Gold merchants
-
బిల్లులు లేకుండా బిస్కెట్లు.. బంగారు వ్యాపారుల్లో వణుకు
బిల్లులు లేకుండా వ్యాపారం సాగిస్తున్న కావలి బంగారు వ్యాపారుల వ్యవహారం మరోసారి బట్టబయలు అయింది. కొంత కాలంగా గుట్టుగా సాగుతున్న వ్యాపార లావాదేవీల్లో ఒకే రోజు రెండు ఘటనలు వణుకుపుట్టిస్తున్నాయి. బంగారం కొనుగోలు కోసం రైల్లో కావలి నుంచి చెన్నైకు ఓ దళారీ తీసుకెళ్తున్న నగదు పోలీసుల తనిఖీల్లో పట్టుబడడంతో ఐటీ అధికారులు రంగ ప్రవేశం చేశారు. మరో దళారీ తీసుకెళ్తున్న నగదును గుర్తు తెలియని దుండగులు దోచుకోవడం కలకలం రేగింది. కావలి (నెల్లూరు): కావలిలోని బంగారు వ్యాపారులపై ఆదాయపన్ను శాఖకు చెందిన అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. కొంత కాలంగా బిల్లులు లేకుండా చెన్నై నుంచి బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి వాటిని కావలికి తీసుకువచ్చి ఇక్కడ ఆభరణాలుగా తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు. గతంలో ఇదే పరిస్థితిపై ఐటీ అధికారులు దృష్టి పెట్టి చర్యలు చేపట్టారు. కొంత కాలంగా లావాదేవీలు పారదర్శకంగా సాగాయి. మళ్లీ వ్యాపారులు అక్రమ మార్గం పట్టారు. చెన్నైలో బంగారం కొనుగోలు చేసినా.. ఆభరణాలుగా విక్రయించినా ఎక్కడా బిల్లులు కానీ, చిత్తు కాగితం కూడా ఉండదు. ఈ క్రమంలో ఆదాయపన్ను శాఖ అధికారులు కావలికి రావడం వ్యాపారులు వణికిపోతున్నారు. అసలేం జరిగింది.. సోమవారం ఒకే రోజు రెండు ఘటనలు జరిగాయి. ఇదే బంగారు వ్యాపారుల్లో వణుకుపుట్టిస్తోంది. కావలికి చెందిన ఒక బంగారు వ్యాపారి చెన్నైలో బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి తీసుకువచ్చేందుకు సోమవారం ఓ దళారీకి రూ.60 లక్షలు నగదు ఇచ్చి పంపించాడు. అయితే మార్గంమధ్యలో పోలీసుల తనిఖీల్లో ఈ రూ. 60 లక్షలు నగదు పట్టుబడింది. ఈ నగదును పోలీసులు ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. దీంతో గుంటూరు నుంచి ఐటీ అధికారులు కావలికి చేరుకున్నారు. రూ.60 లక్షలు నగదు ఇచ్చిన బంగారు వ్యాపారి షాపు, నివాసంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ వ్యాపారి చేస్తున్న లావాదేవీలపై పూర్తిస్థాయిలో లావాదేవీల నిర్వహణపై విచారణ చేపడుతున్నారు. మరి కొన్ని దుకాణాలపై దాడులు చేసే అవకాశం ఉండడంతో వ్యాపారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చదవండి: (ఫలించిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కృషి.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు) రూ.30 లక్షల అపహరణ కావలిలోని మరో బంగారు వ్యాపారి చెన్నై నుంచి బంగారు బిస్కెట్ కొనుగోలు చేసి తీసుకు వచ్చేందుకు సోమవారం ఓ దళారీకి రూ.30 లక్షలు నగదు ఇచ్చాడు. అతను రైల్లో వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. అయితే ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సదరు వ్యాపారి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. బంగారం వ్యాపారం అంతా బిల్లులు లేకుండా చేస్తుండడంతో పాటు ఈ నగదుకు లెక్కలు చూపించాల్సి వస్తుందని సదరు వ్యాపారి మౌనంగా ఉన్నట్లు సమాచారం. -
అక్షయ తృతీయ అమ్మకాలు అంతంతే!
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు అక్షయ తృతీయపై ఆశలు వదులుకున్న బంగారం వ్యాపారులు ఈ ఏడాది బంగారం అమ్మకాలకు పూర్వవైభవం వస్తుందని భావించారు. కానీ.. వారి ఆశలపై కొనుగోలుదారులు నీళ్లు చల్లారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అది ఉండేకొద్దీ అక్షయం అవుతుందన్న నమ్మకం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని బంగారం దుకాణాల్లో సందడి అంతంతమాత్రంగానే కనిపించింది. అక్షయ తృతీయ కొనుగోళ్లు కేవలం కార్పొరేట్ షాపులకు మాత్రమే పరిమితమైందని, మిగిలిన షాపుల్లో సాధారణ స్థాయిలోనే లావాదేవీలు జరిగాయని బులియన్ వ్యాపారులు పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్ సమయంలో అక్షయ తృతీయ వచ్చినప్పటికీ కొనుగోళ్లు అంతగా లేవని, ఈ పండుగ సందర్భంగా బంగారం నిల్వలు పెంచుకోవడానికి పెద్దగా ఎవరూ ముందుకు రాలేదని ఏపీ గోల్డ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్స్ ఉపాధ్యక్షుడు బూశెట్టి రామ్మోహనరావు ‘సాక్షి’కి తెలిపారు. నగరాలకే పరిమితం రాష్ట్రంలో 50 వేలకు పైగా బంగారం షాపులు ఉన్నప్పటికీ అక్షయ తృతీయ సందడి కేవలం విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి పట్టణాల్లో కార్పొరేట్ షాపులకు మాత్రమే పరిమితమైందని బులియన్ మర్చంట్స్ చెబుతున్నారు. గతంతో పోలిస్తే బంగారు ఆభరణాల అమ్మకాల్లో 30 శాతం క్షీణత కనిపిస్తోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం, కోవిడ్ భయాలు ఇంకా వెంటాడుతుండటంతో భారీ కొనుగోళ్ల విషయంలో ప్రజలు ఆచితూచి అడుగులు వేస్తుండటం అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర ఒకానొక దశలో రూ.5,800 చేరి.. ప్రస్తుతం రూ.5,300 వచ్చినప్పటికీ కొనుగోళ్లకు అంతగా ఆసక్తి చూపించడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. సామాన్యుడు దూరంగా.. రోజువారీ అమ్మకాలతో పోలిస్తే అక్షయ తృతీయ అమ్మకాలు కొద్దిగా పెరిగినప్పటికీ కోవిడ్ ముందు కాలం 2019తో పోలిస్తే అమ్మకాలు 30 నుంచి 40 శాతం తక్కువగానే నమోదైనట్లు విజయవాడలోని ఎంబీఎస్ జ్యూవెలరీ అధినేత ప్రశాంత్ జైన్ పేర్కొన్నారు. ఈ సారి కొనుగోళ్లకు మధ్య తరగతి ప్రజలు, సామాన్యులు దూరంగా ఉన్నట్లు తెలిపారు. కోవిడ్ భయాలు ఇంకా ప్రజలను వెంటాడుతుండటంతో మరో ఏడాదిన్నర వరకు బంగారం అమ్మకాలు ఇదే స్థాయిలోనే జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే రెండు నెలలు పెళ్లిళ్ల సీజన్ కావడంతో వ్యాపారం జోరుగా సాగాల్సి ఉన్నా.. ఆ వాతావరణం కనిపించడం లేదని విజయవాడలోని ఆర్ఎస్ జ్యూవెల్స్ అధినేత లక్ష్మణ్ పేర్కొన్నారు. పెళ్లిళ్లు జరుగుతున్నా ఆ మేరకు బంగారం అమ్మకాలు జరగడం లేదన్నారు. అక్షయ తృతీయనాడు బంగారం కొనాలన్న సెంటిమెంట్ ఉన్న వాళ్లు ఒకటి రెండు గ్రాముల బంగారం నాణేలు కొనడానికి పరిమితమైనట్లు తెలిపారు. అక్షయ తృతీయ సందర్బంగా పత్రికా ప్రకటనలు, షాపుల అలంకరణకు భారీగా ఖర్చు చేసినా ఆ స్థాయిలో ఈ సారి అమ్మకాలు కనిపించలేదని ఒక కార్పొరేట్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. -
‘హాల్‌మార్క్’ తప్పనిసరి ఉత్తర్వులపై స్టే ఇవ్వండి
సాక్షి, అమరావతి: బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌ను ముద్రించడం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఏపీ బులియన్ బంగారు, వెండి, వజ్రాల వ్యాపారుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటి అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాశీ విజయకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం ఇచ్చే వివరాల ఆధారంగా మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయం తీసుకుంటామంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కి వాయిదా వేసింది. హాల్‌మార్క్ అమలులో అనేక ఇబ్బందులు.. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది మువ్వా రవీంద్ర వాదనలు వినిపిస్తూ.. బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షమన్నారు. బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ అమలులో అనేక ఇబ్బందులున్నాయని తెలిపారు. ‘దేశవ్యాప్తంగా 5 లక్షల మంది, రాష్ట్రంలో 50 వేల మంది బంగారు వ్యాపారులు ఉన్నారు. హాల్‌మార్క్ ముద్రించాల్సిన ఆభరణాల సంఖ్య దాదాపు 1,000 కోట్లు ఉంటుంది. హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన గడువు ఈ ఏడాది జూన్ 15తో ముగిసింది. హాల్‌మార్క్ లేకుండా ఆభరణాలు అమ్మినవారికి జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. హాల్‌మార్క్ వేసే కేంద్రాలు చాలా తక్కువ సంఖ్యలో పెద్ద నగరాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా, లాక్డౌన్ వల్ల కేంద్రం నిర్దేశించిన గడువులోపు ఆభరణాలకు హాల్‌మార్క్ వేయించడం అసాధ్యంగా మారింది. హాల్‌మార్క్ వేసిన ఆభరణాలకు మెరుగుపెట్టిస్తే అది పోతుంది. అప్పుడు ఏం చేయాలనే దానికి ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎలాంటి స్పష్టత లేదు’ అని రవీంద్ర ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వినియోగదారుల ప్రయోజనాల కోసమే.. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. వినియోగదారుల ప్రయోజనాల కోసం ఆభరణాల నాణ్యత, శుద్ధత, మోసాలను అరికట్టడం కోసం కేంద్రం హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేసిందన్నారు. గడువు ఇస్తే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతానని తెలిపారు. -
తుపాకీతో బెదిరించి రూ.82 లక్షల దోపిడీ
-
రూ. 82 లక్షలు దోపిడీ చేసిన కానిస్టేబుళ్లు
కావలి: బంగారు వ్యాపారులను బెదిరించి కానిస్టేబుళ్లు రూ. 82 లక్షలు దోపిడీ చేసిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. దోపిడీ జరిగిన కొన్ని గంట ల్లోనే నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. వారిలో ముగ్గు రు ప్రకాశం జిల్లా కానిస్టేబుళ్లని సమాచారం. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన బంగారు వ్యాపారులు వేమూరి రాము, సునీల్ రూ. 82 లక్షల నగదుతో కావలి రైల్వే స్టేషన్ నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు వెళ్తున్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు వారి వద్దకు వచ్చి తాము పోలీసులమని తుపాకీ చూపి బెదిరించారు. మీపై అనుమానంగా ఉందని చెప్పి పడుగుపాడు స్టేషన్ సమీపంలో ఆ రైలు నెమ్మదిగా వెళుతున్న సమయంలో ఇద్దరు వ్యాపారులను కిందకు దించారు. వారిని నెల్లూరు ఆత్మకూరు బస్టాండు వద్దకు తీసుకె ళ్లారు. అక్కడ నుంచి అంబాసిడర్ కారును బాడుగకు తీసుకుని, దగదర్తి మండలం దామవరం వద్ద వ్యాపారులను వదిలేశారు. అక్కడ నుంచి నలుగురు వ్యక్తు లు వెళ్లిపోయారు. మోసం జరిగిందని తెలుసుకున్న బంగారు వ్యాపారులు కావలి పోలీసులను ఆశ్రయించగా వారు నిందితులు ప్రయాణించిన అంబాసిడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద ఓ కారులో వెళ్తున్న వారిని సినీఫక్కీలో వెంబడించి ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. స్టూవర్టుపురానికి చెందిన మరో నిందితుడు పరారయ్యాడు. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాలకు చెందిన ఏఆర్ కానిస్టేబుళ్లుగా అనుమానిస్తున్నారు.