ఒకదానిపై ఒకటి రైలు బోగీలు.. జనం పరుగులు.. అసలేం జరిగింది?
గుత్తి(అనంతపురం జిల్లా): రైలు బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కాయి.. జనం ఉరుకులు పరుగులు తీశారు. ఎన్డీఆర్ఎఫ్ ( నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) క్షణాల్లో ప్రత్యక్షమైంది. ప్రయాణికులను కాపాడటంతో పాటు క్షతగాత్రులకు ఎలాంటి హాని జరగకుండా బోగీల్లోంచి వెలుపలికి తీసుకువచ్చారు. అసలేం జరిగింది..ఏం జరుగుతుందో తెలియక జనం దిక్కులు చూశారు.
చదవండి: అల వీరాపురంలో అతిథులు.. చూసొద్దాం రండి!
అయితే అదంతా రైల్వేశాఖ నిర్వహించిన మెగా మాక్ డ్రిల్ అని తెలిసి కుదుటపడ్డారు. బుధవారం గుత్తి రైల్వే స్టేషన్లోని సౌత్ క్యాబిన్ సమీపంలో గుంతకల్లు డీఆర్ఎం వెంకట రమణారెడ్డి పర్యవేక్షణలో రైల్వే ప్రమాదాలు జరిగినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెగా మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఆర్ఎం కిరణ్, ఏడీఆర్ఎం మురళి కృష్ణ, సీనియర్ డీఎంఈ పుష్పరాజ్, ఏడీఎస్ఓ బాలాజి, ఏసీఎం శ్రీనివాస్, ఏడీఎం విజయ కృష్ణ, ఏడీఎంఈ ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.