అర్హులందరికీ ‘బంగారు తల్లి’
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తు అందించేందుకు ఉద్దేశించిన ‘బంగారుతల్లి పథకాన్ని’ అర్హులైన వారందరికీ వర్తింపజేసేం దుకు సమష్టిగా కృషి చెయ్యాలని జి ల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరం లో ‘బంగారు తల్లి పోస్టర్’ను విడుదల చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఈ యేడాది మే నెల నుంచి జిల్లా వ్యాప్తంగా పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఈ పథకం వర్తిస్తోందన్నారు. ఇందుకుగాను వైధ్యులు ధృవీకరించిన బర్త్ సర్టిఫికెట్‌తోపాటు, ఇతర ధృవపత్రాలతో దరఖాస్తులను అందజేయాలన్నారు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో పథకం అమలు జరుగుతుందని, ప్రతి దరఖాస్తును పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే పథకాన్ని వర్తింపజెయ్యాలన్నారు.
వైద్య సిబ్బంది నుంచి గర్బిణీల స్త్రీల వివరాలు, పుట్టిన ప్రతి బిడ్డ సమాచారాన్ని సేకరించి డిఆర్డిఏకు అందజేయాలన్నారు. ఈ పథకం ద్వారా ఆడపిల్లలకు చదువుతోపాటు, వారికి ఉపాధి లభించేంత వరకు ప్రభుత్వసాయం అందుతుందన్నారు. పథకంపై గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, అర్హులైన వారందరు వినియోగించుకొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా.చంద్రశేఖర్, డిపిఓ రవీందర్, డ్వామా పీడి వెంకటరమణ రెడ్డి, డిఆర్డిఏ పీడి చంద్రశేఖర్ రెడ్డి, ఐసిడిఎస్ పీడి ఇందిర, తదితరులు పాల్గొన్నారు.