ఆహారం వృధాపై ఆస్ట్రేలియా యుద్ధం!
సిడ్నీ: ఆహార పదార్థాలు వృథా కావడంపై ఆస్ట్రేలియాలో యుద్ధభేరి మోగింది. ఏటా 15 బిలియన్ డాలర్ల విలువచేసే ఆహార పదార్థాలు వృధా అవుతున్నట్లు ఆస్ట్రేలియా అంచనా వేసింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్న కనిపించని సమస్యగా ప్రకటించింది. మెల్బోర్న్లో జరిగిన గ్లోబల్ ఫుడ్ ఫోరమ్ సదస్సులో ఆస్ట్రేలియా వ్యాపారవేత్త ఆంథోనీ ప్రట్ ఈ విషయమై మాట్లాడుతూ... ఆస్ట్రేలియాలో పైకి కనిపించిన సమస్య ఆహారం వృధా కావడమేనని, ఇది వ్యాపారులకే కాకుండా సామాన్యులకు కూడా ఆర్థికంగా ఎంతో నష్టం కలిగిస్తోందన్నారు.
ఆహారంపై అధికంగా ఖర్చు చేయడాన్ని ప్రజలంతా తగ్గించుకోవాలని, ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసే కంపెనీలు కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార పదార్థాల ఉత్పత్తిపైనే దృష్టి సారించాలని సూచించారు. ఈయన సూచన మేరకు ఈ ఏడాది నవంబర్లో జాతీయ ఆహార వృధా సదస్సును నిర్వహించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ఓ సవాలుగా స్వీకరించి, దేశ ప్రజలందరినీ సమస్య పరిష్కారంవైపు నడిపించాలని ఆ దేశ మంత్రి జోష్ ఫ్రిడెన్బర్గ్ పిలుపునిచ్చారు.