బంగ్లాదేశ్‌లో న్యాయదేవతనే లేపేశారు!
బంగ్లాదేశ్‌ను ఓ లౌకికవాద దేశంగా స్ఫురింపచేస్తూ సుప్రీంకోర్టు ఆవరణలో ఆవిష్కృతమైన వివాదాస్పదమైన ‘న్యాయ దేవత’ విగ్రహాన్ని శుక్రవారం తొలగించారు. ఎడమ చేతిలో త్రాసు, కుడిచేతిలో కరవాలం పట్టుకున్న ఈ విగ్రహం గ్రీకు న్యాయదేవత ‘థేమిస్’ను తలపింప చేస్తున్నా, గ్రీకు దుస్తులకు బదులు బెంగాలీ చీరకట్టు కలిగి ఉంది. గత డిసెంబర్లో ఏర్పాటు చేసిన ఈ వివాదాస్పద విగ్రహాన్ని తొలగించాలని కొన్ని వర్గాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల అది ఉధృతమవడంతో దాన్ని సుప్రీంకోర్టు ఆవరణ నుంచి తొలగించి అంతగా ప్రాధాన్యతలేని మారుమూల ప్రాంతంలో ఎక్కడైనా ఏర్పాటు చేయాలంటూ సాక్షాత్తు దేశ ప్రధాని షేక్ హసీనా.. ప్రధాన న్యాయమూర్తి సురేంద్ర కుమార్ సిన్హాకు సూచించారు.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి మృణాల్ హక్ సమక్షంలో సుప్రీం కోర్టు ఆవరణ నుంచి తొలగించారు. మదర్సా టీచర్లు, విద్యార్థులతో కూడిన సంఘం హెఫాజత్ ఏ ఇస్లామ్, అవామీ ఒలేమా లీగ్, ఇస్లామీ ఆందోళన్ బంగ్లాదేశ్ బృందాలు విగ్రహానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ వచ్చాయి. ఇస్లాం సంప్రదాయం ప్రకారం విగ్రహారాధన ఉండకూడదు కనుక తాము విగ్రహాన్ని తొలగించాలంటున్నామని ఈ ఆందోళన గ్రూపులు తెలిపాయి. గ్రీకు దేవతా విగ్రహాన్ని బంగ్లాదేశ్‌లో ఎందుకు పెట్టారని షేక్ హసీనా మొదటి నుంచి ప్రశ్నించడం లౌకికవాదులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. లౌకికవాదులు విగ్రహాన్ని తొలగించవద్దంటూ ఈ రోజు ఆందోళన కూడా చేశారు. గ్రీకు న్యాయదేవతతో భంగిమలో పోలిక ఉన్నా తాను చీరకట్టులో బెంగాలీ మహిళ ప్రతిబింబించేలా విగ్రహాన్ని తయారు చేశానని మృణాల్ హక్ ఈ రోజు కూడా సమర్థించుకున్నారు.
బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు ముజిబూర్ రెహమాన్ కూతురైన షేక్ హసీనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని తాము ఊహించలేదని దేశంలోని లౌకికవాదులు అంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే షేక్ హసీనా ఈ నిర్ణయం తీసుకున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న సంప్రదాయవాదుల ఓట్లను ఆకర్షించడమే ఆమె లక్ష్యమని సీనియర్ పాత్రికేయులు వ్యాఖ్యానిస్తున్నారు. 1071లో బంగ్లాదేశ్ ఆవిర్భవించినప్పుడు భారత్‌ను స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగంలో తొలిసారిగా ‘లౌకికవాద దేశంగా’ పేర్కొన్నారు. ఆ తర్వాత 1977లో దీన్ని మళ్లీ రాజ్యాంగం నుంచి తొలగించారు. లౌకికవాదులు గొడవ చేయడంతో తిరిగి 2010లో మళ్లీ చేర్చారు. ఇప్పుడు లౌకికవాదుల సంఖ్య దేశంలో గణనీయంగా తగ్గుతూ వస్తోంది.
ఓ విగ్రహాన్ని తొలగించాలంటూ ఆందోళన చేయడం దేశంలో ఇదే మొదటిసారి కాదు. 2008లో బెంగాలీ జానపద గాయకుడు లాలన్ ఫకీర్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేయడంతో దాన్ని తొలగించారు. ఇప్పుడు ఆందోళన చేయడంతో న్యాయ దేవతా విగ్రహాన్ని తొలగించారు. మున్ముందు బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం విరోచితంగా పోరాడిన అమరుల విగ్రహాలను కూడా తొలగిస్తారని లౌకికవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగే ఉపేక్షిస్తే రాజ్యాంగం నుంచి లౌకికవాద పదాన్ని శాశ్వతంగా తొలగించే ప్రమాదం ఉందని కూడా వారు హెచ్చరించారు. ఇప్పటికే బంగ్లాదేశ్ సంప్రదాయవాదులు‘ముక్తో మోనా’ సంప్రదాయానికి విరుద్ధంగా రచయితలపై భౌతికదాడులు జరుపుతున్నారు. ఇక్కడ ముక్తో మోనా అంటే భావప్రకటనా స్వాతంత్య్రాన్ని గౌరవించడం.