చైనా చమక్
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో తొలి రెండు రోజులు ఆతిథ్య దక్షిణ కొరియా నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న చైనా మూడో రోజు మాత్రం జూలు విదిల్చింది. స్వర్ణాల సంఖ్యను 26కు పెంచుకుని అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మహిళల బ్యాడ్మింటన్, ట్రాక్ సైక్లింగ్, ఫెన్సింగ్, జూడో, షూటింగ్, స్విమ్మింగ్, సింక్రనైజ్డ్ స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్, వుషు క్రీడాంశాల్లో చైనా క్రీడాకారులు బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ టీమ్ ఈవెంట్లో యి సిలింగ్ (418.7), జాంగ్ బిన్‌బిన్ (418.4), వూ లీజి (416.8)లతో కూడిన చైనా బృందం కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. క్వాలిఫయింగ్‌లో ఈ ముగ్గురు కలిసి 1,253.8 పాయింట్లు స్కోరు చేసి... గతేడాది టెహ్రాన్‌లో ఆసియా చాంపియన్‌షిప్ సందర్భంగా 1,253.7 స్కోరుతో చైనా జట్టే నెలకొల్పిన ప్రపంచ రికార్డును తిరగరాసింది. క్వాలిఫయింగ్ పోటీల సందర్భంగా ‘డ్రామా’ చోటు చేసుకుంది. చైనా షూటర్ జాంగ్ బిన్‌బిన్ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ బరువు ఉన్న రైఫిల్‌ను వాడినందుకు ఆమెపై అనర్హత వేటు వేశారు. అయితే చైనా బృందం ఈ నిర్ణయంపై వెంటనే అప్పీలు చేసింది. అరగంట విచారణ తర్వాత ఆమెపై అనర్హత వేటును తొలగించడంతో జాంగ్ బిన్‌బిన్ వ్యక్తిగత ఫైనల్స్‌లోనూ పోటీపడి కాంస్య పతకాన్ని సాధించింది.