అంబేడ్కర్ విగ్రహం విధ్వంసంపై ఆందోళన
గోగన్నమఠం(మామిడికుదురు):
గోగన్నమఠం ప్రధాన కూడలిలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహం కుడి చేతిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీన్ని నిరసిస్తూ బుధవారం ఉదయం దళిత సంఘాల నాయకులు నాలుగు రోడ్ల కూడలిలో ఐదు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులను మూడు రోజుల్లో అరెస్టు చేస్తామని డీఎస్పీ ఎల్ అంకయ్య హామీ ఇవ్వడంతో వారు చివరకు ఆందోళనను విరమించారు. అంతకు ముందు కోనసీమ దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు డీబీ లోక్, ఇసుకపట్ల రఘబాబు, జంగా బాబూరావు, ఉండ్రు బాబ్జి, మాజీ ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాదరావు, ఎంఏ వేమా సంఘటనా స్థలానికి చేరుకుని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అమలాపురం డీఎస్పీ ఎల్ అంకయ్య, రాజోలు సీఐ కె.క్రిషో్టపర్, నగరం ఎస్సై జి.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ బత్తుల ఝాన్సీభాయి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాకినాడ నుంచి డాగ్ స్వాడ్‌తో పాటు క్లూస్ టీమ్ వచ్చి ఇక్కడి పరిస్థితిని పరిశీలించారు. అంబేడ్కర్ విగ్రహం పక్కనే ఉన్న మద్యం బెల్ట్ షాపును తక్షణం తొలగించాలని, విగ్రహానికి అడ్డుగా ఉన్న హోటల్‌ను కూడా తొలగించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బెల్ట్ షాపుకు తాళం వేసి దాన్ని ఎక్సైజ్ అధికారులకు స్వాధీనం చేశారు. విగ్రహం వద్ద అడ్డుగా ఉన్న హోటల్‌ను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ ఆందోళనలో బత్తుల మురళీకృష్ణ, బత్తుల జనార్దనరావు, ఎన్వీ సత్యనారాయణ, యాలంగి విశ్వనా«థం, కోరుకొండ రాజా, చిగురుపాటి పెద్దిరాజు, యల్లమెల్లి విజయభాస్కర్‌రెడ్డి, కలిగితి పళ్లంరాజు, గోగి గోపాలకృష్ణ, భూపతి సూర్యనారాయణ, కుసుమ పెరుమాళ్లకుమార్, చేట్ల సత్యనారాయణ, బొంతు మణిరాజు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.