ముంబైలో భారీ అగ్నిప్రమాదం: ఫైర్ అధికారి దుర్మరణం
ముంబై: దక్షిణ ముంబైలో జనంతో రద్దీగా ఉండే కల్బాదేవి వీధిలోని ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పడానికి ప్రయత్నించిన ఒక అగ్నిమాపక అధికారి కాలిన గాయాలతో దుర్మరణం చెందారు. నాలుగు అంతస్తుల ఈ పురాతన భవనంలో పలు కుంటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇందులో వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. భారీ స్థాయిలో వ్యాపించిన మంటల ధాటికి భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నివాసం ఉండే అయిదుగురితోపాటు మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది మరో అయిదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో అగ్నిమాపక అధికారి ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈ భవనంలో సాయంత్రం 4.20 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. పది నిమిషాలలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడం మొదలు పెట్టాయి. రాత్రి 8 గంటల వరకు వారు మంటలను ఆర్పుతూనే ఉన్నారు. 17 ఫైర్ ఇంజన్లు, పది నీటి ట్యాంకులతో మంటలను అదుపు చేశారు.