లక్నో: యూపీలోని మహోబాలో గణేష్ విగ్రహం నిమజ్జనం సందర్భంగా గలాటా జరిగింది. ఒక ఇంటిపై బాణసంచా పడటంతో రెండు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. అది తోపులాటకు దారితీసింది. చూస్తుండగానే అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కసౌరాటోరి ప్రాంతంలో గణేష్ నిమజ్జనం కోసం రెండు విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరాయి. ఇంతలో ఒక వర్గంవారు వెలిగించిన బాణసంచా మరోవర్గం ఇంటిపై పడడంతో వివాదం చెలరేగింది. దీంతో ఇరువర్గాలకు చెందినవారు బకెట్లతో దాడి చేసుకోవడంతోపాటు, రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడివారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే ఇరువర్గాలవారు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ గణేష్ నిమజ్జనంలో భక్తులపై రాళ్లు రువ్విన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఇరువర్గాలను అతి కష్టంమీద శాంతింపజేసి, నిమజ్జనం సవ్యంగా జరిగేలా చూశారు.
Comments
Please login to add a commentAdd a comment