-
గిన్నిస్ రికార్డుపై కన్నేసిన గణనాథుడు
-
గాజువాకలో 78 అడుగుల విగ్రహం
-
ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం
-
ప్రత్యేక అనుమతులు పొందిన నిర్వాహకులు
గాజువాక : గాజువాక వినాయకుడు గిన్నిస్ రికార్డువైపు చూస్తున్నాడు. దేశంలోనే ఎల్తైన విగ్రహంగా రూపుదిద్దుకొంటున్న ఈ ‘ఘన’నాథుడు మొత్తం మట్టితోనే తయారవుతుండటం విశేషం. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు గత ఎనిమిదేళ్లుగా ప్రసిద్ధి పొందిన గాజువాకలో నిర్వాహకులు ఈ ఏడాది లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎల్తైన గణపతి విగ్రహంతోపాటు అత్యంత భారీ సైజులో లడ్డూ ప్రసాదాన్ని కూడా ఈ విగ్రహం వద్ద నైవేధ్యంగా ఉంచుతున్నారు.
ఎన్నెన్నో ప్రత్యేకతలు...
విశాఖ ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ (విశ్వ) ఆధ్వర్యంలో ప్రారంభించనున్న ఈ ఉత్సవాల్లో ప్రతిదీ ఒక ప్రత్యేకతగా రూపుదిద్దుతున్నారు. వినాయక విగ్రహాన్ని దశావతార గణపతిగా రూపొందిస్తున్నారు.
– విగ్రహాన్ని 30 అడుగుల వెడల్పు, 78 అడుగుల ఎత్తులో తయారు చేస్తున్నారు. అన్ని అడుగుల ఎల్తైన ఈ విగ్రహం అత్యల్ప బరువుతో ఉండటం విశేషం. దీనికోసం టన్నునర ఎర్రమట్టి, 500 కేజీల ఊక, 500 కేజీల గోనె సంచులను ఉపయోగించడంతోపాటు, పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టని సహజ సిద్ధమైన రంగులను ఉపయోగిస్తున్నారు.
– ఈ విగ్రహం కోసం దాదాపు 95 నుంచి 100 అడుగుల ఎత్తయిన మండపం నిర్మిస్తున్నారు. వీటికోసం సరుగుడు కర్రలు, వెదురు కర్రలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీనికోసం 150 టన్నుల కలపను ఉపయోగిస్తున్నారు. కేవలం కర్రలను ఉపయోగించి ఇంత ఎత్తయిన మండపం తయారు చేయడం కూడా ఇదే తొలిసారని నిర్వాహకులు చెబుతున్నారు. అందువల్లే ఈ మండపం కూడా ఈసారి గిన్నిస్, లిమ్కాబుక్‌ల రికార్డుల పరిశీలనకు వెళ్లనుంది.
– ఈనెల 5 ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు 21 రోజులపాటు కొనసాగనున్నాయి. విశాలమైన లంకా మైదానంలో ఉత్సవ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. విగ్రహాన్ని ప్రతిష్ఠంచినచోటే నిమజ్జనోత్సవం కూడా నిర్వహించనున్నట్టు విశ్వ ప్రతినిధులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశంపై తొలిపూజతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
– భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడంలో కూడా ప్రత్యేకత సంతరించుకొనే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించనున్నారు. బాలింతలకు, చిన్నపిల్లలతో వచ్చినవారికి, గర్భిణులకు దర్శనం కల్పించడంలో అసౌకర్యం, ఆలస్యం లేకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.
12.5 టన్నుల లడ్డూ నైవేథ్యం
వినాయక ఉత్సవాల్లో స్వామివారికి నైవేధ్యంగా 12.5 టన్నుల లడ్డూను తయారు చేయిస్తున్నారు. ఈసారి కూడా లడ్డూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. లడ్డూను తయారు చేసే బాధ్యతను రాజమండ్రి ప్రాంతానికి చెందిన సురుచి స్వీట్స్ యాజమాన్యానికి అప్పగించారు. రూ.30లక్షల విలువైన ఈ భారీ లడ్డూను సురుచి స్వీట్స్ యాజమాన్యం ఉచితంగా అందజేసేందుకు ముందుకొచ్చింది. వినాయకలడ్డూల తయారీ కోసం స్వీట్స్ తయారీ సంస్థ యజమాని మల్లిబాబుతోపాటు మరో 20 మంది వినాయక మాలను ధరించారు.
ప్రతి ఏటా పెరుగుతున్న లడ్డూ సైజు...
గాజువాకలో తొలిసారిగా 2009లో ఏర్పాటు చేసిన భారీ వినాయక ఉత్సవాల సందర్భంగా లంబోదరుడికి కేవలం 50 కేజీల లడ్డూను మాత్రమే నైవేద్యంగా పెట్టారు. ఆ తరువాత ఏడాది 400 కేజీల లడ్డూ, ఆ మరుసటి ఏడాది 500 కేజీల లడ్డూ నైవేధ్యంగా పెట్టిన నిర్వాహకులు 2014 ఏకంగా ఎనిమిదిన్నర టన్నుల లడ్డూను నైవేధ్యంగా పెట్టారు. అంతవరకు ఖైరతాబాద్ వినాయకునివద్ద ఏర్పాటు చేసిన నాలుగు టన్నుల లడ్డు రికార్డును గాజువాక నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఎనిమిదిన్నర టన్నుల లడ్డూ అధిగమించింది. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలోని భక్తాంజనేయ స్వీట్స్‌లో దీన్ని తయారు చేయించారు. గత ఏడాది విశ్వ ఆధ్వర్యంలో నిర్వహించిన 80 అడుగుల వినాయక ఉత్సవాల్లో పది టన్నుల లడ్డూను ప్రసాదంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఇదంతా స్వామి అనుగ్రహం...
గత ఏడాది మేము వినాయక ఉత్సవాలను నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకోలేదు. అప్పటికప్పుడు అనుకొని ప్రారంభించాం. పదిన్నర టన్నుల లడ్డూను స్వామివారికి నైవేధ్యంగా పెట్టగలిగాం. విగ్రహం రూపు కూడా పూర్తిస్థాయి దైవత్వంతో ఎంతో అందంగా వచ్చింది. ఇదంతా వినాయకుడి అనుగ్రహంవల్లే సాధ్యమైంది. ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించాలని ముందుగా అనుకోలేదు. అప్పటికప్పుడు అనుకొని మూడు వారాల క్రితం ప్రారంభించాం. ఆయన అనుగ్రహం ఉండడంవల్లే భారీ ఉత్సవాన్ని నిర్వహించడానికి అన్నీ కుదిరాయి. అంతపెద్ద లడ్డూను స్వామివారికి నైవేధ్యంగా పెట్టడానికి అవకాశం కలిగింది.
– పల్లా రమణ యాదవ్, విశ్వ అధ్యక్షుడు
ప్రత్యేక అనుమతితో విగ్రహ తయారీ...
భారీ విగ్రహాల ఎత్తు విషయంలో హైకోర్టు పరిమితి విధించిన నేపథ్యంలో గాజువాకలో 78 అడుగుల విగ్రహ తయారీకి ప్రత్యేక అనుమతి తీసుకున్నట్టు విశ్వ అధ్యక్షుడు రమణ యాదవ్ తెలిపారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించినచోట కాకుండా వేరే ప్రాంతానికి తరలించి నిమజ్జనం చేసే విగ్రహాలకు మాత్రమే ఎత్తు విషయంలో పరిమితులున్నాయని చెప్పారు. తాము ప్రతిష్ఠించినచోటే విగ్రహాన్ని నిమజ్జనం కూడా చేస్తామని, అందువల్ల తమకు అనుమతి అవసరం లేదని చెప్పారు. అయినప్పటికీ ఐదు ప్రభుత్వ శాఖలనుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్నట్టు చెప్పారు.