సాధనతోనే లక్ష్యం సాధ్యం
ఆదిలాబాద్ స్పోర్ట్స్ : క్రీడాకారులు సాధనతోనే విజయం దిశగా సాగుతూ లక్ష్యాన్ని చేరుతారని డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అండర్-17 కబడ్డీ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దామోదర్ మాట్లాడుతూ క్రీడాకారులు నిత్య సాధన చేయాలని, క్రీడాస్ఫూర్తితో మెదలాలని పిలుపునిచ్చారు.
జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమేనన్నారు. జిల్లా స్థాయి క్రీడలే కాకుండా రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పారు. జిల్లా రాష్ట్రస్థాయి క్రీడలను తీసుకురావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శికి ఆదేశించారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎన్.సుధాకర్‌రావు మాట్లాడుతూ క్రీడలు జీవితపు పాఠాలు నేర్పుతాయని, అన్ని విధాలుగా క్రీడలు భవిష్యత్తును అందిస్తాయని వివరించారు.
జిల్లా స్థాయిలో క్రీడలకు హాజరైన క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో, క్రమశిక్షణతో నడుచుకోవాలని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 340 మంది బాలబాలికలు క్రీడా పోటీలకు హాజరయ్యారు. మూడు కోర్టులలో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కె.రాంమోహన్‌రావు, హాకీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కోరెడ్డి పార్థసారథి, గౌతమీ మోడల్ స్కూల్ రాష్ట్ర డెరైక్టర్ రమన్, ప్రిన్సిపల్ బసంత్‌కుమార్, మాజీ ఎస్జీఎఫ్ కార్యదర్శి దయానందరెడ్డి, పీఈటీలు రాష్ట్రపాల్, విఠల్‌రెడ్డి, స్వామి, నాందేవ్, సాయికుమార్, మమత, శ్రీనివాస్ పాల్గొన్నారు.