ginnisbook
-
మనాలి నుంచి లేహ్ వరకూ..చిరుతలా పరిగెత్తింది
అల్ట్రా రన్నర్ సూఫియా ఖాన్. లక్ష్యం 480 కిలోమీటర్లు. కాని మామూలు దారి కాదు. సముద్ర మట్టానికి 2000 మీటర్ల నుంచి 3000 మీటర్ల ఎత్తున. చలి, మంచు, పర్వతాల దారి. కాని 146 గంటల్లో సాధించింది. ఈ దారిలో పరిగెత్తిన మొదటి మహిళ ఆమె. ‘ప్రపంచం మొత్తం పరిగెత్తాలని ఉంది’ అంటోందామె. అందుకు లేసులు కూడా బిగిస్తోంది. సంప్రదాయ మారథాన్ గరిష్టంగా 42 కిలోమీటర్లు ఉంటుంది. దానికి మించిన మారథాన్‌ను ఆల్ట్రా మారథాన్ అంటారు. సూఫియా ఖాన్ ఆల్ట్రా రన్నర్. అంటే ఏకధాటిగా వందల కిలోమీటర్ల మారథాన్ చేసే రన్నర్ అన్నమాట. ప్రపంచంలో ఆమెలా పరిగెడుతున్నవారు... రికార్డ్స్ సృష్టిస్తున్నవారు బహుశా మరొకరు లేరు. ఎందుకంటే ఆమె కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరిగెత్తి ఒక రికార్డు, గోల్డెన్ ట్రయాంగిల్ (జైపూర్, ఢిల్లీ, ఆగ్రా)లో పరిగెత్తి ఒక రికార్డు, తాజాగా మనాలి నుంచి లేహ్‌కు పరిగెత్తి ఒక రికార్డు నమోదు చేసింది. 35 ఏళ్ల వయసులో చిరుతలా పరిగెత్తే ఈమెను అందుకోవడం కష్టమేమి కాదు. కాకపోతే అందుకు మనమూ పరిగెత్తాల్సి ఉంటుంది. అజ్మీర్ అమ్మాయి అజ్మీర్‌లో పుట్టి పెరిగిన సూఫియాకు 16 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి ఆమెను పెంచింది. డిగ్రీ చేశాక ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చూసుకోమ్మా అంది. కాని సూఫియాకు ఏవియేషన్ రంగంలో పని చేయాలనిపించి ఒక ప్రయివేట్ ఎయిర్‌లైన్స్‌లో గ్రౌండ్స్టాఫ్గా చేరింది. అక్కడ బండ చాకిరీ. సంవత్సరాలు గడిచిపోతుండేవి. దానికి తోడు ఆరోగ్యం, ఉత్సాహం సన్నగిల్లడం కూడా. ‘నన్ను నేను ఒకరోజు అద్దంలో చూసుకుంటే నా ఫిట్నెస్ అంతా పోయిందనిపించింది. డ్యూటీ చేస్తూనే ఆరోగ్యం కాపాడుకోవాలంటే రోజూ ఒక 15 నిమిషాలన్నా పరిగెత్తాలని అనుకున్నాను. అలా పరిగెత్తడం మొదలెట్టాను. అప్పటి వరకూ నాకు ఆటలంటే ఇష్టం లేదు. కాని పరిగెడుతుంటే నా శరీరం చిరుతలా మారేది. నాకు పరుగు సరిౖయెనది అని ఇంకా సాధన చేశాను’ అంటుంది సూఫియా. మారథాన్‌లో సూఫియా సందేశం కోసం పరుగు పరుగులో ఆనందం తెలిశాక రొడ్డకొట్టుడు ఉద్యోగాన్ని వదిలేసింది సూఫియా. ఒక సందేశం కోసం తన పరుగును దేశానికి చూపాలనుకుంది. ‘మానవత్వమే ముఖ్యం’ అనే సందేశంతో 2018లో మొదట ఇండియన్ గోల్డెన్ ట్రయాంగిల్ మధ్య పరిగెత్తింది. 720 కిలోమీటర్ల ఈ దూరాన్ని 16 రోజుల్లో ముగించి రికార్డు స్థాపించిందామె. దాంతో ఆమె పరుగు మీద అందరి దృష్టి పడింది. ఆ తర్వాత 2019లో అంతకు మించి సాహసం చేసింది సూఫియా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 4000 కిలోమీటర్ల దూరం– శ్రీనగర్‌తో మొదలయ్యి లూధియానా మీదుగా గజియాబాద్, కోట, ఇండోర్, ముంబై, బెలగామ్, బెంగళూరు, మదురైలను దాటి కన్యాకుమారి వరకూ ఆమె పరిగెత్తింది. ఏప్రిల్ చివరి వారంలో మొదలెట్టి రోజుకు 50 కిలోమీటర్ల లెక్కన పరిగెడుతూ దాదాపు 90 రోజులలో ఆమె ఈ పరుగును పూర్తి చేసి మరో రికార్డును స్థాపించింది. ఇప్పుడు ‘నీ హద్దుల్ని దాటు’ అనే సందేశంతో మనాలి, లేహ్‌ల మధ్య పరిగెత్తింది. ‘నీ హద్దుల్ని దాటు’ స్త్రీలకు అన్నీ హద్దులే. స్త్రీలు చేసే సాహసాలకు అన్నీ ఆటంకాలే. అందుకే సూఫియా ‘నీ హద్దుల్ని దాటు’ అనే సందేశంతో సెప్టెంబర్ 25, 2021 ఉదయం తన ‘హిమాలయన్ ఆల్ట్రా రన్ ఎక్స్‌పెడిషన్’ మనాలి నుంచి మొదలెట్టింది. 480 కిలోమీటర్ల దూరాన్ని అక్టోబర్ 1న లేహ్‌లో ముగించింది. ఇలా ముగించడం సామాన్యం కాదు. ఇలా ముగించిన మహిళ గతంలో లేదు. అందుకే సూఫియా సాహసం గొప్ప స్ఫూర్తిదాయకం అయ్యింది. మనాలి సముద్ర మట్టానికి 6,700 అడుగుల ఎత్తు ఉంటుంది. లేహ్ 11, 500 అడుగుల ఎత్తు. ఈ రెండు ఎత్తుల మధ్య పరిగెత్తాలి. చలి ఈ దారిలో ఒక్కోసారి మైనస్ 5 డిగ్రీలు ఉంటుంది. ఆక్సిజన్ గాలిలో అరవై శాతమే ఉంటుంది. పెద్ద సవాలు. ‘అయినా నేను పరిగెత్తాను. దీనికి ముందు ఒక పదిహేను రోజులు ఈ పర్వతాల్లో క్యాంప్ వేసి ఇక్కడి వాతావరణానికి నా శరీరం అలవాటు పడేలా చేసుకున్నాను.’ అంది సూఫియా. ప్రాణాపాయం లెక్కచేయక మనాలి, లేహ్‌ల మధ్య రోడ్లు బాగుండవు. ఆ దారిలో వాహనాల్లో వెళుతున్నవాళ్లే ఆక్సిజన్ చాలక ఒక్కోసారి మరణిస్తారు. ‘నాక్కూడా ఆ దారిలో ఉండే గ్రామీణులు, ఆర్మీ వాళ్లు చాలా జాగ్రత్తలు, ప్రాణాపాయ పరిస్థితులు చెప్పారు. ప్రాణాయామం, యోగా వల్ల నా లంగ్స్‌ను గట్టి పరుచుకోవడం వల్ల నేను ధైర్యం చేశాను. కాని ఆ ధైర్యం చేయడం వల్ల ఎన్నో మనోహర దృశ్యాలు చూశాను. లడాఖ్ లోయ ముఖద్వారం ‘సర్చూ’, సింధూ నది ప్రవాహం, తంగ్లంగ్ లా పాస్... ఇవన్నీ జీవితంలో ఒక్కసారైనా చూడాలి’ అందామె. సూఫియాకు సపోర్ట్ టీమ్ ఉంటుంది. అది ఆమె వెంట ఉండి ఆ పరుగును, రాత్రి బసను ప్లాన్ చేస్తుంది. రెండుసార్లు గిన్నెస్‌బుక్‌లో ఎక్కిన సూఫియా తర్వాతి అంకం ‘ప్రపంచాన్ని పరుగుతో చుట్టి రావడమే’. ఆ రోజు కూడా బహుశా చూస్తాం. తథాస్తు. -
‘ఘన’పతి.. ప్రత్యేకత ఇదీ...
గిన్నిస్ రికార్డుపై కన్నేసిన గణనాథుడు గాజువాకలో 78 అడుగుల విగ్రహం ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం ప్రత్యేక అనుమతులు పొందిన నిర్వాహకులు గాజువాక : గాజువాక వినాయకుడు గిన్నిస్ రికార్డువైపు చూస్తున్నాడు. దేశంలోనే ఎల్తైన విగ్రహంగా రూపుదిద్దుకొంటున్న ఈ ‘ఘన’నాథుడు మొత్తం మట్టితోనే తయారవుతుండటం విశేషం. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు గత ఎనిమిదేళ్లుగా ప్రసిద్ధి పొందిన గాజువాకలో నిర్వాహకులు ఈ ఏడాది లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎల్తైన గణపతి విగ్రహంతోపాటు అత్యంత భారీ సైజులో లడ్డూ ప్రసాదాన్ని కూడా ఈ విగ్రహం వద్ద నైవేధ్యంగా ఉంచుతున్నారు. ఎన్నెన్నో ప్రత్యేకతలు... విశాఖ ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ (విశ్వ) ఆధ్వర్యంలో ప్రారంభించనున్న ఈ ఉత్సవాల్లో ప్రతిదీ ఒక ప్రత్యేకతగా రూపుదిద్దుతున్నారు. వినాయక విగ్రహాన్ని దశావతార గణపతిగా రూపొందిస్తున్నారు. – విగ్రహాన్ని 30 అడుగుల వెడల్పు, 78 అడుగుల ఎత్తులో తయారు చేస్తున్నారు. అన్ని అడుగుల ఎల్తైన ఈ విగ్రహం అత్యల్ప బరువుతో ఉండటం విశేషం. దీనికోసం టన్నునర ఎర్రమట్టి, 500 కేజీల ఊక, 500 కేజీల గోనె సంచులను ఉపయోగించడంతోపాటు, పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టని సహజ సిద్ధమైన రంగులను ఉపయోగిస్తున్నారు. – ఈ విగ్రహం కోసం దాదాపు 95 నుంచి 100 అడుగుల ఎత్తయిన మండపం నిర్మిస్తున్నారు. వీటికోసం సరుగుడు కర్రలు, వెదురు కర్రలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీనికోసం 150 టన్నుల కలపను ఉపయోగిస్తున్నారు. కేవలం కర్రలను ఉపయోగించి ఇంత ఎత్తయిన మండపం తయారు చేయడం కూడా ఇదే తొలిసారని నిర్వాహకులు చెబుతున్నారు. అందువల్లే ఈ మండపం కూడా ఈసారి గిన్నిస్, లిమ్కాబుక్ల రికార్డుల పరిశీలనకు వెళ్లనుంది. – ఈనెల 5 ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు 21 రోజులపాటు కొనసాగనున్నాయి. విశాలమైన లంకా మైదానంలో ఉత్సవ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. విగ్రహాన్ని ప్రతిష్ఠంచినచోటే నిమజ్జనోత్సవం కూడా నిర్వహించనున్నట్టు విశ్వ ప్రతినిధులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశంపై తొలిపూజతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. – భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడంలో కూడా ప్రత్యేకత సంతరించుకొనే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించనున్నారు. బాలింతలకు, చిన్నపిల్లలతో వచ్చినవారికి, గర్భిణులకు దర్శనం కల్పించడంలో అసౌకర్యం, ఆలస్యం లేకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. 12.5 టన్నుల లడ్డూ నైవేథ్యం వినాయక ఉత్సవాల్లో స్వామివారికి నైవేధ్యంగా 12.5 టన్నుల లడ్డూను తయారు చేయిస్తున్నారు. ఈసారి కూడా లడ్డూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. లడ్డూను తయారు చేసే బాధ్యతను రాజమండ్రి ప్రాంతానికి చెందిన సురుచి స్వీట్స్ యాజమాన్యానికి అప్పగించారు. రూ.30లక్షల విలువైన ఈ భారీ లడ్డూను సురుచి స్వీట్స్ యాజమాన్యం ఉచితంగా అందజేసేందుకు ముందుకొచ్చింది. వినాయకలడ్డూల తయారీ కోసం స్వీట్స్ తయారీ సంస్థ యజమాని మల్లిబాబుతోపాటు మరో 20 మంది వినాయక మాలను ధరించారు. ప్రతి ఏటా పెరుగుతున్న లడ్డూ సైజు... గాజువాకలో తొలిసారిగా 2009లో ఏర్పాటు చేసిన భారీ వినాయక ఉత్సవాల సందర్భంగా లంబోదరుడికి కేవలం 50 కేజీల లడ్డూను మాత్రమే నైవేద్యంగా పెట్టారు. ఆ తరువాత ఏడాది 400 కేజీల లడ్డూ, ఆ మరుసటి ఏడాది 500 కేజీల లడ్డూ నైవేధ్యంగా పెట్టిన నిర్వాహకులు 2014 ఏకంగా ఎనిమిదిన్నర టన్నుల లడ్డూను నైవేధ్యంగా పెట్టారు. అంతవరకు ఖైరతాబాద్ వినాయకునివద్ద ఏర్పాటు చేసిన నాలుగు టన్నుల లడ్డు రికార్డును గాజువాక నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఎనిమిదిన్నర టన్నుల లడ్డూ అధిగమించింది. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలోని భక్తాంజనేయ స్వీట్స్‌లో దీన్ని తయారు చేయించారు. గత ఏడాది విశ్వ ఆధ్వర్యంలో నిర్వహించిన 80 అడుగుల వినాయక ఉత్సవాల్లో పది టన్నుల లడ్డూను ప్రసాదంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదంతా స్వామి అనుగ్రహం... గత ఏడాది మేము వినాయక ఉత్సవాలను నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకోలేదు. అప్పటికప్పుడు అనుకొని ప్రారంభించాం. పదిన్నర టన్నుల లడ్డూను స్వామివారికి నైవేధ్యంగా పెట్టగలిగాం. విగ్రహం రూపు కూడా పూర్తిస్థాయి దైవత్వంతో ఎంతో అందంగా వచ్చింది. ఇదంతా వినాయకుడి అనుగ్రహంవల్లే సాధ్యమైంది. ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించాలని ముందుగా అనుకోలేదు. అప్పటికప్పుడు అనుకొని మూడు వారాల క్రితం ప్రారంభించాం. ఆయన అనుగ్రహం ఉండడంవల్లే భారీ ఉత్సవాన్ని నిర్వహించడానికి అన్నీ కుదిరాయి. అంతపెద్ద లడ్డూను స్వామివారికి నైవేధ్యంగా పెట్టడానికి అవకాశం కలిగింది. – పల్లా రమణ యాదవ్, విశ్వ అధ్యక్షుడు ప్రత్యేక అనుమతితో విగ్రహ తయారీ... భారీ విగ్రహాల ఎత్తు విషయంలో హైకోర్టు పరిమితి విధించిన నేపథ్యంలో గాజువాకలో 78 అడుగుల విగ్రహ తయారీకి ప్రత్యేక అనుమతి తీసుకున్నట్టు విశ్వ అధ్యక్షుడు రమణ యాదవ్ తెలిపారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించినచోట కాకుండా వేరే ప్రాంతానికి తరలించి నిమజ్జనం చేసే విగ్రహాలకు మాత్రమే ఎత్తు విషయంలో పరిమితులున్నాయని చెప్పారు. తాము ప్రతిష్ఠించినచోటే విగ్రహాన్ని నిమజ్జనం కూడా చేస్తామని, అందువల్ల తమకు అనుమతి అవసరం లేదని చెప్పారు. అయినప్పటికీ ఐదు ప్రభుత్వ శాఖలనుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్నట్టు చెప్పారు.