హైదరాబాద్ తొమ్మిదో ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తాజా సీజన్లో హైదరాబాద్ పరాజయాలకు ఇప్పట్లో పుల్‌స్టాప్ పడేలా లేదు. శుక్రవారం ఇక్కడి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ 1–3 గోల్స్ తేడాతో చెన్నైయిన్ ఎఫ్‌సీ చేతిలో ఓడింది. దీంతో సీజన్లో తొమ్మిదో పరాజయాన్ని మూటగట్టుకొని ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. చెన్నై ఆటగాడు వాల్‌స్కీస్ (43వ, 65వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... రాఫెల్ (40వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. హైదరాబాద్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను మార్సెలినో (87వ నిమిషంలో) చేశాడు. 12 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఐదు పాయింట్లతో చివరిదైన పదో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీతో ఒడిశా ఎఫ్‌సీ తలపడుతుంది.