రూమ్ టు రీడ్
పుస్తక నేస్తం
సానుభూతి చూపడానికి పెద్దగా రిస్క్ అక్కర్లేదు. అయితే పదిమందికి సహాయం చేయడానికి ‘మంచి మనసు’తో పాటు రిస్క్ తీసుకునే ధైర్యం కూడా ఉండాలి. ఆ ధైర్యమే జాన్ వుడ్‌ను ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసింది. జాన్ వుడ్ అనే పేరు వినబడగానే... ‘రూమ్ టు రీడ్’ గుర్తుకు వస్తుంది. ‘రూమ్ టు రీడ్’ అనేది ఒక గ్లోబల్ ఎన్జీవో.
‘అక్షరాస్యత’, ‘లింగ వివక్ష’ ప్రధాన అంశాలుగా శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా) కేంద్రంగా మన దేశంతో సహా ఆసియా, ఆఫ్రికాలలో పది దేశాల్లో పని చేస్తోంది. విద్యావ్యాప్తికి కృషి చేయడం, పుస్తకపఠనంపై విద్యార్థుల్లో అభిరుచిని ప్రేరేపించడంతో పాటు... సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం, సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యాన్ని పెంపొందించడం, కొత్తగా ఆలోచించడం, ఆకట్టుకునేలా మాట్లాడడం... మొదలైన ‘లైఫ్ స్కిల్క్’ను విద్యార్థులకు నేర్పుతోంది.
అమెరికాలోని హార్ట్‌ఫోర్డ్‌లో జన్మించిన జాన్ వుడ్ యూనివర్సిటీ ఆఫ్ కొలొరోడో నుంచి బ్యాచిలర్ డిగ్రీ, నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ నుంచి ‘బిజినెస్ అడ్మినిస్ట్రేషన్’లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు... మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. పని నుంచి విరామం కోసం ఒకసారి నేపాల్‌కు వెళ్లారు జాన్. అనుకోకుండా... అక్కడ ఒక ప్రైమరీ స్కూలుకు వెళ్లారు. ఆ స్కూల్లో 450 మంది పిల్లలు ఉన్నారు... అయితే చదువుకోవడానికి పది పుస్తకాలకు మించి లేవు. పుస్తకాలు కొనే ఆర్థిక స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడమే దీనికి కారణం అనే విషయం జాన్ వుడ్‌కు అర్థమైంది.
‘‘మీరు మరోసారి ఇక్కడికి వచ్చినప్పుడు పుస్తకాలతోనే వస్తారేమో... ఎవరు చెప్పొచ్చారు!’’ అన్నాడు అక్కడి హెడ్ మాస్టర్. ఆయన సరదాగా అన్నాడో, సీరియస్‌గా అన్నాడో తెలియదుగానీ... జాన్ వుడ్ మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. పిల్లల కోసం తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. ఒక సంవత్సరం తరువాత...మూడు వేల పుస్తకాలతో నేపాల్‌కు వెళ్లారు. పిల్లల కళ్లలో కనిపించిన కాంతిని స్వయంగా చూశారు. ఇంకా ఏదైనా చేయాలనిపించింది. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ‘రూమ్ టు రీడ్’ ను స్థాపించారు.
మరి ‘రూమ్ టు రీడ్’ ఏం చేసింది?
ఎన్నో సూళ్లను నిర్మించింది. వేలాది గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది. కోటికి పైగా పుస్తకాలను పంపిణీ చేసింది. విద్యార్థినులకు ఉపకార వేతనాలు ఇస్తుంది. మన తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో ‘రూమ్ టు రీడ్’ సేవలందిస్తోంది. రంగుల కార్టూన్ల పుస్తకాల నుంచి, పజిల్స్ పుస్తకాల వరకు... విద్యార్థులు తమ అభిరుచికి తగిన పుస్తకాలు చదువుకోవచ్చు. ఈ పుస్తకాల రంగులకు కూడా ప్రత్యేకత ఉంది. ఆకుపచ్చ, ఎరుపు రంగు పుస్తకాలలో పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి. ఇవి 1-2 తరగతుల పిల్లలకు ఇస్తారు. తెలుపు, పసుపు, నీలం, నారింజ రంగుల పుస్తకాలు పెద్ద పిల్లలకు ఇస్తారు. అక్కడెక్కడో అమెరికాలో మైక్రోసాఫ్ట్‌లో పని చేసిన జాన్ వుడ్‌కు... నేపాల్‌లో... ‘రూమ్ టు రీడ్’ ఆలోచన వచ్చింది. మంచి ఆలోచనకు దూరంతో పని లేదు. అందుకే ‘రూమ్ టు రీడ్’ అంత దూరం నుంచి మన దగ్గర రెక్కలు కట్టుకొని వాలింది!‘లీవింగ్ మైక్రోసాఫ్ట్ టు ఛేంజ్ ది వరల్డ్’ పుస్తకం జాన్ వుడ్‌కు మంచి పేరు తీసుకువచ్చింది.
ఇది పుస్తకం అనడం కంటే... జాన్ మానసిక ప్రపంచంలోని వివిధ కోణాలను స్పష్టంగా పరిచయం చేయడం అంటే బాగుంటుంది. ‘మైక్రోసాఫ్ట్’లాంటి పెద్ద సంస్థలో సక్సెస్ఫుల్ సాఫ్ట్ ఎగ్జిక్యూటివ్‌గా రాణించిన జాన్ వుడ్... బంగారంలాంటి తన ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నాడు? హిమాలయాల ఏకాంతం ఏ పాఠాలు నేర్పింది?... ఇలా తెలుసుకోదగ్గ విషయాలెన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ‘మీరు కూడా ఏదో ఒకటి చేయండి’ అని మనల్ని ప్రేరేపిస్తాయి. నేర్చుకున్న విద్య, పాఠం ఎప్పుడూ వృథా పోదు. చదువులో నేర్చుకున్న పాఠాలను, ఉద్యోగంలో నేర్చుకున్న మెలకువలను ‘రూమ్టు రీడ్’లో విజయవంతంగా అమలుపరిచారు జాన్ వుడ్.