యనమల కరుణించేనా!
సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు కోసం ఎదురుచూపు
రూ.173కోట్ల మేర పెండింగ్‌లో జీఎన్ఎస్ఎస్ ఫేజ్-1 పనులు
ఫేజ్-2కు రూ.1580 కోట్లు అవసరం
నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న యనమల
సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సాగునీటి ప్రాజెక్టులపై ఉన్న శ్రద్ధ ఆ తర్వాత పాలకులకు లేకపోవడంతో జిల్లాలోని ప్రాజెక్టులు మరుగున పడ్డాయి. మెట్టప్రాంతానికి ప్రాణప్రదమైన సాగునీటి రంగాన్ని ఐదేళ్లుగా విస్మరిస్తున్నారు. జిల్లాకు గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు అత్యంత కీలకం. అందులో జిఎన్ఎస్ఎస్ ఫేజ్-1 పనులు మరీ ముఖ్యమైనవని చెప్పాలి. ఈ పనులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యంత ప్రాధాన్యత కల్పించారు. అందులో భాగంగా శరవేగంగా పనులు చేపట్టారు. ఆయన హయాంలో 90 శాతం పనులు పూర్తి అయితే, మిగిలిన 10శాతం పనులు ఐదేళ్లు గడిచిపోయినా సాధ్యం కావడంలేదు. తక్కువ ఖర్చుతో మనుగడలోకి రానున్న ప్రాజెక్టుల పట్ల పాలకపక్షానికి శ్ర ద్ధ లేకపోవడమే ప్రస్తుత దుస్థితికి కారణంగా పలువురు పేర్కొంటున్నారు.
గాలేరు-నగరి అత్యంత కీలకం....
జిల్లాలో లక్షా అరవై ఐదువేల ఎకరాలకు సాగునీరు, మెట్ట ప్రాంతాల్లో భూగర్భజలాలు పెంపొందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చే శారు. అందులో అంతర్భాగమైన గండికోట ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుకు అవుకు రిజర్వాయర్ నుంచి నీరు తరలించేందుకు రూపొందించిన వరద కాలువ, 5 కిలో మీటర్ల మేర టన్నల్ పనులు పూర్తయ్యాయి. అలాగే వామికొండ, సర్వారాయసాగర్ ప్రాజెక్టులు సైతం పూర్తయ్యాయి. వాటిని సంబంధించిన స్ట్రక్చర్స్ అక్కడక్కడ పెండింగ్‌లో ఉన్నాయి. వీటి కోసం సుమారు రూ.173కోట్లు అవసరమని ఇంజినీరింగ్ యంత్రాంగం ప్రభుత్వానికి నివేదికలు అందించింది. వీటిని ఖర్చు చేయగల్గితే జిల్లాకు బహుళ ప్రయోజనాలు కలగనున్నాయి.
జీఎన్ఎస్ఎస్ ఫేజ్-2కు రూ.827కోట్లు అవసరం..
గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా పేజ్-2 పనులకు రూ.827 కోట్లు అవసరం ఉన్నట్లు ఇంజనీరింగ్ నిపుణులు ప్రభుత్వానికి వివరించారు. వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో చేపట్టాల్సిన పనులకు ప్రభుత్వ ప్రాధాన్యతను బట్టి నిధులు కేటాయించనున్నారు. అలాగే జిల్లాకు చెందిన గండికోట లిఫ్ట్‌కు రూ.47కోట్లు, పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు రూ.66కోట్లు, లింగాల కెనాల్‌కు రూ.70కోట్లు నిధులు అవసరం కానున్నాయి.
మైలవరం ఆధునికీకరణకు రూ.28 కోట్లు గండికోట- సీబీఆర్ లిఫ్ట్‌కు రూ.287కోట్లు వెచ్చించాల్సి ఉంది. కేసీ కెనాల్ ఆధునికీకరణ, తెలుగుగంగ ప్రాజెక్టులతో కలిపి జిల్లా మొత్తానికి ప్రాజెక్టుల నిర్వహణకు రూ.1580 కోట్లు అవసరం కానున్నాయి. అలాగే భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, ఫారెస్టు క్లియరెన్సు కోసం మరో రూ.1200కోట్ల నిధులు అవసరం కానున్నాయి. వీటిలో ఏయే ప్రాజెక్టులకు ఎంతమేరకు ప్రాధాన్యత ఇస్తారో అనే ఆసక్తి జిల్లా ప్రజల్లో ఉంది.
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సాగునీటి రంగానికి ఏమేరకు నిధులు కేటాయిస్తారోనని సర్వత్రా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది రూ.400 కోట్లు జిల్లాలోని ప్రాజెక్టులకు కేటాయించినా, కేవలం రూ.160 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. అలాంటి పరిస్థితిని అధిగమించగల్గితే జీఎన్ఎస్ఎస్ ఫేజ్-1 పనుల్ని పూర్తి చేసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. మరి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందో మొండి చేయి చూపుతుందో వే చి చూడాల్సిందే.