కవుల కలాలు పదునెక్కాలి
గుంటూరు ఈస్ట్: కవులు, రచయితలు తమ కలాలకు పదునుపెట్టి ప్రజలను ఉగ్రవాదం, మతోన్మాదం, జాతి విద్వేషాలు వంటి అంశాల్లో చైతన్యవంతులను చేయాలని గివిక్ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేవీ డోమ్నిక్ పిలుపునిచ్చారు. జేకేసీ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న లిటరసీ ఫెస్టివల్ జాతీయ సెమినార్ శనివారం ముగిసింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డోమ్నిక్ మాట్లాడుతూ కవులు ఎన్నో ఉద్యమాలకు నాంది పలికారన్నారు. సమాజంలో మానవీయ విలువలు పెంపొందించినప్పుడే శాంతి స్థాపన సాధ్యమని చెప్పారు. అనంతరం అన్ని రాష్ట్రాల్లో ఏడాదికి రెండు సార్లు ఆంగ్ల భాషా సదస్సులు నిర్వహించాలని, ఆయా ప్రాంతీయ భాషా సాహిత్యాన్ని ఆంగ్లంలో చర్చించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా సంస్థ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డాక్టర్ టీవీ రెడ్డి, కార్యదర్శిగా కే డోమ్నిక్, ఇతర కార్యవర్గ సభ్యులు డాక్టర్ గోపీచంద్ (గుంటూరు), సారంగి (కోల్కతా), జోజిజాన్ ఫణిక్కర్(కేరళ), అయ్యప్పరాజ (తమిళనాడు) ఎన్నికయ్యారు. సీనియర్ సభ్యులను ఘనంగా సత్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో కళాశాల అధ్యక్షుడు కొండబోలు బసవపున్నయ్య, కార్యదర్శి జే మురళీమోహన్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్ నాగేశ్వరరావు, ఆంగ్ల అధ్యాపకులు డాక్టర్ పీ నాగసుశీల తదితరులు పాల్గొన్నారు.