ఇక కలిపేసుకుంటాం!
కశ్మీర్లో ఆక్రమించిన భూభాగంపై పాకిస్తాన్ దూకుడు
గిల్గిట్ – బాల్తిస్తాన్‌ను ఐదో రాష్ట్రంగా కలుపుకునే యత్నం
అందుకోసం రాజ్యాంగం సవరిస్తామని పాక్ మంత్రి ప్రకటన
భారత్ తీవ్ర అభ్యంతరం.. సహించేది లేదని స్పష్టీకరణ
పాక్ చర్యపై జమ్మూకశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిరసనలు
గిల్గిట్‌లో పాక్‌ది దురాక్రమణ.. కలిపేసుకోవడం అక్రమం
అది భారత్‌కు చెందిన ప్రాంతమని బ్రిటన్ పార్లమెంటు తీర్మానం
ఏడు దశాబ్దాలుగా తమ దేశానికి అనుబంధ ప్రాంతంగా పాక్ తన ఆధీనంలో ఉంచుకున్న గిల్గిట్ – బాల్తిస్తాన్ ప్రాంతానికి రాష్ట్రం (ప్రావిన్స్) హోదా ఇవ్వాలని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదించినట్లు పాక్ అంతర్రాష్ట్ర వ్యవహారాల మంత్రి రియాజ్ హుస్సేన్ పీర్జాదా గత వారంలో ప్రకటించారు. ఆ ప్రాంతపు హోదా మార్చి రాష్ట్రంగా చేయడం కోసం రాజ్యాంగ సవరణ చేపడతామనీ వెల్లడించారు. పాక్‌లో ప్రస్తుతం బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్, సింధ్ – నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు కశ్మీర్లో తాము ఆక్రమించుకుని ప్రత్యేక ప్రాంతంగా వ్యవహరిస్తున్న గిల్గిట్ – బాల్తిస్తాన్‌ను ఐదో రాష్ట్రంగా కలుపుకునేందుకు చర్యలు చేపట్టింది.
చైనా – పాక్ కారిడార్ కోసమే.. : చైనా 4,600 కోట్ల డాలర్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చైనా – పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సీపెక్) కోసం ఈ ప్రాంతం చాలా కీలకమైనది కావడం ఇక్కడ గమనార్హం. గిల్గిట్ – బాల్తిస్తాన్ భూభాగం నుండి చైనా – పాక్ ఆర్థిక కారిడార్ విస్తరిస్తుంది. కానీ.. ఈ భూభాగం విషయంలో భారత్ – పాక్‌ల మధ్య వివాదం అపరిష్కృతంగా ఉండటం పట్ల చైనా ఆందోళన వ్యక్తం చేస్తోందని.. అందుకే ఆ ప్రాంతాన్ని కలిపివేసుకుని, చైనా ఆందోళనకు తెరదించాలని పాక్ ప్రయత్నిస్తోందని భావిస్తున్నారు. ఈ భూభాగంలో సీపెక్‌కు చట్టబద్ధత కల్పించడం కోసం రాజ్యంగ సవరణ ద్వారా ఈ భూభాగం హోదాను మార్చాలని చైనా యోచిస్తున్నట్లు ఇటీవల పాక్ వార్తాపత్రిక ‘డాన్’లో కూడా కథనాలు వెలువడ్డాయి.
(చదవండి: 70 ఏళ్లుగా ఆరని చిచ్చు.. కశ్మీర్)
భారత్ కఠిన ప్రతిస్పందన.. : భారత్‌లో అంతర్భాగమైన భూభాగాన్ని పాక్ ఆక్రమించుకుని ఉండగా.. ఆ వివాదాస్పద భూభాగంలో మూడో దేశం చైనా ఆర్థిక కారిడార్ నిర్మాణ పనులు చేపడుతుండం పట్ల భారత్ ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ భూభాగాన్ని పాక్ ఒక రాష్ట్రంగా కలిపివేసుకునే ప్రయత్నాలు చేస్తుండటంపై భారత్ కఠినంగా స్పందించింది. ‘జమ్మూకశ్మీర్ ప్రాంతం మొత్తం 1947లో భారత్‌లో విలీనమైంది. అది అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగం. జమ్మూకశ్మీర్‌లో కొంత భాగం పాక్ ఆక్రమణలో ఉంది. గిల్గిట్ – బాల్తిస్తాన్ ప్రాంతం హోదాను మార్చడానికి ఎటువంటి ప్రయత్నాలూ చెల్లవు. వాటిని అంగీకరించబోం’ అని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బగాలే ఉద్ఘాటించారు. కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఒక అడుగు ముందుకు వేసి.. ‘‘పాక్ ఆక్రమిత్ కశ్మీర్, గిల్గిట్ – బాల్తిస్తాన్లను పాక్ ఆక్రమణ నుంచి విముక్తం చేస్తాం. జమ్మూకశ్మీర్‌ను తన వాస్తవ రూపంలోకి తీసుకువచ్చి భారత సమాఖ్యలో విలీనం చేస్తాం’’ అని గత వారంలో ప్రకటించారు.
కశ్మీర్ ఇరువైపులా ఆందోళనలు.. : గిల్గిట్ – బాల్తిస్తాన్‌ను పాకిస్తాన్ కలిపివేసుకునే ప్రయత్నాలకు.. కశ్మీర్ వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు పాక్ సర్కారుకు తెలిపింది. పాక్ చర్యలను నిరసిస్తూ పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారీ నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించింది. ఆ ప్రాంతాన్ని పాక్ కలిపివేసుకున్నట్లయితే కశ్మీర్ సమస్య పరిష్కార ప్రయత్నాలు బలహీనపడతాయని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ చర్య కశ్మీరీ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని డెమొక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ అభివర్ణించింది. ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్లో గత వారం చాలా మంది కార్యకర్తలు, ముఖ్యంగా న్యాయవాదులు వీధుల్లోకి వచ్చి పాక్ ప్రయత్నాలకు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రదర్శణలు నిర్వహించారు. ‘మా పిల్లలు చనిపోయినా సరే.. గిల్గిట్‌ను కలుపుకోనివ్వం’ అంటూ నినాదాలు చేశారు. జమ్మూకశ్మీర్ ప్రాంతాలన్నీ అవిభాజ్యమైనవని, వాటన్నిటినీ యధాపూర్వం కలిపేసి స్వాతంత్ర్యం కావాలని వారి డిమాండ్.
పరిష్కారమా.. తిరస్కారమా..?: గిల్గిట్ – బాల్తిస్తాన్లను ఐదో రాష్ట్రంగా కలుపుకోవడానికి పాక్ ప్రయత్నించడం.. సుదీర్ఘంగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్ వివాదాన్ని ఒక పరిష్కారం దిశగా నడిపించవచ్చునని భావించే వాళ్లూ ఉన్నారు. నిజానికి 1948లో కశ్మీర్ విషయంలో భారత్ – పాక్‌ల మధ్య యుద్ధం జరిగినపుడు కాల్పుల విరమణ రేఖనే ఆ తర్వాత నియంత్రణ రేఖగా పరిగణించాలని, దానిని క్రమంగా అంతర్జాతీయ సరిహద్దుగా మార్చాలని గతంలోనే చాలా ప్రతిపాదనలు వచ్చాయని.. ఇరుపక్షాలూ అధినాయకులూ వాటికి అంతర్గతంగా ఆమోదం తెలిపారని.. కానీ బాహాటంగా ప్రకటించి అమలు చేయడానికి సంకోచిస్తున్నారని ఆయా చర్చల్లో భాగస్వాములైన దౌత్యవేత్తలు పలువురు చెప్తున్నారు. అయితే.. తాజా పరిణామాలు కశ్మీర్ సమస్యను పరిష్కారం వైపుగా నడిపిస్తాయా.. లేక పరిస్థితిని మరింతగా జటిలం చేస్తాయా అన్నది వేచి చూడాల్సిందే!
పాక్ చర్య అక్రమం: బ్రిటన్ పార్లమెంటు ఖండన
గిల్గిట్ – బాల్తిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ అక్రమంగా తన దేశంలో కలిపివేసుకునే ప్రయత్నాలను బ్రిటన్ పార్లమెంట్ తీవ్రంగా ఖండించింది. ఆ భూభాగం చట్టబద్ధంగా భారత్‌కు చెందినదని, 1947 నుంచీ పాక్ అక్రమంగా ఆక్రమించుకుని ఉందనీ గత శుక్రవారం చేసిన ఒక తీర్మానంలో తప్పుపట్టింది. భారత ఉపఖండాన్ని రెండు వందల ఏళ్ల పాటు పరిపాలించి.. ఏడు దశాబ్దాల కిందట ఉపఖండాన్ని భారత్, పాకిస్తాన్‌లుగా చీల్చి స్వాతంత్ర్యం ప్రకటించి వెళ్లిపోయిన బ్రిటన్ పార్లమెంటు ఈ విధంగా తీర్మానం చేయడం.. భారత్‌కు నైతికంగా చాలా బలాన్నిస్తోంది. భారతదేశంలోని జమ్మూకశ్మీర్‌లో గిల్గిట్-బాల్తిస్తాన్ చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన అంతర్భాగం. దానిని పాకిస్తాన్ 1947 నుంచి అక్రమంగా ఆక్రమించుకుని ఉంది. ఆ ప్రాంతంలోని ప్రజలకు భావప్రకటనా స్వాతంత్ర్యం సహా ప్రాధమిక హక్కులు లేవు. ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఏకపక్షంగా ఐదో రాష్ట్రంగా ప్రకటించడాన్ని ఈ సభ ఖండిస్తోంది’’ అంటూ కామన్స్ సభలో తీర్మానాన్ని ఆమోదించారు. ‘‘ఆ ప్రాంతపు జనావళి స్వరూపాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలు, చైనా – పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ నిర్మాణానికి బలవంతంగా అక్రమంగా చేస్తున్న ప్రయత్నాలు వివాదాన్ని మరింత జఠిలం చేస్తున్నాయి’’ అని కూడా ఆ తీర్మానంలో ఆందోళన వ్యక్తం చేశారు.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)