గవద వ్యాధితో గజగజ
గోనబావి (గుమ్మఘట్ట): గోనబావి గ్రామంలో గవద (గొంతువాపు) వ్యాధి చిన్నారులను గజగజ వణికిస్తోంది. శుక్రవారం ఈ వ్యాధి లక్షణాలతో రెండో తరగతి చదువుతున్న వడ్డే అనిల్(7) మృతి చెందాడు. 24 గంటలు గడవక ముందే 4వ తరగతి విద్యార్థిని అక్షయ శనివారం గొంతు వాపు, తీవ్ర జ్వరంతో బాధపడుతూ మంచం పట్టింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు జిల్లా ఇమ్యూనేజేషన్ అధికారి (డీఐఓ) పురుషోత్తం, వైద్యులు రామాంజినేయులు, రమేష్, సీహెచ్ఓ వెంటేశ్వర్లుతో కలసి గ్రామంలో పర్యటించారు. ఇంటింటికెళ్లి చిన్నారులకు చికిత్సలు అందజేశారు. డీఐఓ మాట్లాడుతూ చిన్నపిల్లలకు టీకాలు క్రమం తప్పకుండా వేయాలని, వీటి ప్రక్రియ సక్రమంగా చేపట్టకపోవడం, అపరిశుభ్రత, కలుషిత నీరు తాగడం వల్ల ఈ వైరస్ ప్రబలే అవకాశం ఉందన్నారు. అనంతరం వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న విద్యార్థిని అక్షయను అనంతపురం ఆస్పత్రిలో చేర్చేందుకు వెంట తీసుకెళ్లారు.