నెల క్రితం అదృశ్యం.. నేడు ప్రత్యక్షం
పలాస: కాశీబుగ్గ శివాజీనగర్‌కు చెందిన యువకుడు గోపీనాథ్ పట్నాయక్ అదృశ్యం మిస్టరీకి ఎట్టకేలకు తెరపడింది. ఫిబ్రవరి 28న కాశీబుగ్గలోని తమ గణేష్ ప్రింటర్ షాపు నుంచి విధులు ముగించుకుని బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. రాత్రి 10 గంటల సమయంలో అదే రోజు ఒక అపరిచితుడి ఫోన్ నుంచి గణేష్ ప్రింటర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న గోపీనాథ్ సోదరుడు గోవింద పట్నాయక్‌కు కాల్ వచ్చింది. మీ తమ్ముడు సజీవంగా మీకు కావాలంటే మేం కోరిన డబ్బులివ్వాలని, అక్కుపల్లి శివసాగర్‌బీచ్‌కు డబ్బులు పట్టుకుని రావాలని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబీకులు ఆందోళన చెంది కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాశీబుగ్గ పోలీసులు ఫోన్‌కాల్ ఆధారంగా పరిశీలిస్తే విశాఖపట్నం నుంచి కాల్ వచ్చినట్టు తెలుసుకున్నారు. ఆ తరువాత అతని ఆచూకీ లభించలేదు. ఆ మరుసటి రోజు నుంచి అతని కోసం అటు పోలీసులు, ఇటు కుటుంబీకులు గాలించారు. నెలరోజులు గడిచినా ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనతో ఉన్న సమయంలో గోపీనాథ్ నుంచి రెండురోజుల క్రితం గోవింద పట్నాయక్‌కు ఫోన్‌కాల్ వచ్చింది.
తాను కేరళలోని రైల్వేస్టేషన్ వద్ద గల ఆర్పీఎఫ్ స్టేషన్లో ఉన్నానని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పడంతో కాశీబుగ్గ పోలీసులు సహకారంతో కారులో కేరళ బయలుదేరి వెళ్లారు. శనివారం ఉదయం కాశీబుగ్గ చేరుకొని పోలీసుల ముందు ఆయన్ని హాజరుపర్చారు. ఆయన పరిస్థితి బాగోలేకపోవడంతో ఏం జరిగిందనేది ఇంకా తెలుసుకోవాల్సి ఉందని కాశీబుగ్గ పోలీసులు చెప్పారు. మొత్తానికి గోపీనాథ్ ఇంటికి చేరుకోవడంతో కుటుంబీకులు ఊపిరిపీల్చుకున్నారు.