ఆయన శిక్షణ.. శిష్యులకు నజరానా..
గొల్లప్రోలు : వృత్తి పట్ల చిత్తశుద్ధి ఉంటే రాయిని కూడా శిల్పంగా రూపొందించొచ్చని చాటారు గొల్లప్రోలు జిల్లాపరిషత్ హైస్కూలు గణితోపాధ్యాయుడు జవ్వాది కామేశ్వరరావు. ప్రతిభ ఉండి ఉన్నత చదువులకు దూరమయ్యే విద్యార్థులకు ఆర్థికసహాయం చేయూతనిచ్చే ఉద్దేశంతో జాతీయ మానవ వనరుల అభివృద్ధి విభాగం ప్రవేశపెట్టిన పథకమే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్). దేశవ్యాప్తంగా సంవత్సరానికి లక్షమంది విద్యార్థులకు ఏటా రూ.6 వేలు చొప్పున నాలుగేళ్లు స్కాలర్షిప్ అందచేస్తోంది. ఏడవ తరగతిలో 55 శాతం మార్కులు దాటిన విద్యార్థులు 8వ తరగతిలో స్కాలర్షిప్టెస్ట్ రాసేందుకు అర్హులు.
సంబంధిత పరీక్షకు కామేశ్వరరావు శిక్షణనిచ్చిన 32 మంది విద్యార్థుల్లో 16 మంది స్కాలర్షిప్కు ఎంపికయ్యూరు. అంతేకాక జిల్లాలోని మొదటి పదిర్యాంకుల్లో 1,4,7,10 ర్యాం కులు ఈ పాఠశాల విద్యార్థులే కైవసం చేసుకున్నారు. కామేశ్వరరావు విద్యార్థులకు ప్రతిరోజూ ప్రత్యేకశిక్షణ ఇచ్చారు. ఉద యం, సాయంత్రం వివిధాంశాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు వారాంతపు పరీక్షలు నిర్వహించారు. ఆయన కృషికి ఫలితంగానే 16 మంది ప్రతిభకలిగిన పేద విద్యార్థులు స్కాలర్షిప్కు అర్హత సాధించారు. వీరికి 9వ తరగతి నుంచి ఏటా రూ.6 వేల చొప్పున ఇంటర్ పూర్తయ్యేవరకు ఆర్థిక ప్రోత్సాహం అందచేయనున్నారు.
ప్రత్యేక శిక్షణ ఇచ్చారు..
కామేశ్వరరావు మాస్టారు మాకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మొదటి నుంచి స్కాలర్షిప్టెస్ట్కు మమ్మల్ని సిద్ధం చేశారు. మోడల్ పేపర్లు రూపొందించి పరీక్షలు రాయించేవారు. మొదటి ర్యాంకు పొందడం ఆనందంగా ఉంది.
- మైనం సూరిబాబు, జిల్లాలో మొదటి ర్యాంకర్
7వ తరగతి నుంచే అవగాహన కల్పిస్తున్నా..
ఆర్థికసమస్యలతో చదువుకు దూరమవుతున్న విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ ఎంతో ఉపయోగకరం. 7వ తరగతి నుంచే విద్యార్థులకు స్కాలర్షిప్టెస్ట్పై అవగాహన కల్పిస్తున్నాను. రానున్న రోజుల్లో మరింత మంది స్కాలర్షిప్కు అర్హత సాధించేలా తయారు చేస్తాను.
- జవ్వాది కామేశ్వరరావు, గణితోపాధ్యాయుడు