3భాగాలు 4శక్తులు
ఆకారం ఒక శక్తిని ప్రేరేపిస్తే... మాంజా కట్టే స్థానం గాలిపటంపై పనిచేసే మిగిలిన మూడు శక్తులను నియంత్రించేందుకు పనికొస్తుంది.
ఒకటేమో పైపైకి వెళ్లమంటుంది... ఇంకోటి నేలకేసి లాగుతూంటుంది. ముచ్చటగా మూడోది ముందుకు తోస్తూంటే... చిట్టచివరిదైన నాలుగోది వెనక్కు లాగేస్తూ ఉంటుంది. ఏంటీ ఈ ఒకటి, రెండు, మూడు, నాలుగు? సంక్రాంతికి ఆకాశానికి శోభనిచ్చే పతంగులు అలా గాల్లో ఎగిరేందుకు... ఎగురుతూనే ఉండేందుకు అవసరమైన శక్తుల గురించి ఈ వర్ణనంతా! సంక్రాంతి వచ్చిందంటే చాలు... పతంగులు పుచ్చుకుని మిద్దెలెక్కేసి ఆనందించడం బాగానే ఉంటుంది గానీ... దాని వెనుక ఎంత తంతు ఉందన్నది మాత్రం తక్కువ మందికి తెలుసు.
గాలిపటాలు రకరకాల ఆకారాల్లో సైజుల్లో ఉన్నప్పటికీ వాటన్నింటి వెనుక ఉన్న సూత్రం మాత్రం ఒక్కటే... ఆకారం మొదలుకొని, గాలిపటానికి దారం ఎక్కడ కట్టాలి? దానికి మాంజా ఎలా తగిలించాలి? అన్న అంశాలన్నీ కీలకమే. ఆకారం ఒక శక్తిని ప్రేరేపిస్తే... మాంజా కట్టే స్థానం గాలిపటంపై పనిచేసే మిగిలిన మూడు శక్తులను నియంత్రించేందుకు పనికొస్తుంది.
గాలిపటంలో ఉండే భాగాలు స్థూలంగా మూడు. కొబ్బరిచెట్టు ఈనెలతో లేదంటే వెదురుతో తయారయ్యే చట్రం ఒకటైతే... ఈ చట్రాన్ని మాంజాతో కలిపే భాగం రెండోది. ఇంగ్లీషులో దీన్ని బ్రిడిల్ అంటారు. ఇక మూడోభాగం... గాలిపటాన్ని నియంత్రించేందుకు మన చేతుల్లో ఉండే మాంజా! చిత్రమైన విషయం రంగు రంగుల కాగితాలు అతికించిన చట్రం గాల్లో పైకి ఎగిస్తే... బ్రిడిల్, మాంజాలతో దాని వేగాన్ని, దిశను మనం నియంత్రిస్తూంటాం అన్నమాట! గాలిపటం ఆకారం ఏదైనప్పటికీ అది గాల్లో సక్రమంగా ఎగరాలంటే... నాలుగు శక్తులను నియంత్రించాల్సి ఉంటుంది.
మొదటిది లిఫ్ట్. గాలిపటంపై కదిలే గాలి దాన్ని పైకి తోస్తూంటుంది కదా... దాన్నే లిఫ్ట్ అంటారు. గాలిపటం పైభాగంలో ఎక్కువ, కిందిభాగంలో తక్కువ గాలి తగులుతూ ఉంటే దానికి లిఫ్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడర్థమైందా? గాలిపటాలు పైన వెడల్పుగా, కింద చిన్నసైజులో ఎందుకుంటాయో?
ఇక రెండో శక్తి గురించి చూద్దాం. దీన్ని వెయిట్ అని పిలుస్తారుగానీ... గురుత్వాకర్షణ శక్తి అని కూడా అనవచ్చు. ఈ శక్తి కారణంగా ఎంత తేలికగా ఉన్న గాలిపటమైనా... కొంత సమయానికి నేలపైకి వచ్చి చేరుతుంది. ఇక మూడో శక్తి డ్రాగ్ లేదా వెనక్కు లాగేసే శక్తి. ఇది తిరోగమన శక్తి. గాలిపటం ముందు, వెనుకవైపులపై ఉండే గాలి ఒత్తిడిలోని తేడా, గాలిపటం ఉపరితలంపై గాలి తాలూకూ ఘర్షణల ఫలితంగా పుడుతుంది.
ఇక చివరగా చెప్పుకోవాల్సింది థ్రస్ట్ గురించి. గాలి కదిలే దిశలో గాలిపటాన్ని కదిలించే శక్తి ఇదే. ఎగరేసే వ్యక్తి మాంజా ద్వారా చేసే కదలికలు, మాంజా తాలూకూ టెన్షన్ (వదులుగా ఉందా? గట్టిగా ఉందా? అన్నది)లపై ఇది ఆధారపడుతుంది. ఎగరేసే వ్యక్తి కొంచెం కొంచెం ముందుకు కదులుతూ మాంజాను బిగువుగా ఉంచితే థ్రస్ట్ లభిస్తుందన్నమాట.
గాల్లోకి ఎగరేసేందుకు గాలిపటాన్ని మోసుకుని పరుగెత్తుకు వస్తామే... అది కూడా థ్రస్ట్‌ను సృష్టించేందుకు జరిగే ప్రయత్నమే! మొత్తమ్మీద చూస్తే.. గాలిపటం సక్సెస్‌ఫుల్‌గా గాల్లోకి ఎగరాలంటే వెయిట్ కంటే లిఫ్ట్ ఎక్కువగా ఉండాలి. అలా ఎగురుతూ ఉండాలంటే ఈ నాలుగు శక్తుల మధ్య బ్యాలెన్స్ అవసరం. అంటే లిఫ్ట్‌తో సమానమైన వెయిట్, డ్రాగ్‌కు సరిసమానమైన థ్రస్ట్ ఉండాలి.
- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా