ప్రభుత్వ బ్యాంకులకు రూ.1.9 లక్షల కోట్లు కావాలి
♦ 2019 మార్చి నాటికి దీన్ని సమకూర్చాల్సిందే...
♦ బ్యాంకుల మూలధన అవసరాలపై ఎస్ అండ్ పీ అంచనా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకులకు 2019 మార్చి నాటికి రూ.1.9 లక్షల కోట్ల (29.6 బిలియన్ డాలర్లు) తాజా మూలధనం అవసరమవుతుందని గ్లోబల్ రేటింగ్ సంస్థ– ఎస్ అండ్ పీ అంచనావేసింది. లేదంటే నిరర్థక ఆస్తులకు (ఎన్పీఏ) కేటాయింపులు కష్టతరం అవుతాయని తన తాజా నివేదికలో వివరించింది. మూలధన అవసరాలకు సంబంధించి అంతర్జాతీయ బాసెల్–3 ప్రమాణాల అమలుకూ తాజా మూలధనం అవసరమని విశ్లేషించింది. సంస్థ క్రెడిట్ అనలిస్ట్ గీతా చౌ రూపొందించిన నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే...
♦ తాజా మూలధనం కల్పించలేని పక్షంలో బలహీనంగా ఉన్న లాభదాయకత... బ్యాంకులపై ఒత్తిళ్లను పెంచుతుంది.
♦ ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ మూలధన అవసరాలను నెరవేర్చుకోడానికి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
♦ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించటంలో భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రధానంగా 3 సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఒకటి ఈక్విటీ విలువలు కనిష్ట స్థాయిలో ఉండటం కాగా రెండోది ఎక్కువ సంఖ్యలో బ్యాంకులుండటం. నియమ నిబంధనల చట్రం మూడవది. అదే సమయంలో అడిషనల్ టైర్–1 క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్ల జారీ ద్వారా నిధుల సమీకరణ కూడా వాటికి కష్టం కావచ్చు. ఈ ఇన్‌స్ట్రుమెంట్లపై డిఫాల్డ్ రిస్క్ అధికంగా ఉండటమే దీనికి కారణం.
♦ ప్రభుత్వ రంగ బ్యాంకులకు మద్దతు విషయంలో ప్రభుత్వ నిబద్ధత సుస్పష్టంగా కనబడుతోంది.
♦ దేశంలో పటిష్ట బ్యాంకింగ్‌కు సానుకూల వాతావరణం కనబడుతోంది. బలహీన ప్రభుత్వ రంగ బ్యాంకులు క్రమంగా తమ మార్కెట్ షేర్‌ను లాభదాయక ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు అలాగే నాన్–బ్యాంక్ ఫైనాన్స్ సంస్థలకు కోల్పోయే వీలుంది.