బడికెళ్లడమంటే బాలికలకే బాధ ఎక్కువట
లండన్: పిల్లలను బడికి ఎందుకు పంపిస్తున్నారంటే చదువుకోవడానికి, అకాడమిక్గా పైకి రావడానికని టక్కున సమాధానం ఇస్తారు తల్లిదండ్రులైనా, టీచర్లయినా. బడికి వెళ్లడం వల్ల పిల్లలకు ఎంత ఆనందం కలుగుతోంది? నిజంగా వారు ఆనందిస్తున్నారా, బాధ పడుతున్నారా? అన్న అంశాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ బ్రిటన్లోని కార్డిఫ్ యూనివర్శిటీకి చెందిన రీసెర్చ్ బృందం ఈ అంశంపైనా గత మూడేళ్లుగా అధ్యయనం జరిపింది. వారి అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో చదువుతున్న బాల,బాలికలను తమ పాఠశాల అనుభవాల గురించి ప్రశ్నించగా బాలలు, బాలికలు పరస్పర భిన్నంగా సమాధానాలు ఇచ్చారు. బడికెళ్లడం పట్ల తమకు ఆనందంగా లేదని, ఆందోళనకు గురవుతున్నామని 25 శాతం మంది బాలికలు తెలిపారు. ఆందోళనకు గురవుతున్నామన్న బాలుర సంఖ్య 16.5 శాతం మాత్రమే. పాఠశాల విద్యలో బాలురకన్నా బాలికలే ఎక్కువగా రాణిస్తున్నప్పటికీ పాఠశాలలో తాము ఆనందంగా ఉండలేకపోతున్నామని బాలికలు వాపోవడం ఆశ్చర్యకరం. బడితో తాము అనుబంధాన్ని పెనవేసుకోలేకపోతున్నామన్న బాలికల సంఖ్య కూడా 24 శాతంకాగా, బాలరసంఖ్య 8.8 శాతం మాత్రమే ఉంది. టీచర్లు తనను గుర్తుపట్టరనే బాలికల సంఖ్య 20 శాతం కాగా, బాలుర సంఖ్య 12 శాతం ఉంది.
చదువులో మాత్రం బాలురకన్నా బాలికలే రాణిస్తున్నారన్న విషయాన్ని ఇప్పటికే అనేక అధ్యయనాలు, పరీక్షల ఫలితాలు నిరూపించాయి. దీనికి కారణం ఏమిటని ప్రశ్నించగా, ఆడ టీచర్లకన్నా మగ టీచర్లు తక్కువగా ఉండడం లాంటి కారణాలు గతంలో పరిశోధకులు చెప్పారు. కానీ అవితప్పని, చదువు పట్ల బాలికలకు సానుకూల దృక్పథం ఉండడమే అందుకు కారణమని, అందుకని వారు శ్రద్ధగా చదువుతారని, చదువుకోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారని గతంలో కొన్ని అధ్యయనాలతోపాటు ఈ అధ్యయనంలో కూడా తేలింది.
ప్రాథమిక విద్యలో చదువుతున్న వారిని మూడేళ్ల క్రితం ప్రశ్నించి, మళ్లీ ఇప్పుడు వారిని ప్రశ్నించగా కూడా ఒకేలాంటి సమాధానాలు వచ్చాయని, అప్పటికిప్పటికీ పెద్దగా మార్పు లేదని, పైగా బడికెళ్లడాన్ని తాము ఆనందించలేకపోతున్నామన్న బాలికల సంఖ్య మరికొంత పెరిగిందని అధ్యయనకారులు తెలిపారు. వేల్స్లోని 29 ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలకు చెందిన ఎంపిక చేసిన 1500 మంది బాలబాలికల నుంచి ఈ అభిప్రాయాలను సేకరించారు.