బ్యాంకుల చేతికి...జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ!
♦ 55 శాతం మెజారిటీ వాటా...
♦ ఎస్డీఆర్ అమలుకు బ్యాంకుల కన్సార్షియం నిర్ణయం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో సంస్థ బ్యాంకుల చేతికి చేరింది. ఇన్ఫ్రా దిగ్గజం జీఎంఆర్ గ్రూప్‌లో భాగమైన జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ (జీఆర్‌ఈఎల్)కి ఇచ్చిన లోన్లకు సంబంధించి వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక (ఎస్డీఆర్)ను అమలు చేయాలని బ్యాంకుల కన్సార్షియం నిర్ణయించింది. దీర్ఘకాలిక ఇంధన సరఫరా ఒప్పందాలు (ఎఫ్ఎస్ఏ), దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు లేకపోవడంతో బ్యాంకుల కన్సార్షియం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా తెలిపింది. జీఆర్‌ఈఎల్ మొత్తం రుణ భారం (వడ్డీ బకాయిలు కూడా కలిపి) రూ. 3,780 కోట్లు ఉండగా, ఇందులో రూ. 1,414 కోట్ల మొత్తాన్ని బ్యాంకులు ఈక్విటీలు కింద మార్చుకున్నాయి.
దీంతో జీఆర్ఈఎల్లో బ్యాంకుల కన్సార్షియంనకు 55 శాతం వాటాలు దక్కనుండగా, మిగతా 45 శాతం జీఎంఆర్ వద్ద ఉంటుంది. ఇందుకు సంబంధించి శుక్రవారం సమావేశంలో షేర్లను కేటాయించినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా వెల్లడించింది. మిగతా రూ. 2,366 కోట్ల రుణ మొత్తాన్ని 10.75 శాతం వడ్డీ రేటుతో 20.5 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. 1.75 సంవత్సరాల మారటోరియం లభిస్తుందని వివరించింది. ఎస్డీఆర్ అనంతరం ప్రాజెక్టులో మొత్తం ఈక్విటీ విలువ రూ. 2,571 కోట్లుగా ఉంటుందని జీఎంఆర్ ఇన్ఫ్రా పేర్కొంది. రుణ భారంతో పాటు వడ్డీ వ్యయాలు కూడా తగ్గడమనేది దీర్ఘకాలికంగా ప్రాజెక్టు లాభదాయకతకు తోడ్పడగలదని తెలిపింది. రుణాల భారంతో కుదేలైన ఐవీఆర్సీఎల్ ఇప్పటికే బ్యాంకుల చేతికి చేరగా, మరోఇన్ఫ్రా సంస్థ ల్యాంకో గ్రూప్‌లోనూ బ్యాంకులు ఎస్డీఆర్ అమలు యోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీఆర్ఈఎల్లో ఎస్డీఆర్ అమలు ప్రాధాన్యం సంతరించుకుంది.
జీఆర్‌ఈఎల్ ..
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో 768 మె.వా. గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంటును జీఆర్‌ఈఎల్ నిర్వహిస్తోంది. 2012లోనే ప్రాజెక్టు పూర్తి అయింది. అయితే, కేజీ-డీ6 క్షేత్రంలో గ్యాస్ ఉత్పత్తి అనూహ్యంగా పడిపోవడంతో ఇంధన సరఫరా లేక విద్యుదుత్పత్తి ప్రారంభించడంలో జాప్యం జరిగింది. ఫలితంగా వ్యయాలూ భారీగా పెరిగిపోయాయి. ఈ-ఆర్ఎల్ఎన్జీ బిడ్డింగ్ స్కీము కింద గ్యాస్ లభించడంతో 2015 అక్టోబర్‌లో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. నిల్చిపోయిన గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లకు గ్యాస్ సరఫరా చేసే ఉద్దేశంతో కేంద్రం ప్రతిపాదించిన ఈ-ఆర్ఎల్ఎన్జీ బిడ్డింగ్ స్కీములో మూడో దశ కింద గెయిల్ నుంచి సంస్థకు గ్యాస్ సరఫరాకు హామీ దక్కింది. దీంతో 30 శాతం దాకా పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సామర్ధ్యం మేర విద్యుదుత్పత్తికి వీలు కానుంది.