'వర్మను అడ్డుకోండి.. 'వంగవీటి' వద్దు'
విజయవాడ: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త వివాదంలో చిక్కుకోనున్నారు. ఆయనపై విజయవాడకు చెందిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ కొత్తగా దర్శకత్వం వహించనున్న చిత్రం 'వంగవీటి' ఆపేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకప్పుడు విజయవాడను గడగడలాడించిన వంగవీటి రాధ కథ ఆధారంగా తాను వంగవీటి చిత్రాన్ని తీస్తున్నానని, ఇదే తెలుగులో తన ఆఖరి చిత్రం అవుతుందని వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే.
దీంతో ఒక్కసారిగా వ్యతిరేకత వచ్చింది. ప్రశాంతంగా ఉన్న విజయవాడలో మరోసారి టెన్షన్ మొదలవుతుందని, వర్మ ఆ చిత్రాన్ని తెరకెక్కించడం ఆపేయాలంటూ గ్లోబల్ గాంధీ ట్రస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వంగవీటి చిత్ర నిర్మాణాన్ని నిలువరించాలని ట్రస్టు విజయవాడ ఇంఛార్జి సీపీ ఎన్వీ సురేందర్ బాబు ఫిర్యాదులో కోరారు. 'రామ్ గోపాల్ వర్మ చిత్రం వంగవీటి ద్వారా ప్రశాంతంగా ఉన్న నగరంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలని అనుకుంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఆ చిత్ర నిర్మాణాన్ని ఆపేయాలి' ఆయన కోరారు.