానికి అందరూ కలిసి ఆమెను సాదరంగా సాగనంపడం కూడా. ఈ సందర్భంలో కొన్ని జతల కళ్లు చెమర్చడం వంటి సన్నివేశాలూ ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. నగరంలోని పలు రెస్టారెంట్స్, కాఫీషాప్స్, పబ్స్, క్లబ్స్... వంటివి ఈ తరహా బ్రైడల్ షవర్లకు ప్రస్తుతం వేదికలుగా మారాయి. పలువురు ఈవెంట్ మేనేజర్లు వీటిని నిర్వహించేందుకు ఉత్సుకత చూపుతున్నారు. ప్రస్తుతం ఈ తరహా పార్టీలకు మగవాళ్లను అనుమతించడం కనపడనప్పటికీ భవిష్యత్తులో ఈ నిబంధన మాయమవ్వొచ్చునని భావిస్తున్నారు. ఇటీవలే నగరానికి చెందిన మోడల్ సిపిక ఖండేల్వాల్ స్నేహితులు గత ఏడాదే ఆమె కోసం బ్రైడల్ షవర్ నిర్వహించారు. గ్లామర్ రంగ యువత ద్వారా ఇలాంటి కార్యక్రమాలకు వస్తున్న ప్రచారం మరింతమందికి స్ఫూర్తినిస్తోంది. సో.. బ్యాచిలర్ పార్టీల్లానే నగరం నలుమూలలా బ్రైడల్ షవర్లు కూడా పార్టీ ప్రియుల్ని తడిపి ముద్దచేయడం ఖాయం.
ఎస్.సత్యబాబు