హామీలు కాదు.. నిధులు కేటాయించాలి
మంచిర్యాల సిటీ : ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పనులు విరివిగా చేపడతానంటూ బహిరంగ సభల్లో హామీలు గుప్పించడం మానుకొని ఆయా పనులకు ముందుగా నిధులు కేటాయించాలని, అప్పుడే ఆయనను ప్రజలు నమ్ముతారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోనె శ్యాంసుందర్రావు అన్నారు. శుక్రవారం ఆయన నాయకులతో కలిసి మంచిర్యాలలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వాలూ కేసీఆర్ మాదిరిగానే గిరిజనులకు అనేక హామీలిచ్చి విస్మరించాయని పేర్కొన్నారు. ఉట్నూర్లో వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చి మరిచాయని ఆరోపించారు.
గిరిజన యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటుచేస్తారో స్పష్టం చేయకపోవడంతో గిరిజనుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. యూనివర్సిటీని ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి నివేదికలే తయారు కాలేదని, అప్పుడే జిల్లాకు కొమురం భీమ్ పేరు పెడతామని ప్రకటించడం సరికాదని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకే భీమ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆహారం, అనారోగ్యం, కలుషితనీరు తదితర కారణాలతో మృతిచెందిన గిరిజనుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్నారు. మంత్రివర్గ విస్తరణలో గిరిజన శాఖ మంత్రి పదవిని ఈ జిల్లాకు చెందిన నాయకుడికే ఇవ్వాలని కోరారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మున్నారాజ్ సిసోధ్య, పట్టణ అధ్యక్షుడు అమరశెట్టి మల్లేశ్, నాయకులు సతీశ్రావు, గందం రమేశ్ పాల్గొన్నారు.