ఐటీ కొరడా
ఏలూరు (మెట్రో) : ఏలూరులో బంగారం దుకా ణంపై ఐటీ అధికారులు దాడి చేయడం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత నగరానికి చెందిన బంగారం వ్యాపారి రూ.22 కోట్లను బ్యాంక్ ఖాతాలో జమ చేయ డంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు వన్‌టౌన్ పరిధిలో శీరం వెంకన్నకు చెందిన నగల దుకాణంపై బుధవారం మధ్యాహ్నం ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దుకాణ యజమాని ఇటీవల కాలంలో రూ.22 కోట్లను బ్యాంకుల్లో జమ చేయడం, బిల్లులు లేకుండా రూ.కోటి యాభై లక్షల విలువైన బంగారాన్ని కలిగి ఉండటాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. అతని దుకాణంలో అర్ధరాత్రి వరకూ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వెంకన్నకు గతంలో భీమవరంలో భార్య పేరుతో ఒక దుకాణం ఉండేది. ఐటీ ఇబ్బందుల వల్ల భీమవరంలోని దుకాణాన్ని మూసేసిన వెంకన్న వ్యాపారాన్ని ఏలూరుకు మార్చాడు. భీమవరంలోని వారితో ఉన్న పరిచయాలతో ఆయన ఇక్కడ వ్యాపారం సాగిస్తున్నాడు. పరిచయాలను కొనసాగిం చేందుకు తన కుమారుడిని భీమవరంలోనే ఉంచాడు. పెద్దనోట్ల రద్దు తర్వాత గత పదిరోజుల వ్యవధిలో అతను రూ.22 కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడంతో ఆ ఖాతాను స్తంభింప చేసి వల్లభ జ్యూయలర్స్‌పై దాడి చేశారు. దాడుల్లో ఐటీ విజయవాడ డైరెక్టర్, తూర్పుగోదావరి జిల్లా డెప్యూటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల సోమవరప్పాడుతోపాటు ఏలూరు నగరంలోనూ లెక్కలు చూపని నగదును పోలీసులు, ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.