పోటీతత్వంలో భారత్ మరింత ముందుకు
♦ సూచీలో 39వ స్థానానికి చేరిక
♦ 16 స్థానాలు మెరుగు
♦ వెల్లడించిన ప్రపంచ ఆర్థిక వేదిక
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పోటీతత్వంలో భారత్ తన జోరు కొనసాగిస్తోంది. ప్రపంచ పోటీతత్వసూచీ (గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్)లో 16 స్థానాలను మెరుగుపరచుకుని... మొత్తం 138 దేశాలతో కూడిన సూచీలో 39వ స్థానానికి ఎగబాకింది. ఈ స్థాయిలో స్థానాన్ని మెరుగుపరచుకోవడం భారత్‌కే సాధ్యం అయింది. గతేడాది ఈ సూచీలో భారత్ స్థానం 55. గతేడాది కూడా మన దేశం ఈ సూచీలో 16 స్థానాలు మెరుగుపరచుకుంది. ఇక బ్రిక్స్ దేశాల్లో చైనా తర్వాతి స్థానం భారత్‌దే. సూచీలో చైనా 28వ స్థానాన్ని దక్కించుకుంది. బ్రెజిల్(81), రష్యా (43), దక్షిణాఫ్రికా(47) కంటే మన దేశమే పోటీతత్వంలో ముందుంది.
ఈ మేరకు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. స్విట్జర్లాండ్, సింగపూర్, అమెరికా మొదటి మూడు స్థానాలను నిలబెట్టుకున్నాయి. శ్రీలంక 71వ స్థానంలో ఉండగా, పాకిస్తాన్ నాలుగు స్థానాలను దాటుకుని 122కు చేరుకుంది. ‘మౌలిక వసతుల విషయంలో భారత్ ర్యాంక్ చాలా దిగువ స్థాయిలో ఉండగా... ఇదే విషయంలో గణనీయమైన ప్రగతిని సాధించింది’ అని నివేదిక స్పష్టం చేసింది.