క్రీడలకు అండగా నిలవండి
మాదాపూర్, న్యూస్‌లైన్: కార్పొరేట్ సంస్థలు తమ పరిధిలో క్రీడలను ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కోరారు. వారి సహకారంతోనే మన దేశం క్రీడల్లో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన అన్నారు. మాదాపూర్‌లోని టెక్ మహీంద్రా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో... కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ (సీబీఎల్) విజేతలకు గోపీచంద్ బహుమతులు అందజేశారు. టెక్ మహీంద్రా సంస్థ ఈ టోర్నమెంట్‌కు భాగస్వామిగా వ్యవహరించింది.
గోపీ అకాడమీలో మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీ ఆదివారం ముగిసింది. ఇందులో 68 సంస్థలకు చెందిన 550 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. పురుషుల సింగిల్స్‌లో వీరేందర్ మౌద్గిల్, మహిళల సింగిల్స్‌లో అదితి రెడ్డి, పురుషుల డబుల్స్‌లో జయంత్-మోహన్ సుబ్బరాయన్, మహిళల డబుల్స్‌లో తేజస్విని-సుబ్బలక్ష్మి టైటిల్స్ సాధించారు. విజేతలకు రూ. 30 వేలు, రన్నరప్‌కు రూ. 15 వేల చొప్పున నగదు బహుమతితో పాటు ట్రోఫీలు అందజేశారు.