గతవారం బిజినెస్
ఫ్లిప్‌కార్ట్‌లోకి 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడి!
దేశీ ఈ–కామర్స్ రంగంలో అత్యంత భారీ డీల్‌కు తెరతీస్తూ ఫ్లిప్‌కార్ట్ తాజాగా మరో 1.4 బిలియన్ డాలర్ల నిధులు (సుమారు రూ. 9,300 కోట్లు) సమీకరించింది. 2007లో ఫ్లిప్‌కార్ట్ ఏర్పాటు చేశాక... గడిచిన పదేళ్లలో ఈ సంస్థలోకి ఇంత భారీ ఎత్తున నిధులు రావటం ఇదే ప్రథమం. ఈ నిధుల్ని టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, చైనా ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం టెన్సెంట్ హోల్డింగ్స్‌తో పాటు...
అంతర్జాతీయ అగ్రశ్రేణి ఈ–కామర్స్ సంస్థ ‘ఈబే’ కలిసి సమకూరుస్తున్నాయి. ఈబే తన భారత కార్యకలాపాలను ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం చేయటంతో పాటు... తాజా నిధుల సమీకరణలో భాగంగా తాను 500 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్చేస్తోంది. ఈ నిధులకు, తన కార్యకలాపాల్ని విలీనం చేసినందుకు ప్రతిగా ఫ్లిప్‌కార్ట్‌లో కొంత వాటా తీసుకుంటోంది. అయితే ఆ వాటా ఎంతన్నది వెల్లడి కాలేదు.తాజా నిధుల సమీకరణ ప్రకారం ఫ్లిప్‌కార్ట్ విలువను 11.6 బిలియన్ డాలర్లుగా లెక్కించారు.
జియో నుంచి ‘ధన్ ధనా ధన్’ ఆఫర్
రిలయన్స్ జియో తన ఆఫర్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపెడుతోంది. సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్‌ను రీచార్జ్ చేసుకోలేకపోయిన ప్రైమ్ యూజర్లు, కొత్త కస్టమర్లే లక్ష్యంగా ‘ధన్ ధనా ధన్’ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో భాగంగా కస్టమర్లు రూ.309 రీచార్జ్‌తో 84 రోజులకు 84 జీబీ డేటాను, రూ.509 రీచార్జ్‌తో 84 రోజులకు 168 జీబీ డేటాను పొందొచ్చు. అంటే రోజుకు దాదాపుగా 1 జీబీ (రూ.309), 2 జీబీ (రూ.509) డేటాను పొందొచ్చు. దీనితోపాటు ఇక ఎస్ఎంఎస్, కాల్స్, జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ మూడు నెలలపాటు ఉచితం. ఇక నాన్–ప్రైమ్ యూజర్లు, కొత్త కస్టమర్లు ఇవే ప్రయోజనాలను రూ.408, రూ.608 రీచార్జ్‌లతో పొందొచ్చు. «
గోల్డ్ ఈటీఎఫ్‌లపై ఆనాసక్తి
గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లపై ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2016–17) ఈ ఇన్స్ట్రమెంట్ నుంచి ఇన్వెస్టర్లు రూ.775 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరగడం వరుసగా ఇది నాల్గవ ఏడాది.
డిజిటల్లో తొందరపాటు వద్దు: గాంధీ
దేశంలో డిజిటల్ పేమెంట్ వ్యవస్థల్ని అమల్లోకి తేవటంలో తొందరపాటు వద్దని రిజర్వు బ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నరు ఆర్.గాంధీ హెచ్చరించారు. ‘కుప్పలు తెప్పలుగా డిజిటల్ పేమెంట్ వ్యవస్థలు అమల్లోకి వస్తున్నాయి. వాటిని వినియోగదారులకు అందించే ముందు పూర్తి స్థాయిలో పరీక్షించాలి. లేనిపక్షంలో భద్రతపరమైన సమస్యలు తలెత్తుతాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
పారిశ్రామిక ఉత్పత్తిపై తయారీ దెబ్బ
పారిశ్రామిక ఉత్పత్తి ఫిబ్రవరిలో పేలవ పనితీరును ప్రదర్శించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు పెరుగుదల లేకపోగా –1.2 శాతం (2016 ఫిబ్రవరితో పోలిస్తే) క్షీణించింది. నాలుగు నెలల్లో ఇలాంటి ఫలితం రావడం ఇదే తొలిసారి. తాజా ఫలితానికి మొత్తం సూచీలో దాదాపు 75 శాతంగా ఉన్న తయారీ రంగం ప్రతికూలతే కారణం. ఈ విభాగంలో సైతం అసలు వృద్ధిలేకపోగా –2 శాతం క్షీణత నమోదయ్యింది.
మార్చిలో రిటైల్ ధరల సెగ
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2017 మార్చిలో 3.81 శాతంగా నమోదయ్యింది. అంటే రిటైల్ ధరల బాస్కెట్ మొత్తంగా 2016 మార్చితో పోల్చితే 2017 మార్చిలో 3.81 శాతం పెరిగాయన్నమాట. మార్చికి ముందు గడచిన ఐదు నెలల కాలంలో రిటైల్ ధరలు ఈ స్థాయిలో పెరగలేదు. ఫిబ్రవరిలో ఈ రేటు 3.65 శాతంగా ఉంది. గత ఏడాది మార్చి రేటు 4.83 శాతం. ఆహార ఉత్పత్తుల విషయానికి వస్తే– పాల ధరలు 4.69 శాతం పెరిగితే, పాల ఉత్పత్తుల ధరలు 3.21 శాతం ఎగశాయి. ప్రెపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ ధరలు 5.65 శాతం ఎగశాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం అసలు పెరక్కపోగా – 7.24 శాతం క్షీణించాయి. ఇంధనం, లైట్ కేటగిరీలో ద్రవ్యోల్బణం 5.56 శాతంగా ఉంది.
ఎగుమతుల ఉత్సాహం
భారత్ ఎగుమతులు మార్చిలో మంచి పనితనాన్ని ప్రదర్శించాయి. 2016 మార్చితో పోల్చిచూస్తే, 2017 మార్చిలో ఎగుమతుల విలువ 27.6 శాతం పెరిగింది. ఇది ఐదేళ్ల గరిష్ట స్థాయి. విలువలో ఎగుమతులు 29.23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. కాగా ఆర్థిక సంవత్సరం మొత్తంగా (2016–17 ఏప్రిల్–మార్చి) ఎగుమతుల్లో కేవలం 4.7 శాతం వృద్ధి నమోదయినా... వరుసగా రెండేళ్ల క్షీణతకు బ్రేక్ పడడం హర్షణీయ పరిణామం. ఇక దేశంలోకి దిగుమతులు భారీగా 45.25 శాతం పెరిగి 39.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యా యి. .మార్చిలో ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు– ఆందోళనకర రీతిలో నమోదుకావడం మరో ముఖ్యాంశం. ఈ విలువ ఏకంగా 10.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి.
లక్ష్యాలు దాటిన ‘ముద్రా’ రుణాలు
స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ముద్రా (మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైన్స్ ఏజెన్సీ లిమిటెడ్– ఎంయూడీఆర్‌ఏ) పథకం కింద బ్యాంకులు లక్ష్యాలను మించి రుణాలను అందజేశాయి. గడచిన ఆర్థిక సంవత్సరం అసంఘటిత రంగానికి బ్యాంకులు ఈ పథకం కింద రూ.1.80 లక్షల కోట్లకుపైగా రుణాలను అందజేశాయి. 2016–17లో నిజానికి రుణ పంపిణీ లక్ష్యం రూ.1.80 లక్షల కోట్లు. అయితే ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం, మార్చి నాటికి రూ.1,80,087 కోట్లుగా నమోదయినట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంకా కొన్ని చిన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి సమాచారం రావాల్సి ఉందని కూడా ఈ ప్రకటన వివరించింది.
మార్కెట్లోకి వోల్వో ఎస్60 పోల్‌స్టార్ సెడాన్
స్వీడన్‌కు చెందిన వోల్వో కార్స్ కంపెనీ... వోల్వో ఎస్60 పోల్‌స్టార్ సెడాన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు పరిచయ ధర రూ.52.5 లక్షలు(ఎక్స్ షోరూమ్, ముంబై) అని వోల్వో ఆటో ఇండియా తెలిపింది. 0–100 కిమీ. వేగాన్ని 4.7 సెకన్లలోనే అందుకునే ఈ కారు గరిష్ట వేగం గంటకు 250కిమీ.అని వోల్వో ఆటో ఇండియా ఎండీ టామ్ వాన్ బాన్స్‌డార్ఫ్ పేర్కొన్నారు. భారత్‌లో అందిస్తున్న వోల్వో కార్లలో అత్యంత వేగంగా ప్రయాణించే కారు ఇదేనని, 2–లీటర్, ట్విన్ చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారును రూపొందించామని వివరించారు. ఈ కొత్త ఎస్60 పోల్స్టార్తో లగ్జరీ సెగ్మెంట్లో పూర్తి స్థాయి రేంజ్లో కార్లను అందిస్తున్నామని తెలిపారు. ఈ కారు మెర్సిడెస్ సి43 ఏఎంజీ, సీఎల్ఏ45 ఏఎంజీ, ఆడి ఎస్5 కార్లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.
నిరాశపరిచిన ఇన్ఫోసిస్...
దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ నిరుత్సాహకరమైన ఫలితాలతో బోణీ చేసింది. వ్యవస్థాపకుల ఒత్తిడితో ఒకపక్క ఇన్వెస్టర్లకు డివిడెండ్లు, షేర్ల బైబ్యాక్ రూపంలో భారీమొత్తంలోనే కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. కంపెనీ పనితీరు మాత్రం నిరాశకు గురిచేసింది. ఇన్ఫోసిస్ కన్సాలిడేటెడ్ నికర లాభం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో (2016–17, క్యూ4) రూ.3,603 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన లాభం రూ.3,597 కోట్లతో పోలిస్తే.. వృద్ధి పూర్తిగా అడుగంటి 0.2 శాతానికి పడిపోయింది. మొత్తం ఆదాయం 3.4 శాతం వృద్ధితో రూ.17,120 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఆదాయం రూ.16,550 కోట్లుగా ఉంది.
డీసీబీ బ్యాంక్ లాభం 24 శాతం డౌన్
ప్రైవేట్ రంగంలోని డీసీబీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ. 53 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్ధిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.70 కోట్లతో పోల్చితే 24 శాతం క్షీణత నమోదైందని డీసీబీ బ్యాంక్ తెలిపింది.