Giliyar
-
ఇంగ్లిష్ విన్గ్లిష్
‘‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ’’ ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందిన వాక్యమిది. సోషల్ వెబ్సైట్లలో సెటైర్లకు... మిత్రుల చర్చల్లో జోకులకూ కారణమైంది. మెయిల్లో లేదంటే ఇతరులకు రాసే ఇంగ్లీషు ఉత్తరంలోనో తప్పొప్పులుంటే... కంప్యూటర్లోని స్పెల్చెక్తో కాకుంటే నిఘంటువుతో సరి చేసుకోవచ్చుగానీ... మాటల్లో దొర్లే వ్యాకరణ దోషాలను దిద్దుకునేదెలా? ముఖ్యమైన జాబ్ ఇంటర్వ్యూల్లో ఇబ్బందికరమైన పరిస్థితిని తప్పించుకునేదెలా? చాలా సింపుల్... మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇంగ్లిష్ ట్యూటర్‌గా చేసుకోండి! 5. ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఏ రకమైన చెల్లింపులు లేకుండా పూర్తిగా ఉచితంగా లభించే అప్లికేషన్ ఇది. ఆప్స్ ఆఫ్ ఇండియా కంపెనీ అభివృద్ధి చేసిన ఈ అప్లికేషన్. ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ అందించడం, టేబుల్స్ ద్వారా ప్రతి అంశానికి సంబంధించిన వివరణలు ఇవ్వడం దీని ప్రత్యేకత. ప్రాక్టీస్ ఎక్సర్‌సెజైస్ కూడా ఉన్నాయి. దాదాపు ఐదు లక్షల డౌన్లోడ్స్ ఉన్న ఈ అప్లికేషన్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా సులువుగా ఉండటం గమనార్హం. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌ను అందివ్వడం, క్విజ్, ఎక్సర్‌సైజ్‌లను అప్డేట్ చేయడం తమ అప్లికేషన్ ప్రత్యేకతగా కంపెనీ పేర్కొంటోంది. 4. గ్రామర్ అప్... వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన ఇంగ్లీషు గ్రామర్‌ను నేర్పేందుకు ఎక్కువగా ఉపయోగపడే అప్లికేషన్ ఇది. గ్రాఫ్‌ల ద్వారా వ్యాకరణంలో మీ బలం ఏమిటి? బలహీనతలేమిటి అన్నది తెలుపుతుంది. నిర్దిష్ట సమయంలోపు గ్రామర్ నేర్చుకోవాలనుకునే వారి కోసం దీంట్లో ఓ టైమర్‌ను ఏర్పాటు చేశారు. రియల్‌టైమ్ ఫీడ్‌బ్యాక్ ద్వారా మీరు చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తద్వారా వేగంగా, మెరుగ్గా నేర్చుకునేందుకు అవకాశముంటుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ల కోసం ‘గ్రామర్ అప్ లైట్’ ఉచితం. పూర్తిస్థాయి వెర్షన్ కావాలంటే ఆండ్రాయిడ్ వినియోగదారులు రూ.150 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. గ్రామర్ యాప్ వ్యాకరణం నేర్చుకోవడాన్ని ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియని గందరగోళంలో ఉన్న వారికి గ్రామర్ యాప్ మెరుగైన ఛాయిస్. గ్రామర్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని 200 వరకూ ఉన్న లెర్నింగ్ ఆప్షన్స్, దాదాపు వెయ్యి ప్రశ్నల ద్వారా నేర్చుకునే వీలుంది. ట్యుటోరియల్స్‌ను చూడటంతోపాటు, ఎక్సర్సైజ్ల ద్వారా మీ ఇంగ్లీష్ రాతను మరింత మెరుగు పరచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది ఈ అప్లికేషన్. మీరు ఎంతవరకూ నేర్చుకున్నదీ అక్కడికక్కడే ఫీడ్‌బ్యాక్ కూడా అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్ వినియోగదారులు దాదాపు రూ.70 చెల్లించి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రం ఇది ఉచితంగా లభిస్తుంది. ఆపిల్ ఐఫోన్లో స్క్రీన్ క్లారిటీ హెచ్డీలో ఉండటం దీనికి కారణం. గ్రామరో పోలిస్: ఈ అప్లికేషన్ మొత్తం ఓ ఆట మాదిరిగా ఉంటుంది. ‘సిటీ ఆఫ్ గ్రామర్’ అన్న పేరుతో సాగే ఈ ఆట ద్వారా భాషా విభాగాలను (పార్ట్స్ ఆఫ్ స్పీచ్) నేర్చుకోవచ్చు. ఒక్కో భాషా విభాగం సిటీలోని ఒక్కో ప్రాంతం మాదిరిగా ఉంటుంది. మీరు ఈ సిటీలో నామవాచకాల ప్రాంతం నుంచి క్రియ లకు ఆ తరువాత మరో భాషా విభాగా నికి వెళుతూ విషయాలను నేర్చుకుంటా రన్న మాట. ఒక్కో అంశం మీకు ఎంతమేరకు అబ్బిందో తెలుసుకునేం దుకు కొన్ని క్విజ్లు ఉంటాయి. వీటితోపాటు వీడియోలు, బుక్స్, పాటల ద్వారా గ్రామర్‌ను నేర్చుకోవడం దీని ప్రత్యేకత. గ్రామరోపోలిస్ ప్రాథమిక వెర్షన్ ఉచితంగా లభిస్తుందిగానీ.. కంప్లీట్ వెర్షన్ కోసం మాత్రం ఆండ్రాయిడ్‌లోనైతే దాదాపు రూ.600, ఐఫోన్లలోనైతే రూ.800 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ ఇంగ్లీష్ గ్రామర్ ఆండ్రాయిడ్‌తోపాటు ఆపిల్ ఐఫోన్ వినియోగదారులకూ ఉచితంగా లభించే అప్లికేషన్ ఇది. వ్యాకరణం నేర్చుకోవడాన్ని ఆటలా చేసే అప్లికేషన్ ఇది. ఫ్లాష్‌కార్డ్స్, ప్రశ్నలు, కథనాలు వంటివి కలిగి ఉన్న ఈ అప్లికేషన్ ద్వారా టెన్సెస్ (కాలం) మొదలుకొని పాసివ్ వాయిస్ వరకూ అనేక వ్యాకరణ అంశాలను నేర్చుకోవచ్చు. ఫ్లాష్కార్డుల ద్వారా గ్రామర్ అంశాలను నేర్చుకోవడం, క్విజ్‌ల ద్వారా వాటిని పరీక్షించడం ఇందులోని ముఖ్యమైన ఫీచర్లు. క్విజ్వరల్డ్ సంస్థ అందించిన ఈ ఆప్‌లో బిగినర్, ఎలిమెంటరీ, ఇంటర్మీడి యట్, అడ్వాన్స్డ్ అన్న నాలుగు మాడ్యూళ్లు ఉన్నాయి. గ్రామర్ ఫోన్: ఇది కూడా ఐఫోన్ వినియోగదా రులకు మాత్రమే ఉద్దేశించింది. వ్యాకర ణంలో మనం చేసే దాదాపు 25 ప్రధానమైన తప్పులను దిద్దుకునేందుకు సహకరిస్తుంది. యూజర్ ఇంటర్ఫేస్ సింపుల్‌గా ఉండటం ఒక విశేషమైతే తరచూ మనం గందరగోళంలో పడే పదాలను ఎప్పటికప్పుడు వివరించడం మరో విశేషం. ఆపిల్ ఆప్‌స్టోర్‌లో దాదాపు రూ.60కి లభించే ఈ అప్లికేషన్ ద్వారా మీ ఇంగ్లీష్ రాతలో వచ్చే ప్రధానమైన తప్పులను పరిహరించుకోవచ్చు. గ్రామర్ గర్ల్... ఇది ఆపిల్ ఐఫోన్ వినియోగదారుల కోసం మాత్రమే అందుబాటులో ఉన్న అప్లికేషన్. పాడ్కాస్ట్ల రూపంలో ఇంగ్లీష్ గ్రామర్‌ను నేర్పిస్తుంది. ఎప్పటికప్పుడు గ్రామర్‌కు సంబంధించిన టిప్స్‌ను వినిపిస్తూ, గ్రామర్ సంబంధిత వాల్పేపర్లను అందిస్తూంటుంది ఈ అప్లికేషన్. అడిగిన వాటితోపాటు అడగని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పడం, వివరణలు ఇవ్వడం దీని ప్రత్యేకత. చదవడం లేకుండా వినడం మాత్రమే కాబట్టి ఈ అప్లికేషన్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా గ్రామర్ నేర్చుకోవచ్చు. - గిళియార్ -
కొత్త గుండెలు... కమింగ్ సూన్
లబ్ డబ్..లబ్ డబ్.. లబ్ డబ్! గుండె కొట్టుకునే శబ్దమిది! నిమిషానికి ఓ ఎనభైసార్లు ఈ లబ్‌డబ్‌లు వినిపిస్తే.. మనం బతికి ఉన్నట్లు లెక్క! లేదంటే ఈ భూమ్మీద మనకు నూకలు చెల్లినట్లే! ఈ మాత్రం మాకూ తెలుసు అని అనుకుంటున్నారా? ఒకే! కానీ ఇది కొన్నేళ్లే! ఆ తరువాత మనిషి బతికి ఉన్నాడా? లేదా? అన్నది తెలుసుకునేందుకు కొత్త మార్గాలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటారా? అసలు కొట్టుకోని కృత్రిమ గుండెలు వచ్చేస్తున్నాయి మరి! గుండెజబ్బులతో ఆయుష్షు అంచుల్లో ఉన్నవారికీ కొత్త ఊపిరి పోయగల ఈ కొత్త గుండెల కథా కమామీషు.. గుండె మన శరీరంలో ఎంత ముఖ్యమన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే వయసు మీదపడే కొద్దీ రకరకాల కారణాల వల్ల గుండె బలహీనపడటం, దాని సామర్థ్యం తగ్గిపోవడం మనం చూస్తూ ఉంటాం. కడుపులో ఉన్నప్పటి నుంచి కడదాకా కొట్టుకుంటూనే ఉండే ఈ పిడికెడంత అవయవానికి ప్రత్యామ్నాయమే లేదు. మరో మనిషి గుండెను అమర్చుకునే అవకాశముంది కానీ... అవయవదానంపై అవగాహన పెద్దగా లేకపోవడం సమస్యగా మారుతోంది. ఒకవేళ మార్పిడి కోసం గుండె అందుబాటులో ఉన్నా... అన్ని సందర్భాల్లోనూ ఆ గుండె మరొకరికి సరిపోతుందన్న గ్యారెంటీ లేదు... ఈ నేపథ్యంలోనే పల్స్ లెస్ అంటే కొట్టుకోని గుండెల అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. గుండె పనిచేయకపోయేందుకు అనేక కారణాలుంటాయి. అధిక రక్తపోటు మొదలుకొని గుండెజబ్బులు, హార్ట్అటాక్, స్ట్రోక్, గుండె వాల్వ్‌లు పాడవటం, కండరాలు బలహీనపడటం (కార్డియోమయోపతి) వంటివి. గుండెకు జబ్బు చేసినప్పుడు వాటిల్లోని కణాలు క్రమేపీ బలహీనపడతాయి. దీంతో వాడేసిన ఎలాస్టిక్ పట్టీ మాదిరిగా తయారవుతుంది గుండె. వ్యాకోచిస్తూ పెద్దగా మారుతుంది. అంతేకాకుండా దాని పంపింగ్ సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. చికిత్సతో చిక్కులెన్నో...: గుండె పాడైతే ఏం చేయాలన్న ఆలోచన ఇప్పటిదేమీ కాదు. దశాబ్దాల క్రితమే శాస్త్రవేత్తలు దీని గురించి ఆలోచన మొదలుపెట్టారు. 1912లో తొలిసారి ఫ్రెంచ్ సర్జన్ థియోడర్ టుఫియర్ చేతివేళ్లతో రోగి గుండె అరోటిక్ వాల్వ్ (గుండె నుంచి ప్రవహించే రక్తాన్ని నియంత్రిస్తుంది) ను కదపడం వైద్యశాస్త్ర చరిత్రలో తొలి హార్ట్ సర్జరీగా నమోదైంది. ఆ తరువాత 1944లో బాల్టీమోర్‌లో ఓ పసిబాలిక ఆరోటా వాల్వ్‌ను ఊపిరితిత్తులకు వెళ్లే పల్మనరీ వాల్వ్‌తో కలపడం ద్వారా ఆల్ఫ్రెడ్ బ్లాలాక్ ఈ రకమైన శస్త్ర చికిత్స చేసిన తొలి వైద్యుడిగా రికార్డులకెక్కారు. గుండెకు నేరుగా మరమ్మతు చేయడం ఏమంత ఆషామాషీ వ్యవహారం కాదు. శరీరం నుంచి ప్రవహించే రక్తాన్ని అడ్డుకుంటే ప్రాణం పోయే ప్రమాదముంటుంది. అడ్డుకోకపోతే... శస్త్ర చికిత్స చేయడం కష్టం. అయితే ఐదవ దశకంలో అందుబాటులోకి వచ్చిన హార్ట్ లంగ్ మిషన్ ఈ సమస్యను కొంత వరకూ తీర్చగలిగింది. దీంతో 1953లో తొలి ఓపెన్‌హార్ట్ బైపాస్ సర్జరీకి మార్గం సుగమమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కూడా గుండెకు శస్త్రచికిత్స అన్నది చాలా పరిమితులతో కూడుకున్న వ్యవహారమే! పూర్తిగా పాడైన గుండెలను మరో మనిషి గుండెతో మార్పిడి చేసుకోవడం ఒక్కటే మార్గంగా మిగిలింది. దురదృష్టవశాత్తూ గుండెమార్పిడి చేసుకున్న వారు ఎక్కువ కాలం బతికేవారు కాదు. శరీరం కొత్త గుండెను తిరస్కరించడంతో సమస్యలేర్పడేవి. కృత్రిమ గుండెలు...: గుండె చేసే పని కేవలం రక్తాన్ని శరీరంలోకి పంప్ చేయడం మాత్రమే అని ముందుగా చెప్పుకున్నాం కదా... ఈ అంశం ఆధారంగా కృత్రిమ గుండెలు తయారు చేసేందకు కూడా చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1968లోనే డెంటన్ కూలీ అనే శాస్త్రవేత్త తొలిసారి కృత్రిమంగా తయారైన గుండెను ఓ రోగికి అమర్చారు. ఆ తరువాత 64 గంటలకు ఆ రోగికి మరో మనిషి గుండెను అమర్చినా... ఒకట్రెండు రోజుల్లోనే అతడు మరణించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ గుండెనును పోలిన కృత్రిమ పరికరాన్ని తయారు చేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగినా ఫలితాలు మాత్రం అంతంతమాత్రమే. విలియం కాల్ఫ్ అభివృద్ధి చేసిన జార్విక్ 7, సిన్‌కార్డియా ఈకోవకు చెందినవే. వీటిని నడిపించేందుకు బయటి నుంచి విద్యుచ్ఛక్తి అవసరమయ్యేది. అంతేకాకుండా రోగి కదలికలకు ఆస్కారమూ తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో జార్విక్ 7ను అమర్చిన పేషెంట్లు ఎక్కువ కాలం బతికేవారు కాదు. పైగా సిన్‌కార్డియా కృత్రిమ గుండెను మూడు నెలలకు ఒకసారి మార్చాల్సి వచ్చేది. ఆర్కిమెడీస్ స్క్రూతో కొత్త ఆశలు..: ఆర్కిమెడిస్ స్క్రూ గురించి మీరెప్పుడైనా విన్నారా? క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దానికి చెందిన గ్రీకు శాస్త్రవేత్త అభివృద్ధి చేసిన పరికరం ఇది. (ఫొటో చూడండి) కాలువల నుంచి నీటిని కొంచెం ఎత్తుకు తోడుకునేందుకు ఉపయోగించేవారు. గొట్టం ఒకవైపున ఉండే పుల్లీని తిప్పితే... దిగువ నుంచి నీరు పైకి ఎగబాక్కుంటూ వస్తాయి. 1976లో రిచర్డ్ కె.వాంప్లర్ అనే కార్డియాలజిస్ట్ ఈ ఆర్కిమెడీస్ స్క్రూను చూసి దీని ఆధారంగా కృత్రిమ గుండె తయారీకి పూనుకున్నారు. ‘హీమోపంప్’ పేరుతో ఈయన అభివృద్ధి చేసిన కృత్రిమ గుండె ఓ పెన్సిల్ ఇరేజర్ సైజులో ఉండేది. 1988లో దీన్ని తొలిసారి ఓ రోగిలో అమర్చారు. దీంట్లోని స్క్రూను బ్యాటరీ సాయంతో తిప్పినప్పుడు గుండెలోని రక్తం శరీర అవయవాలకు చేరేది. అయితే ఇది నిత్యం తిరుగుతూనే ఉంటుంది. మామూలు గుండె మాదిరి నిమిషానికి 80 సార్లు చొప్పున కాదన్నమాట. దీంతో ఈ రకమైన పరికరాన్ని అమర్చుకున్న వారి నాడి కొట్టుకోదు! ఇంకోలా చెప్పాలంటే కొట్టుకోని గుండె సిద్ధమైందన్నమాట! అయితే హీమోపంప్ అమర్చిన వారు ఆసుపత్రికి మాత్రమే పరిమితం. దీంతో హీమోపంప్ అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ ఇదే ఆర్కిమెడీస్ స్క్రూ విధానం ఆధారంగా అబియోమెడ్ తయారు చేసిన ఇంపెల్లా, టెక్సస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ తయారు చేసిన హార్ట్‌మేట్ 2లు హీమోపంప్ స్థానాన్ని భర్తీ చేశాయి. పెన్సిల్ సైజులో ఉండే ఈ పరికరంలోనే మోటర్ కూడా ఉండటం విశేషం. ఈ కృత్రిమ గుండెలేవీ కొట్టుకోవు. అమెరికా ఉపాధ్యక్షుడు డిక్ చెనీతో కలిపి ఇప్పటివరకూ దాదాపు 20 వేల మంది హార్ట్‌మేట్ 2ను అమర్చుకున్నారు. హార్ట్మేట్ను మరింత అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తులో గుండెకు మెరుగైన ప్రత్యామ్నాయం లభిస్తుందని, దీంతో ఏటా కొన్ని లక్షల మందిని మరణం నుంచి దూరం చేయవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. - గిళియార్ కండరాల పంప్‌సెట్ ఇంతకీ మనిషి శరీరంలో గుండె చేసే పనేమిటి? రక్తానికి ఆక్సిజన్ చేర్చి శరీరంలోని అన్ని అవయవాలకూ దాన్ని పంప్ చేయడం అంతే! ముడుచుకుపోతే రక్తం శరీరంలోకి ప్రవహిస్తుంది... వ్యాపిస్తే గుండెలోకి ప్రవహిస్తుంది. అదీ లెక్క! ఈ సంకోచ, వ్యాకోచాలే మనకు లబ్డబ్ల రూపంలో వినిపిస్తూంటాయి. శరీరంలోకి ప్రవహించే రక్తాన్ని కూడా నాడి కొట్టుకోవడం లేదా పల్స్ ద్వారా మనం గమనించవచ్చు. గుండె అనే కండరాల పంప్‌సెట్‌లో నాలుగు గదుల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. పైభాగంలో ఉన్న రెండు గదులను ఆట్రియా అని... కిందివైపున ఉన్నవాటిని వెంట్రికల్స్ అని పిలుస్తారు. ఆక్సిజన్ తక్కువగా ఉన్న రక్తం కుడివైపున ఉన్న ఆట్రియంలోకి... ఆ తరువాత దిగువన ఉన్న వెంట్రికల్‌లోకి ప్రవహిస్తుంది. ఇక్కడి నుంచి రక్తం ఊపిరితిత్తులోకి పంప్ అవుతుంది. ఈలోపు ఆక్సిజన్‌తో కూడిన రక్తం ఊపిరితిత్తుల నుంచి ఎడమవైపున్న ఆట్రియంల్లోకి... ఆ తరువాత వెంట్రికల్‌లోకి చేరుతుంది. ఇక్కడి నుంచి రక్తం శరీరంలోని అవయవాలన్నింటికీ చేరుతుంది. ఈ ప్రక్రియ మొత్తమ్మీద అత్యంత కీలకమైన భాగాలేవైనా ఉన్నాయంటే అవి ఆట్రియ, వెంట్రికల్స్లోని వాల్వ్‌లు. రక్తం నిత్యం ఒకేదిశలో ప్రవహించేలా చేసేందుకు, వెనక్కు ప్రవహించకుండా చూసేందుకూ ఈ వాల్వ్‌లు చాలా కచ్చితమైన పద్ధతిలో పనిచేయాల్సి ఉంటుంది. -
మహిళకు కక్ష్యాబంధన్
ఈ కాలంలో అమ్మాయి బయటకెళ్లిందంటే చాలు... అమ్మా నాన్నలకు మది నిండా గుబులే... మొన్నటికి మొన్న దేశ రాజధానిలో ‘నిర్భయ’ ఘటన... నిన్న హైదరాబాద్‌లో ‘అభయ’ ఉదంతం... తాజాగా మళ్లీ ఢిల్లీలో ఒంటరి మహిళపై ఉబర్ ట్యాక్సీ డ్రైవర్ బరితెగింపు! అతివలకు ఇది కాని కాలమే! అదృష్టమేమిటంటే... కాలం మారుతోంది. అనుభవాల పాఠాలు టెక్నాలజీలుగా మారుతున్నాయి! నింగిలోని 24 ఉపగ్రహాల జీపీఎస్ వ్యవస్థే మహిళకు రక్ష... రక్ష.. రక్ష అంటున్నాయి! పద్దెనిమిది నిమిషాలకు ఓ మానభంగం.. గంటకో కిడ్నాప్.. చెప్పుకునేందుకు సిగ్గుపడాల్సిన గణాంకలివి. తప్పొప్పుల లెక్క కాసేపు పక్కనబెడితే నిర్భయ లాంటి సంఘటనలను నివారించేందకు టెక్నాలజీ ఎంతో సాయపడుతుందన్నది మాత్రం వాస్తవం. అందరికీ స్మార్ట్ఫోన్లు వాటిల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అందుబాటులో ఉండటం ఒక కారణమైతే... అప్లికేషన్లను అభిద్ధి చేయడం కూడా సులువైపోవడం మరో కారణమవుతోంది. అప్లికేషన్లను ఓపెన్ చేసి... అవసరమైన బటన్లు చూసుకుని నొక్కాల్సిన అవసరమూ లేకుండా కొన్ని అప్లికేషన్లు కేవలం... స్మార్ట్‌ఫోన్‌ను గట్టిగా అటుఇటూ కదిలిస్తే లేదంటే.. గట్టిగా అరచినా... ఆప్తులకు మీరున్న ప్రాంతపు సమాచారం అందించేలా అప్లికేషన్లు ఉన్నాయి. ఉమన్ సేఫ్టీ షీల్డ్ ప్రొటెక్షన్: అత్యవసర పరిస్థితుల్లో ఆప్తులకు సమాచారం పంపడంతోపాటు మీరున్న ప్రాంతం తాలూకూ ఫొటోలు తీసి పంపగలగడం ఈ అప్లికేషన్ ప్రత్యేకత. దీంట్లో ఉన్న ‘వాక్ విత్ మీ’ ఫీచర్ ద్వారా మీరు ఏ రూట్ ద్వారా ఎక్కడికి వెళ్లిందీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. పుకార్... ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు... జీపీఎస్ ట్రాకర్‌లా మారిపోయి... మీ సమాచారాన్ని ముందుగా నమోదు చేసిపెట్టుకున్న ఐదు కాంటాక్ట్స్‌కు పంపడం ఈ అప్లికేషన్ ప్రత్యేకత. ప్రస్తుతానికి ఇది రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పనిచేస్తుంది. పోలీస్ కంట్రోల్ రూమున్న ప్రాంతాన్ని సిటీమ్యాపులో చూపుతుంది కూడా. టోటెమ్ ఎస్ఓఎస్: పోలీస్ కంట్రోల్ రూమ్‌కు డయల్ (100) చేయడంతోపాటు పదిసెకన్లు ఒకసారి ఫొటోలు తీయడం, ఆడియో రికార్డు చేయడం టోటెమ్ ఎస్ఓఎస్ అప్లికేషన్‌లోని ప్రధాన ఫీచర్లు. మూడు బటన్లు ఉండే ఈ అప్లికేషన్లో ఎరుపు బటన్‌ను ప్రెస్ చేసిన వెంటనే కంట్రోల్ రూమ్‌కు కాల్ వెళుతుంది. ఎల్లో బటన్ ప్రెస్ చేస్తే మీ జీపీఎస్ లొకేషన్.. మీరు ముందుగా స్టోర్ చేసి పెట్టుకున్న కాంటాక్ట్స్‌కు నిర్దిష్ట వ్యవధిలో వెళుతూ ఉంటాయి. రక్ష: అప్లికేషన్‌ను ఆన్ చేసి.. బటన్లు వెతుక్కునే పని లేకుండా కేవలం వాల్యూమ్ బటన్‌ను ప్రెస్ చేసి పట్టుకుంటే పనిచేసే అప్లికేషన్ ఇది. పోలీసులకు (100) కాల్ చేయడంతోపాటు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్స్ తాలూకూ వివరాలను గూగుల్ మ్యాప్‌పై చూపుతుంది. ఐగో సేఫ్లీ: ఫోన్‌ను వేగంగా అటుఇటూ కదిపితే చాలు... మీరు ప్రమాదంలో ఉన్నట్లు వెంటనే బంధు మిత్రులకు సమాచారం పంపే సౌకర్యమున్న అప్లికేషన్ ఇది. లేదీ హెడ్‌ఫోన్ పిన్ను డిస్కనెక్ట్ చేసినా సరిపోతుంది. మీరు ఆఫ్ చేసేంతవరకూ ప్రతి నిమిషం జీపీఎస్ లొకేషన్, ఇతర వివరాలు బంధు మిత్రులకు వెళుతూనే ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో చేసిన 30 సెకన్ల ఆడియో రికార్డింగ్ కూడా మీ లిస్ట్‌లోని వారికి ప్రసారమవడం విశేషం. సేఫ్‌లెట్... ఈ బ్రేస్లెట్... బ్లూటూత్‌తో స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. ఆపత్కాలంలో బ్రేస్‌లెట్‌కు రెండువైపులా ఉన్న బటన్స్‌ను నొక్కితే చాలు.. మీరు ముందుగా స్టోర్ చేసి పెట్టుకున్న కాంటాక్ట్స్‌కు ఎస్ఎంఎస్ వెళుతుంది. అవసరమైతే పోలీసులకూ అలర్ట్ పంపవచ్చు. మీరు బటన్ నొక్కిన వెంటనే స్మార్ట్‌ఫోన్‌లోని మైక్రోఫోన్ పనిచేయడం మొదలవుతుంది. శబ్దాలను రికార్డు చేస్తుంది. లీఫ్ సేఫర్: ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు తయారు చేసిన లేటెస్ట్ సేఫ్టీ టెక్నాలజీ ఇది. చూసేందుకు నెక్లెస్ మాదిరిగా ఉన్నా... ఇది సేఫ్‌లెట్ మాదిరిగానే పనిచేస్తుంది. బంధుమిత్రులతోపాటు... మీరున్న ప్రాంతంలో ఇదే టెక్నాలజీని ఉపయోగిస్తున్న వారికీ అలర్ట్‌లు పంపడం దీని ప్రత్యేకత. జ్ట్టిఞట://ఠీఠీఠీ.్ఛ్చజఠ్ఛ్చీట ్చఛ్ఛట.ఛిౌఝ/ వెబ్సైట్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. జీపీఎస్ పనిచేసేదిలా... గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్.. కుప్తంగా జీపీఎస్ మానవ మేధ సృష్టించిన అద్భుతాల్లో ఒకటని చెప్పేందుకు అనుమానమే అక్కరలేదు. అగ్రరాజ్యం అమెరికా తన మిలటరీ అవసరాల కోసం అభివృద్ధి చేసుకున్నా... ప్రస్తుతం ఈ వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం మొదలుకొని... పర్యావరణ పరిరక్షణ వరకూ అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు. జీపీఎస్‌లో స్పేస్, కంట్రోల్, యూజర్ సెగ్మెంట్లని మూడు భాగాలుంటాయి. మొదటి రెండింటిని అమెరికా ప్రభుత్వం పర్యవేక్షిస్తూంటుంది. స్పేస్ సెగ్మెంట్లో దాదాపు 24 ఉపగ్రహాలుంటాయి. భూమికి దాదాపు 20 వేల కిలోమీటర్ల ఎత్తులో తిరుగు తూంటాయి. ఒక్కో ఉపగ్రహం రోజుకు రెండుసార్లు ప్రత్యేక కక్ష్యలో భూమిని చుట్టేస్తూంటాయి. అంతేకాకుండా ఇవి నిరంతరం రేడియో సంకేతాల ద్వారా తమ స్థానం, సమయం వంటి వివరాలను ప్రసారం చేస్తూంటాయి. ఈ 24 ఉపగ్రహాల స్థానం, కక్ష్యల ఫలితంగా భూమ్మీద మనకు ఏ క్షణంలోనైనా కనీసం మూడు ఉపగ్రహాల సంకేతాలు అందుబాటులో ఉంటాయి! మన స్మార్ట్ఫోన్లతోపాటు కొన్ని ప్రత్యేకమైన పరికరాల్లో ఈ జీపీఎస్ సంకేతాలను అందుకునే సౌకర్యం ఉంటుంది. కాంతివేగంతో ప్రసారమయ్యే జీపీఎస్ సంకేతాలను అందుకునే స్మార్ట్ఫోన్లు.. ఆ సమయాన్ని నమోదు చేసుకుని... ఆ ఉపగ్రహానికి, తనకూ మధ్య ఉన్న దూరాన్ని లెక్కవేస్తాయి. కనీసం మూడు ఉపగ్రహాల నుంచి ఉన్న దూరాన్ని లెక్కవేస్తే...ఆ స్మార్ట్‌ఫోన్ లేదా జీపీఎస్ రిసీవర్ భూమ్మీద ఏ అక్షాంశం, రేఖాంశంపై ఏ స్థానంలో ఉందో స్పష్టంగా తెలిసిపోతుంది. ఆప్స్ డౌన్లోడింగ్ ఇలా... స్మార్ట్ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసేవి దాదాపుగా 90 శాతం వరకూ ఉన్నాయి. ఐఫోన్, విండోస్ ఫోన్లలో కొన్ని ఆండ్రాయిడ్ ఓఎస్‌తోనూ పనిచేస్తాయి. మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ను వాడుతూంటే అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకునేందుకు గూగుల్ ప్లే స్టోర్ (జ్ట్టిఞట://ఞ్చడ.జౌౌజ్ఛ.ఛిౌఝ) వెబ్‌సైట్‌కు వెళ్లండి. హోమ్ పేజీలో ఎడమవైపు పైభాగంగా ఆప్స్, మూవీస్, గేమ్స్, బుక్స్, న్యూస్‌స్టాండ్, డివెజైస్ అన్న ఆప్షన్లు కనిపిస్తాయి. ఆప్స్‌పై క్లిక్ చేస్తే... స్మార్ట్‌ఫోన్‌లో మన పనులు సులువు చేసే అనేకానేక అప్లికేషన్లు కనపడతాయి. మీకు కావాల్సిన అప్లికేషన్ పేరును, లేదా కీవర్డ్స్‌ను సెర్చ్ బార్ (పైభాగంలో భూతద్దం గుర్తు ఉన్నచోటు)లో టైప్ చేస్తే కింది భాగంలో అవి కనిపిస్తాయి. నచ్చిన అప్లికేషన్‌ను క్లిక్ చేస్తే ముందుగా పర్మిషన్స్ (మీ వివరాలు సేకరించేందుకు ,వాడుకునేందుకు అనుమతి) కోరుతూ ఒక బాక్స్ ప్రత్యక్షమవుతుంది. యాక్సెప్ట్ ఆప్షన్‌ను నొక్కితే అప్లికేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్లోడ్ అవడం మొదలవుతుంది. డౌన్లోడింగ్ పూర్తయిన తరువాత ఫోన్లోని ఆప్స్ బాక్స్‌లో ఉన్న ఐకాన్‌ను నొక్కి పట్టుకుని హోం స్క్రీన్‌పైకి తెచ్చుకోండి. దీంతో అప్లికేషన్ మీరు ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లెక్క! - గిళియార్ ‘‘జంట నగరాల్లో మహిళల భద్రత కోసం షీ టీమ్ అనేక టెక్నాలజీలను వాడుతోంది. హాక్ఐ పేరుతో హైదరాబాద్ పోలీసులు అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ వీటిల్లో ఒకటి మాత్రమే. దీంతోపాటు షీటీమ్ ఓ ఫేస్బుక్ పేజీ (జ్ట్టిఞట://ఠీఠీఠీ.జ్చఛ్ఛిఛౌౌజు.ఛిౌఝ/ టజ్ఛ్ట్ఛ్చిఝజిడఛీ) ని కూడా నిర్వహిస్తోంది. మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో పోస్ట్ చేయవచ్చు. వెంటనే తగిన చర్యలు చేపడతాం. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ‘100’ నెంబరుకు ఫోన్ చేస్తే చాలు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న పోలీస్ వాహనం వెంటనే రంగంలోకి దిగుతుంది. ఆదుకునే ప్రయత్నాలు మొదలుపెడుతుంది. వీటితోపాటు నగరంలో ప్రజలు రవాణా కోసం ఉపయోగించే వాహనాలన్నింటిలో (ఆటోలు, బస్సులు, ట్యాక్సీలు వగైరా..) జీపీఆర్ఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగా మోటార్ వెహికల్స్ చట్టంలో మార్పులు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాము. ఇది అమల్లోకి వస్తే.. నేర నియంత్రణ మరింత సులువు అవుతుంది.’’ - స్వాతి లక్రా, షీటీమ్, ఏసీపీ హైదరాబాద్