కన్యకాపరమేశ్వరికి బంగారుచీర
పాతపోస్టాఫీసు: పాతనగరంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో మూలవిరాట్‌ను బంగారు చీరతో అలంకరించనున్నారు. 138 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆలయంలోని మూల విరాట్‌ను సుమారు 4 కేజీల బంగారంతో తయారుచేయించిన బంగారు చీరను అలంకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల సంఘం కార్యదర్శి యలమర్తి హరనాథ్, అధ్యక్షుడు నల్లూరి నూకరాజు మాట్లాడుతూ నగరంలోని ఆర్యవైశ్య భక్తుల విరాళాల ద్వారా సేకరించిన బంగారంతో వైభవ్ జ్యూయలరీ వారి ఆధ్వర్యంలో బంగారు చీరను తయారు చేయించామని తెలిపారు. తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య చేతుల మీదుగా ఈనెల 19న అమ్మవారికి చీరను అలంకరించనున్నామని అన్నారు. నగరంలోని భక్తులు యావన్మందీ ఈ వేడుకను కనులారా తిలకించాలని కోరారు.