గోవా ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు జీఎంఆర్ చేతికి
ప్రాజెక్టు విలువ సుమారు రూ. 3,300 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ ఇన్ఫ్రా తాజాగా గోవాలో విమానాశ్రయ ప్రాజెక్టును దక్కించుకుంది. ఉత్తర గోవాలోని మోపాలో చేపట్టే ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ. 3,300 కోట్లుగా ఉంటుందని అంచనా. బీవోవోటీ (బిల్డ్, వోన్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) ప్రాతిపదికన దీన్ని నిర్మించాల్సి ఉంటుంది. జీవీకే గ్రూప్, వోలప్టాస్ డెవలపర్స్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎస్సెల్ ఇన్ఫ్రా తదితర సంస్థలు కూడా పోటీపడినప్పటికీ .. ఫైనాన్షియల్ బిడ్డింగ్‌లో జీఎంఆర్ విజేతగా నిల్చింది. శుక్రవారం ఇందుకు సంబంధించిన బిడ్లను తెరిచారు.
ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆదాయాల్లో ప్రభుత్వంతో పంచుకునే వాటాకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ 32.31 శాతం, ఎస్సెల్ ఇన్ఫ్రా 27 శాతం కోట్ చేయగా.. జీఎంఆర్ 36.99 శాతం కోట్ చేసింది. రుణ సమీకరణ ద్వారా ఈ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను జీఎంఆర్ సమకూర్చుకోనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈక్విటీ షేర్లు, ఈక్విటీ ఆధారిత సాధనాలు, డిబెంచర్లు మొదలైన వాటి జారీ ద్వారా రూ. 2,500 కోట్ల దాకా సమీకరించనున్నట్లు కంపెనీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 14న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనకు షేర్‌హోల్డర్ల అనుమతి కోరనున్నట్లు పేర్కొంది. జీఎంఆర్ ఇన్ఫ్రా ఇప్పటికే హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది.
గోవాలో రెండో విమానాశ్రయం..
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సెప్టెంబర్ రెండో వారంలో మోపా విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దక్షిణ గోవాలో ఇప్పటికే దబోలిమ్ ఎయిర్పోర్ట్ ఉండగా.. రాష్ట్రంలో ఇది రెండో విమానాశ్రయం కానుంది. నేవీ నిర్వహణలో ఉండే దబోలిమ్ ఎయిర్‌పోర్టులో పౌర విమానాల రాకపోకలకు సంబంధించి పలు నియంత్రణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రెండో విమానాశ్రయం ప్రతిపాదన తెరపైకొచ్చింది. సుమారు 2,271 ఎకరాల్లో .. తొలుత వార్షికంగా తొంభై లక్షల ప్రయాణికుల సామర్ధ్యంతో మోపా విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు.
సుమారు 149 ఎకరాల్లో ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యూయలింగ్ సెంటర్లు, కార్ పార్కింగ్ మొదలైనవి ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఏవియేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను కూడా నెలకొల్పాల్సి ఉంటుంది. 2019 నాటికల్లా ఎయిర్పోర్ట్ తొలిదశ అందుబాటులోకి రాగలదని అంచనా. తొలి దశలో 44 లక్షల మంది ప్రయాణికుల సామర్ధ్యంతో విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. 2045 నాటికి 1.31 కోట్ల మంది ప్రయాణికుల సామర్ధ్యం ఉండేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు.
గ్రీస్ ఎయిర్‌పోర్టుకూ బిడ్డింగ్?
గ్రీస్‌లోని హెరాక్లియోన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి ప్రాజెక్టు కోసం కూడా జీఎంఆర్ బిడ్డింగ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గ్రీస్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో రెండోదైన ఈ ఎయిర్‌పోర్టు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలు కల్పించేలా పౌర విమానయాన శాఖ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్‌ను కూడా కంపెనీ పొందినట్లు సమాచారం. అంతర్జాతీయంగా జీఎంఆర్ ఇప్పటికే ఫిలిప్పీన్స్‌లోని మక్టాన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును నిర్వహిస్తోంది. టర్కీ ఇస్తాంబుల్ విమానాశ్రయంలో వాటాలను కొన్నాళ్ల క్రితం విక్రయించి వైదొలగింది. మాల్దీవుల్లోని మాలే అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ అంశం వివాదంలో ఉంది.