చూడ‘చెక్క’ని ఎయిర్‌క్రాఫ్ట్..
భీమవరం : కేవలం చెక్క విడి భాగాలతో ఇంజినీరింగ్ విద్యార్థులు తయారు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ వంటి గ్లైడర్ గాలిలో చక్కర్లు కొట్టి అబ్బుర పరిచింది. ఈ విన్యాసం స్థానిక శ్రీ విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం చోటు చేసుకుంది. కళాశాలలోని మొదటి సంవత్సర విద్యార్థులకు శనివారం గ్లైడర్ షో నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, గ్రూప్వర్క్, ఇంజినీరింగ్ ప్రక్రియపై పట్టు సాధించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి వచ్చిన ఏరో నాటికల్ ఇంజినీర్ల బృందం మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్‌ల తయారీ, వాటిని వినియోగించే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చెక్క విడి భాగాలతో తయారు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ వంటి గ్లైడర్ విశేషంగా ఆకట్టుకుంది. దీనిని గాలిలోకి ఎగురవేసి ఎంత సమయం చక్కర్లు కొట్టిందో విద్యార్థులు పరీక్షించి చూశారు. గ్లైడర్ షోను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు పర్యవేక్షించారు.