స్వశక్తితో ఎదగాలి
ప్రభుత్వ దళిత, గిరిజన బాట’ సభలో మంత్రి రావెల సూచన
పలువురు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
సాక్షి, రాజమహేంద్రవరం :
దళితులు, గిరిజనులు ఇతరులపై ఆధారపడే మనస్తత్వాన్ని వదిలి ఎవరి కాళ్లపై వారు నిలబడాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. ’ప్రభుత్వ దళిత, గిరిజన బాట’ కార్యక్రమాన్ని శుక్రవారం రాజమహేంద్రవరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రావెల మాట్లాడుతూ ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. పథకాలను లబ్థిదారులకు అందించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రూ. 12,000 కోట్ల సబ్‌ప్లా¯ŒS నిధులను పూర్తి స్థాయిలో వారి అభివృద్ధికే కేటాయిస్తున్నామన్నారు. రూ.2000 కోట్ల సబ్‌ప్లా¯ŒS నిధులతో అన్ని కాలనీల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నామని చెప్పారు. దశలవారీగా సంక్షేమ హాస్టళ్లను రెసిడెన్సియల్ పాఠశాలలుగా మారుస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలను సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు ల్యాప్‌టాప్, ట్యాబ్‌లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు అన్ని జిల్లాల్లో అంబేడ్కర్ పేరుతో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఈ కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ..
జిల్లా గ్రామీణాభివృద్ధి ఆధ్వర్యంలో 1011 మంది లబ్థిదారులకు రూ.6.92 కోట్ల చెక్కును మంత్రి రావెల అందజేశారు. పది మంది గిరిజన జంటలకు గిరిపుత్రిక కల్యాణ పథకం కింద ఒక్కొక్కరికి రూ.50 వేల చెక్కును అందించారు. 437 డ్వాక్రా సంఘాలకు రూ.9.37 కోట్లను చెక్కును అందించారు. ఐటీడీఏ పరిధిలో బహిరంగ మలవిసర్జనలేని 37 గ్రామాలకు ప్రోత్సాహక బహుమతిగా రూ.1.85 కోట్ల చెక్కును అందజేశారు. 132 గ్రామాల్లో షెడ్లు, సోలార్ లైట్లు ఏర్పాటుకు అవసరమయ్యే రూ.2.66 కోట్ల చెక్కును అందించారు. పలువురు లబ్ధిదారులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేశారు. ఏజెన్సీ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రత్నాబాయి, అప్పారావు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మేయర్ పంతం రజనీశేషసాయి, మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, అదనపు సంయుక్త కలెక్టర్ పి.రాధాకృష్ణమూర్తి, సాంఘింక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి, ఐటీడీవో పీవో చక్రధరబాబు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
వెలవెల
’దళిత, గిరిజన బాట’ పేరుతో శుక్రవారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన కార్యక్రమం జనాలు లేక వెలవెలబోయింది. దళితులు, గిరిజనులకు వివిధ శాఖల ద్వారా అందించే యూనిట్ల ప్రదర్శన, సబ్‌ప్లా¯ŒS నిధులతో చేపడుతున్న కార్యక్రమాలను వివరించేందుకు ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నాలుగు రోజుల నుంచి ఇతర పనులన్నింటినీ పక్కనబెట్టి ఏర్పాట్లు, జనసమీకణలో తీరకలేకుండా గడిపారు. స్థానికంగా ప్రజలు రారన్న భావనతో ఏజెన్సీ ప్రాంతం నుంచి 25 ఆర్టీసీ బస్సుల్లో గిరిజనులను తరలించారు. ఆర్ట్స్ కళశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భారీగా కుర్చీలు వేయించారు. అయితే సభ ప్రాంగణం సగం కూడా నిండలేదు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన కార్యక్రమలో ఒక్కో నేత చెప్పిందే చెప్పడంతో విగుసు చెందారు. పలువురు సభ చుట్టుపక్కల వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన కేంద్రాలను వీక్షించి వెళ్లిపోయారు. సభకు వచ్చిన జనాల కన్నా ముందు వరసలో కూర్చున్న అధికారులు, విలేకర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో అధికారులు హుటాహుటిన సాంఘిక, సంక్షేమ వసతి గృహాల నుంచి విద్యార్థులను సభ వద్దకు తరలిచారు.