జీఓ 39 రద్దు చేసే వరకు పోరాటం
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, వికారాబాద్: టీఆర్ఎస్ కార్యకర్తల పదవుల పందేరం కోసం విడుదల చేసిన జీఓ 39ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. జీవో 39ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం వికారాబాద్‌లో భారీ బైక్ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ధర్నాలో గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రైతు కమిటీల పేరుతో టీఆర్ఎస్ పార్టీ వారికే పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను పక్కనబెట్టి రాష్ట్ర ప్రభు త్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నదన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్వేషాలు పెంచడానికే : రాఘవరెడ్డి
రైతుల మధ్య విద్వేషాలు పెంచడానికే రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి దుయ్యబట్టారు. కోట్లు పెట్టి సీఎం క్యాంపు ఆఫీసు నిర్మించుకొని పేదలకు ఒక్క ఇళ్లయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. అనంతరం ఆర్డీవో కార్యాల యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్ర మంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోళ్ల యాద య్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రజని, రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మానందరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు వెంకటరమణ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి, జీహెచ్ఎంసీ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇమాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
జగన్ సీఎం అయితే పద్మనాభుడికి రూ.10 కోట్ల విరాళం
ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే అనంత పద్మనాభస్వామి ఆలయ అభివృద్ధికి వైఎస్సార్ సీపీ తెలంగాణ శాఖ తరఫున రూ.10 కోట్లు విరాళంగా అందజేస్తామని గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. అనంతగిరిలోని అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.