బంగారు ఆకుల చెట్టు
పిల్లల కథ
ఒకప్పుడు ఓ అడవిలో ఓ చెట్టు ఉండేది. దాని ఆకులు సన్నగా ముళ్ళుగా ఉండేవి. గాలికి ఊగే ఆకుపచ్చటి విశాలమైన ఆకులు గల చెట్లని చూసినప్పుడల్లా తనకి కూడా అలాంటి ఆకులు ఉంటే బావుండును అని ఆ చెట్టుకి అనిపించసాగింది. ‘నేనెంత దురదృష్టవంతురాలిని? పరమాత్మ నాకు బంగారు ఆకుల్ని ప్రసాదిస్తే ఎంత బావుండేది’ అని ఓ రోజు దుఃఖించింది.
మర్నాడు చూస్తే దాని ముళ్ళ ఆకులన్నీ బంగారు ఆకులుగా మారి కనిపించాయి. అది చాలా సంతోషించి పరమాత్మకి తన కృతజ్ఞతలని తెలియచేసుకుంది. మిగిలిన చెట్ల ముందు గర్వంగా కూడా ఫీలైంది. కాని రాత్రి ఓ లోభి వచ్చి దాని బంగారు ఆకులన్నిటినీ తెంపుకుపోయాడు.
అది కొద్దిసేపు తన దురదృష్టానికి చింతించి తనకి తళతళ మెరిసే తగరపు రేకుల ఆకులు ఉంటే బావుండునని పరమాత్మని ప్రార్థించింది. మర్నాడు ఉదయానికల్లా అది కోరుకున్న ఆకులు మొలిచాయి. కాని ఆ రాత్రి వచ్చిన వడగళ్ళ వానకి ఆ తగరపు ఆకులన్నీ రాలిపోయాయి.
ఆ తర్వాత అది పరమాత్మని చక్కటి సువాసనల ఆకుపచ్చ ఆకులని కోరుకుంది. పరమాత్మ మళ్ళీ దాని కోరికని మన్నించాడు. ఆ వాసన చేత ఆకర్షించబడ్డ గడ్డి తినే అనేక జంతువులు వచ్చి దాని ఆకులన్నీ తినేశాయి. మొదట ఇచ్చిన ఆకులనే మళ్ళీ ఇవ్వమనీ, అవే తనకి శ్రేయస్కరం అనీ చివరికి అది పరమాత్మని ప్రార్థించింది.
నీతి: మనకి లభించేదంతా మనకి అవసరమైంది. అనవసరమైనదేదీ పరమాత్మ మనకి ఇవ్వడు.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి