న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ మొబైల్ కంపెనీ రిలయన్స్ జియోకు చెందిన టవర్ల వ్యాపారాన్ని కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పార్ట్‌నర్స్ ఎల్‌పీ కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ.25,212 కోట్లు. ఒక భారత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో విదేశీ కంపెనీ పెట్టిన అత్యధిక పెట్టుబడి ఇదే కావటం గమనార్హం. ఈ మేరకు బ్రూక్‌ఫీల్డ్‌తో తమ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఆర్‌ఐఐహెచ్‌ఎల్) ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. ఈ డీల్‌లో భాగంగా టవర్ల వ్యాపారాన్ని నిర్వహించే టవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ కంపెనీలో వంద శాతం వాటాను బ్రూక్‌ఫీల్డ్ కొనుగోలు చేస్తుంది.
ఒప్పందంలో భాగంగానే బ్రూక్‌ఫీల్డ్ అనుబంధ సంస్థ అయిన బీఐఎఫ్ ఫోర్త్ జార్విస్ ఇండియా, ఇతర ఇన్వెస్టర్లకు టవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్న ఆర్‌ఐఐహెచ్‌ఎల్ కంపెనీ యూనిట్లను జారీ చేస్తుందని ముకేశ్ తెలియజేశారు. డీల్ పూర్తయిన తర్వాత టవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌కు స్పాన్సరర్‌గా బ్రూక్‌ఫీల్డ్ వ్యవహరిస్తుంది. ఈ ఒప్పందానికి సంబంధించి అన్ని అనుమతులను త్వరలోనే సాధిస్తామని ఆయన చెప్పారు. ఈ ట్రస్ట్ దేశవ్యాప్తంగా మొత్తం 1,30,000 టవర్లను నిర్వహిస్తోంది. ఈ సంఖ్యను 1,75,000కు పెంచుకోవాలని యోచిస్తోంది. ఈ డీల్ ద్వారా లభించే నిధులను రిలయన్స్ జియో రుణభారాన్ని తగ్గించుకోవడానికి వినియోగించుకోవాలని ఆర్‌ఐఎల్ భావిస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో రిలయన్స్ షేర్ రూ.1,593కు ఎగిసినప్పటికీ, చివరకు 1% నష్టంతో రూ.1,566 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment