golla pudi Maruti Rao
-
గొల్లపూడి వారింట శక్తి స్వరూపిణులు
కన్నగి (తమిళం), కాళీమాత, సత్యభామ, ఝాన్సీ, అంబ, మోహిని, రంభ, రాధ, గాంధారి, ఊర్మిళ, ద్రౌపది, మండొదరి, శూర్పణఖ, అరుంధతి, సీత, సావిత్రి, అహల్య, గంగ.. ఈ పద్దెనిమిది మంది శక్తి స్వరూపిణులు ఈ ఏడాది శరన్నవరాత్రులకు గొల్లపూడి వారింట్లో కొలువు తీరారు దసరా నవరాత్రులు వచ్చాయంటే చెన్నైలోని ఓ తెలుగు సంప్రదాయ నివాసంలోకి సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదెవరిదో కాదు.. ప్రఖ్యాత రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు ఇల్లు. చెన్నై టీనగర్ లోని శారదాంబాళ్ వీధిలో ఉన్న శివానీ నిలయంలో ఏటా కొలువుదీరే బొమ్మల కొలువు గత పందొమ్మిదేళ్లుగా వివిధ రకాల థీమ్‌లతో చెన్నైలోని తెలుగువారే కాకుండా, తమిళులు సైతం ఆసక్తితో తిలకించేలా ఉంటోంది. గొల్లపూడివారి కోడళ్లయిన కుమారి, సునీతలు పెట్టే ఆ బొమ్మల కొలువు మన సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచారాలు అలవాట్లకు ప్రతీకగా నిలుస్తోంది. 2001లో మొదటిసారిగా ‘తిరుమల తిరుపతి ఏడు కొండల మహత్యం’ అనే అంశంతో మొదలైన వీరి బొమ్మల కొలువు థీమ్‌లు ఆ తర్వాత రామాయణం, కృష్ణలీలలు, నవరసాలు, మన పండుగలు, శ్రీనివాస కల్యాణం, నవ దుర్గలు, షిర్డీసాయి జీవిత చరిత్ర, గణాధిపత్యం తదితర విశేషాంశాలతో కొలువు తీరుతూ వస్తున్నాయి. ఈ ఏడాది ఇతిహాసాలు, పురాణాలు, చరిత్రల ఆధారంగా మహిళా శక్తులుగా ఆదర్శంగా నిలిచిన స్త్రీ మూర్తులను బొమ్మల కొలువులో ఉంచారు. ప్రత్యేకంగా భారతం, భాగవతం, రామాయణంలోని పద్దెనిమిది మంది శక్తి స్వరూపిణులు సందర్శకులకు స్ఫూర్తి నింపుతున్నారు. ఈ పద్దెనిమిది మందీ.. కన్నగి (తమిళం), కాళీమాత, సత్యభామ, ఝాన్సీ, అంబ, మోహిని, రంభ, రాధ, గాంధారి, ఊర్మిళ, ద్రౌపది, మండొదరి, శూర్పణఖ, అరుంధతి, సీత, సావిత్రి, అహల్య, గంగ! గంగ దివి నుండి భువికి దిగివచ్చిన, సీత భూమాత ఒడిలోకి వెళ్లిన, రామాయణ యుద్ధానికి శూర్పణఖ కారణమైన, అవమానం పగగా మారి ద్రౌపది ప్రతీకారంతో మహాభారత యుద్ధ జరిగిన ఎన్నో ఇతిహాస ఘట్టాలలో మహిళలు శక్తులుగా నిలిచిన తీరు ఇక్కడి బొమ్మల కొలువులో కనిపిస్తుంది.ఈ ఏడాది కొలువును తీర్చిదిద్దేందుకు దాదాపు ఐదు సంవత్సరాలుగా ఒక్కో బొమ్మను కూడబెట్టడం జరిగిందని కుమారి, సునీత తెలిపారు. ఒక్కోసారి బొమ్మల సేకరణకు రోజులు పడుతుండగా కొన్ని సమయాల్లో థీమ్స్‌కు తగ్గట్టు బొమ్మలు దొరక్క పోవటంతో వారే స్వయంగా బొమ్మలను తయారు చేసుకుని కొలువులో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులూ లలితా సహస్రనామం చదువుతూ.. రెండు పూటలా తొమ్మిది నైవేద్యాలు పెడుతూ ముత్తయిదువులను పిలిచి తాంబూలాలను అందిస్తున్నారు. ఆఖరి రోజున చందనపు బొమ్మలకు హారతి ఇచ్చి నిద్రపుచ్చి మరో ఏడాది వరకు అందరికీ సంతోషాలను ఇవ్వమని అమ్మవారికి దిష్టితీసి బొమ్మల కొలువుకు ముగింపు పలుకుతారు. ఏటా బొమ్మల కొలువు తీర్చినప్పటి నుండి చెన్నై నగరం నలుమూలల నుండి గొల్లపూడి నివాసానికి తెలుగువాళ్లు మహిళలు బారులు తీరుతారు. ఇక ఈ బొమ్మల కొలువుకు నగరంలోని అన్ని సాంస్కృతిక పోటీలలో ప్రధమ స్థానమే. నవరాత్రి కొలువుల్లో తెలుగు వారికే కాదు.. తమిళులకు కూడా స్పూర్తిదాయక సాంప్రదాయాలకు ఆచారాలకు గొల్లపూడి కోడళ్లు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. – సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి సాక్షి టీవీ, చెన్నై ఆమెరికాలో పిల్లల కొలువు ఖండాలు దాటినా మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు మర్చిపోకుండా పాశ్చాత్య జీవితంలోనూ అచ్చ తెలుగు కాపాడుకుంటూ వస్తున్నారు గొల్లపూడివారు. గత పదేళ్లుగా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దసరా బొమ్మల కొలువుకు వేదికగా నిలుస్తోంది అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో ఉంటున్న గొల్లపూడి మారుతీరావు సోదరుడైన గౌరి శంకర్ కుమార్తె అపర్ణ కుటుంబం. వారి పిల్లలిద్దరూ ఏటా దసరా నవరాత్రులను పురస్కరించుకుని వివిధ ఆంశాలతో కూడిన థీమ్స్‌తో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నారు. సమీపంలోని తెలుగువారందరీ ఏకం చేసేలా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా తమ నివాసంలో ప్రత్యేకంగా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. క్రికెట్ స్టేడియం, ప్లేయర్స్, గ్యాలరీ, కాంపౌండ్ ఒక థీమ్ గా; రెండోదిగా విలేజ్ థీమ్‌లో సాయిబాబా ఆలయం, వివిధ రకాల మనుషులు; మూడో థీమ్‌లో నాలుగు ఋతువులను వివరించే విధంగా ఒకే చోట బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. అంతేకాదు నిత్యం భజనలు, హారతులతో పూజలు నిర్వహిస్తున్నారు. కొలువుకు బొమ్మలు దొరకకపోయినా ఇండియా నుండి తమ బంధువులు, స్నేహితులతో తెప్పించుకుని శ్రమకోర్చి నవరాత్రుల సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ‘ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ భూమి భారతిని’ అంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రదక్షిణం
పుల్వామా సంఘటనకి ప్రపంచం నిర్ఘాంతపో యింది. దేశం ఆవేశంతో ఉడికిపోయింది. ఉద్రేకంతో ఎదురుదెబ్బ తీయాలని పిడికిలి బిగించింది. హింసా కాండలో కన్నుమూసిన 40 మంది వీరుల అంత్యక్రియ లను చూసి 24 గంటలలో కోట్లాదిమంది కన్నీరు కార్చారు. ఆవేశం కార్యసాధకుడి ఆయుధం కాదు. ప్రతీ కారం పళ్లు కొరకదు. ఒకే ఒకమాట– అదే మొదటి మాట– మోదీగారన్నారు ‘ప్రాణాలర్పించిన వీరుల త్యాగం ఊరికే పోదు’ అని. ఈ వాక్యాన్ని ఒక చానల్ పదేపదే ప్రకటించింది. ఏం చేస్తారు? ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? చేశాక కానీ దేశానికి తెలియదు. చెయ్యడం పాకిస్తాన్‌కి తెలియదు. నేను నటుడిని. కెమెరా ముందు సంవత్సరాల తరబడి నిలబడినవాడిని. కెమెరా నటనను పట్టుకుంటుంది. మరొకటి కూడా పట్టుకుంటుంది. నటుడి తాదాత్మ్యాన్నీ, మానసిక స్థితినీ, అంతరాంతరాల్లో పాత్రపట్ల అతని నిజాయితీని పట్టుకుంటుంది. ఇది దాచినా దాగని నిజం. ఈ నిజం ఒకప్పుడు తుపా కీలాగా పేలుతుంది. గుండెల్ని పిండి చేస్తుంది. నేను గతంలో చేసిన కొన్ని పాత్రల్ని చూసినప్పుడు ‘ఈ సన్నివేశంలో ఈ ఉద్రేకం ఇంత పండిందేమిటి’ అని ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి ఇంగ్లిష్‌లో ఒక పేరుంది– body language. ఒక వ్యక్తి ‘జీవుని వేదన’. ఇది మరీ పెద్దమాట కనుక– మొహమాట పడుతూ ఉటంకిస్తున్నాను. ఇది ప్రయత్నించినా నటుడు సంధించలేడు. కానీ అతని నిజాయితీ, తాదాత్మ్యం అతను ప్రయత్నించకపోయినా విద్యుత్తు లాగా విస్ఫోటనమవుతుంది. 40 మంది వీరుల మృతదేహాలు ఢిల్లీ చేరాయి. అధికారగణం, మూడు సైనిక దళాల నాయకులు, ప్రతిపక్ష నాయకులు– త్రివర్ణ పతాకాలు చుట్టిన యువ సైనికుల దేహాల ముందు నిలబడ్డారు. అది అతి హృదయవిదారకమైన దృశ్యం. ఎంతటి వాడి కయినా గుండె చెరువు అవుతుంది. వందల కెమెరాలు ఆ దృశ్యాన్ని చూపుతున్నాయి. ఒక్కరే– ఒకే ఒక్కరు– ఆ మూడ్‌లో లేరు. ఆయన పేరు రాహుల్ గాంధీ. ఆయన మొబైల్ ఫోన్ సవరించు కుంటున్నారు.దేశమంతా ఆ దృశ్యాన్ని చూస్తోంది. ఎదురుగా అతి గంభీరంగా, నిశ్చలంగా ఆవేశాన్ని పూరించిన ముఖంతో ఒకాయన నిలబడి ఉన్నారు– మోదీ. Last post మోగింది. మహా వీరులకు జరిపే అంతిమ సైనిక వందనమది. ప్రయత్నించినా కళ్లు వర్షించ కుండా ఆగని సందర్భమది. ఆ సందర్భంలో మోదీ ‘ప్రతీకార వాంఛ’, ‘కోపం’, ‘నిస్సహాయత’ నిప్పు అక్కర లేకుండా కార్చిచ్చుని లేపగలదు. సైనిక మర్యాద అయిపోయింది. ఇక ఆ మృతదేహాలు వారి వారి జన్మస్థలాలకు ప్రయాణం చేస్తాయి. అక్కడ వారికి నివాళి అర్పించే– ఆత్మీ యుల, ఆవేశపరుల సమూహాలు ఎదురుచూస్తు న్నాయి. ఈ యువకులతో ఆఖరి ప్రమేయమది. ప్రధాని ‘మర్యాద’ ఓ క్షణం ముందు ముగి సింది. కానీ మోదీ ఆవేశం, ఆ యువవీరులతో పంచుకునే ఆఖరి సందేశం ముగియలేదు. మోదీ వెనక్కి వెళ్లలేదు. వందనంతో వైదొలగలేదు. ఆ 40 మంది చుట్టూ ప్రదక్షిణం.. గంభీరంగా ప్రదక్షిణ చేశారు. పేరు పేరునా ‘శపథం’ చేశారా? ఆఖరి సందేశం ఇచ్చారా? మూగగా ఆక్రోశించారా? ఎదురుగా ఉన్న ప్రముఖుల సమూహం నివ్వెర పోయింది. అందరూ నిశ్శబ్దంగా నిలిచిపోయారు. మోదీ 40 మందినీ పేరు పేరునా పలుకరించే ఆఖరి ప్రదక్షిణ చూస్తూనే టీవీ ముందు నేను భోరుమ న్నాను– పసివాడిలాగా ఏడ్చాను. తన ఆత్మీయుల్ని నష్టపోయిన ఓ కుటుంబ నాయకుని ఆక్రందనకి– కార్యరూపమది. ఈ చర్యకి ప్రోద్బలమూ లేదు. ప్రయత్నమూ లేదు. ప్రయ త్నించి ఎవరూ చేయలేరు.జీవుని అంతరాంతరాళాలలో వేదనకి– ఆకస్మి కమైన, మాటలకు అందని కార్యరూపమది. దాని పేరే– body language. సైనిక వందనం తర్వాత అవనత శిరస్కుడై ప్రధాని అక్కడ నిలిచిపోయాడు.ఈ కాలమ్ ప్రధానమంత్రి గురించి కాదు. నరేంద్ర మోదీ గురించి కాదు. నాలుగైదు సంవత్స రాల బిడ్డలున్న పాతికేళ్ల కుర్రాళ్లు, ఇంకా పసుపు ఆరిపోని తాళిబొట్లున్న భార్యలు ఇళ్లల్లో ఎదురు చూస్తుండగా దౌర్జన్యకారుల దౌష్ట్యానికి శరీరాలు గుర్తు పట్టలేనంత ఛిద్రంకాగా, మరికొన్ని గంటల్లో వారి అవశేషాలు మంటల్లో ఆహుతి కానుండగా– గుండెలు మండే ఆవేశంతో ఓ పెద్ద దిక్కు వారికి అంతిమ సందేశాన్ని, నివాళిని, ఊరటని, హామీని, మరొక్కసారి గుండెనిండా కర్తవ్య దీక్షని పూరిం చుకునే వ్యక్తిగత క్షణమది. జీవుని వేదన తోసుకు రాగా– ఓ అగ్ని పర్వతం, ఓ మానవత్వపు మమ కారం ఆ 40 మంది సమక్షంలో గుండెల్ని పూరించు కుంది. వారి రక్త తర్పణానికి కృతజ్ఞత తెలిపింది. ఆ జ్ఞాపకాన్ని తాను ముందు జరపబోయే చర్యకి మన స్సులో నిక్షిప్తం చేసుకుందా?ఆ క్షణం ఓ ఆర్ద్రమైన విషాదానికి ముగింపు. ఓ నిర్నిద్రమైన ఆవేశ దీక్షకి ప్రారంభం. ఆ క్షణంలో అతను ప్రధాని కాదు– అవును. He is larger than life. గొల్లపూడి మారుతీరావు -
తప్పుల తడకలూ-నిర్జీవన కాలాలూ
కాలమిస్ట్ గొల్లపూడి మారుతీరావు మే 7న రవీంద్ర నాథ్ టాగోర్ జయంతి సందర్భంగా ‘సాక్షి’ సం పాదకీయ పేజీలో ‘మాతృ వందనం’ అంటూ ఒక రచన చేశారు. దాంట్లో జాతీయ స్థాయి విషయాలపై వారి సమాచార లోపం లేదా సమాచారం పట్ల వారి నిర్లక్ష్యం పట్ల ఖేదపడుతున్నాను. వారి ఉద్దేశం తేట తెల్లమే. ‘జనగణమన’ను చిన్నది చేసి ‘వందేమాత రం’ను పెద్ద చేయడం. జాతీయగీతంగా వందే మాతరం మెరుగైనదీ, మరిం త సమంజసమైనదన్న భావన కలుగజేయాలనే రచయిత ఆతురత ప్రద ర్శించారు. ఈ క్రమంలో వివాదపు లోయల్లో పడి పోవడం, గోష్పాదమంత వ్యర్థ సంచలనాల్లో ఇరు క్కోవడమూ ఆయనకు పరిపాటిగా మారింది. టాగోర్ జనగణమన గీతాన్ని 1911లో మదన పల్లిలో రాశారని గొల్లపూడి గారు చెప్పడం ఒక పూర్తి స్థాయి తప్పుడు సమాచారం. ఇంత ప్రాథమిక సమాచారాన్ని కూడా తప్పుగా ఇవ్వడం శోచనీయం. 1911లో టాగోర్ ఉన్నది నాటి కలకత్తాలో. ఆ నగ రం అప్పటి భారతదేశ రాజధాని. ఇంగ్లండ్‌లో సిం హాసనం అధిష్టించిన పంచమ జార్జ్ చక్రవర్తి కలక త్తాకు వచ్చారు. ఆనాటికి బ్రిటిష్ విధేయులుగా ఉన్న కాంగ్రెస్ వారు ఈ రాజసందర్శనను పురస్కరించు కుని ఒక గీతం రాయమని కోరగా టాగోర్ జనగణ మన రాశారు. దాన్ని 27-12-1911 సాయంత్రం జార్జ్ చక్రవర్తి సన్మాన సభలో స్వాగతగీతంగా పాడారు. ఆనాటికి అంటే 1911కి జనగణమన జాతీ య గీతం అవుతుందని ఎవరూ అనుకోలేదు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు, జనగణమనకు గల సంబంధం 1918-19 కాలం నాటిది. అక్కడి అనెబిసెంట్ థియోసాఫికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఐరిష్ కవి జేమ్స్ కజిన్స్ పిలుపు మేరకు మదనపల్లెకి వచ్చిన టాగోర్ వారి కోరిక మేరకు ఆ గీతాన్ని ఆల పించి ఆంగ్లానువాదం కూడా చేశారు. జేమ్స్ భార్య మార్గరేట్ కజిన్స్ సహకారంతో టాగోర్ స్వయంగా జనగణమన గీతాన్ని పాడే పద్ధతిని స్థిరపరిచారు. ఇప్పటికీ అదే వరుసలో మనం పాడుతున్నాం. అయితే 1918 నాటికి కూడా ఈ గీతం దేశ జాతీయ గీతం అవుతుందన్న అంచనాలు ఎవరికీ లేవు. 1911లో రాసిన గీతం 36 ఏళ్ల తర్వాత జాతీ యగీతం అయిందనుకుని, దాన్ని అలా చేయడంలో మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌నెహ్రూ వంటి వారికి ఏవో ప్రత్యేక ఇష్టాలు ఉన్నాయని అక్కడికి ఈ కాల మిస్ట్ తానే కనిపెట్టినట్లుగా సన్నాయి నొక్కులు నొక్క డం.. ఇది మరొక తీవ్ర దురవగాహన. ‘జనగణ మన’ జాతీయ గీతం అయింది దాన్ని రాసిన 36 ఏళ్ల తర్వాత అంటే 1947లో కాదు. భారత రాజ్యాంగ సభ 1950 జనవరి 24న అలా తీర్మానించింది. ఆనాటికి మహాత్మాగాంధీ జీవించి లేరు. ఇది కూడా తెలియకుండా జాతీయ చారిత్రక ప్రాముఖ్యత కలి గిన అంశాలపై రాయడం దోషం, అపరాధం కూడా. దేశమంతటికీ అర్థమయ్యే భాషలో సంస్కృత పదాల తత్సమ బెంగాలీలో రాసిన జనగణమన గీతాన్ని తక్కువ చేసే ప్రయత్నంలో తానే చిన్నపోయారు ఈ కాలమిస్ట్. అందుకు విచారంతోపాటు చరిత్రలో సం ఘటనలను చెప్పడంలో కాలమిస్టు మారుతీ రావు గారు మరింత జవాబుదారీతనాన్ని కలిగి ఉండాలని అనుకోవడం పాఠకుల కనీసస్థాయి ఆశగా వారు గుర్తిస్తే బాగుంటుంది. (రామతీర్థ ప్రముఖ కవి, రచయిత) మొబైల్: 98492 00385