అవ్వతాతలను ఇంట్లో పెట్టి నిప్పు
► డబ్బివ్వలేని మనవరాలి దాష్టీకం
► వృద్ధులకు గాయాలు
మైసూరు: డబ్బులడిగినందుకు మందలించారనే కోపంతో ఒక యువతి తన అవ్వతాతలపై దాడి చేసి ఇంటికి నిప్పుపెట్టి పరారైంది. బాధితులకు గాయాలు కాగా ఇరుగుపొరుగు రక్షించారు. మైసూరు సిటీ హెబ్బాళలోని లక్ష్మీ కాంతనగరలో గురువారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే... తల్లి ఆత్మహత్య చేసుకోగా, తండ్రి మరో పెళ్ళి చేసుకుని వెళ్లిపోయాడు.
దీంతో ఆయన కూతురు ప్రియదర్శిని (22) తన అవ్వతాత సోమసుందర్ (85), లీలావతి (80)ల వద్ద ఉంటోంది. ఇంటర్ ఫెయిలైన ఆమె ఎప్పుడూ స్నేహితులతో గడిపేది. రోజు ఖర్చుల కోసం డబ్బులు కావాలని వృద్ద దంపతులతో గొడవ పడేది. చాలాసార్లు చుట్టుపక్కలవారు మందలించినా పట్టించుకునేది కాదు. గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ప్రియదర్శిని, తనకు డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఇంటిని మిమ్మల్ని ఇద్దరినీ మంటల్లో వేసి తగలబెడతానని బెదిరించింది. ఎప్పుడూ ఉండే గొడవే కదా అని వృద్ధ దంపతులు పట్టించుకోలేదు. అయితే ఆమె అన్నంతపనీ చేసింది. ఇంట్లో నిప్పంటించి పారిపోయింది. ఇంట్లోంచి మంటలు ఎగసిపడడంతో చుట్టుపక్కల వారు వచ్చి వృద్ధులను బయటకు తీసుకొచ్చారు. పోలీసులు, ఫైర్‌సిబ్బంది మంటలను అదుపుచేశారు. దాడికి పాల్పడిన యువతి పరారీలో ఉంది. ఆమె డ్రగ్స్ మత్తులోనే ఈ అకృత్యానికి పాల్పడి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.