అయ్యో స్వామీ.. ఆస్తులు కాపాడరేమీ?
- హేమగిరి సత్యనారాయణ స్వామి భూములపై అక్రమార్కుల కన్ను
- ఇప్పటికే కోర్టు వివాదంలో విలువైన స్థలాలు
- చర్యలకు అధికారుల తాత్సారం
అనకాపల్లి: దేవుని మాన్యాలను కాపాడడంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. నిబంధనల మేరకు నోటీసులు జారీ చేయడం తప్ప అక్రమార్కులకు అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతున్నారు. ఇప్పటికే అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో పలు దేవస్థానాల భూములు వివాదాల్లో ఉండగా, అనకాపల్లి మండలం సత్యనారాయణపురంలో వెలసిన శ్రీ హేమగిరి సత్యనారాయణస్వామి దేవస్థానం భూములకు రక్షణ కరువైంది.
1977 నుంచి దేవాదాయ శాఖలోకి..
సువిశాలమైన భూములను కలిగి ఉన్న సత్యనారాయణస్వామి దేవస్థానం 1977లో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది. ఈ దేవస్థానానికి సంబంధించిన భూముల విస్తీర్ణంపై స్పష్టత కొరవడంది. అనకాపల్లితో పాటు చోడవరం మండలంలో కూడా స్వామివారికి విలువైన భూములు ఉన్నాయి. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో శ్రీ రమాలక్ష్మి సమేత సత్యనారాయణస్వామి కల్యాణం కమనీయంగా నిర్వహిస్తారు. కార్తీకమాసంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. సత్యనారాయణస్వామి వ్రతాలకు పెట్టింది పేరైన ఈ ఆలయం అభివృద్ధిలో మాత్రం వెనుకబడే ఉంది. ప్రస్తుతం ఈ స్వామివారి కొండపైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నారు.
అయితే విలువైన భూములను కాపాడుకోవడంలో మాత్రం అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి పరిధిలో 60 ఎకరాలకు పైబడి భూములుం డగా 15 ఎకరాల వరకు ఏలేరు కాలువ క్వార్టర్లకు సేకరించి నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మిగిలిన 45 ఎకరాలలో కూడా వివాదాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రధానంగా కూం డ్రం వెళ్లే రహదారికి ఆనుకొని ఉన్న విలువైన భూములపై గతంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యా పారి కన్నుపడింది. ఆ వ్యాపారి లేఅ వుట్కు వెళ్లేందుకు దారి నిమిత్తం స్వామివారి భూ ములను ఉపయోగించుకోవాలని ప్రయత్నించినా అధికారులు బోర్డులు పెట్టి తాత్కాలికంగా అడ్డుకున్నారు.
స్వామివారి మామిడి తోటకు ఆనుకొని 8 ఎకరాల నష్టపరిహారానికి సంబంధించిన వివాదంలో రైతులు కోర్టును ఆశ్రయించినందున నిధులు దక్కకుండా పోయాయి. కొత్తూరు కాలేజి జంక్షన్‌కు ఆనుకొని విలువైన స్వామివారి భూములను కొందరు విక్రయించారని సమాచారం. చోడవరం మండలంలో 26 ఎకరాల భూములలోను కొంత భూ మిపై రైతులు తమదేనని పోరాడుతున్నట్లు దేవదాయ, దర్మాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలా విలువైన స్థలాలు వివాదాల్లోను, కోర్టు కేసుల్లోను, అమ్మకాల్లోను ఉన్నందున హేమగిరి సత్యనారాయణ స్వామి దేవస్థాన అభివృద్ధికి ఆటంకంగా మారింది. కోట్లలో విలువున్న హేమగిరి సత్యనారాయణస్వామి దేవస్థానం భూ ములను రక్షించి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.
అక్రమార్కుల కన్ను
హేమగిరి సత్యనారాయణ స్వామి దేవస్థానం భూములపై అక్రమార్కుల కన్నుపడింది. దశాబ్దాల నుంచి ఈ భూములపై కన్నేసిన కొందరు ఎలాగైనా తమ అధీనంలోకి తెచ్చుకోవాలని కుయుక్తులు పన్నుతున్నారు. ఇదే సమయంలో సం బంధిత శాఖ తమకేమి పట్టనట్టు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. స్థలాలను ఆక్రమించి తమ పని కానిచ్చేసిన తరువాత దేవాదాయ శాఖ బోర్డులు పెట్టడంతోనే సరిపెడుతున్నారు.