goraksha diwas
-
గో పూజ నిర్వహించిన స్వామి పరిపూర్ణానంద
హైదరాబాద్: లోయర్ ట్యాంక్ బండ్ భాగ్యనగర్ గోశాలలో గురువారం శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామిజీ గో పూజను నిర్వహించారు. గోవులను పూజించడం సనాతన ధర్మమని...బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలన్న ఆలోచన రావడం దౌర్భాగ్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి డిసెంబర్ 10వ తేదీని గోరక్ష దివస్‌గా నిర్వహించాలని స్వామిజీ సూచించారు. గో ఆధారిత వ్యవసాయంతోనే రైతుల ఆత్మహత్యలను నివారించవచ్చునని... తెలుగు రాష్ట్రాల్లో గోరక్ష క్రాంతి ఫథకం కింద రైతులకు ఆవులను పంపిణీ చేయాలని ప్రభుత్వాలను కోరారు. ఆవును ప్రజలు పశువుగా, జంతువుగా చూడకూడదని... ఆవు పాలు తాగితే మంచిదని...దీనిపై విస్తృత ప్రచారం జరగాలని స్వామిజీ సూచించారు. గోవధ అనే మాట పలకడమే పెద్ద నేరమని, దానికి 6 నెలల శిక్ష కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా చట్టాలను కఠినంగా అమలు చేయాలని పరిపూర్ణానంద స్వామిజీ ప్రభుత్వాలను కోరారు. -
'బీఫ్ ఫెస్టివల్ కాదు, ఫెస్టివల్ జరుపుకుందాం'
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌ను ఉపసంహరించుకోవాలని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి పిలుపునిచ్చారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ కుహనావాదులు చెప్పే మాయమాటల ముసుగులో లొంగిపోవద్దని సూచించారు. బీఫ్ తింటే బుద్ధిమాంద్యం వస్తుందని అన్నారు. పాడి ఇచ్చే ఆవు దైవంతో సమానమని పరిపూర్ణానంద స్వామి అన్నారు. అందుకే బీఫ్ ఫెస్టివల్ నిర్వహించే రోజును.. తాము గోరక్ష దివాస్‌గా ప్రకటిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 10న ప్రతి ఒక్కరూ కనిపించే గోవుకు పూజ చేసి, నమస్కరించాలని, గోవులను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రాచీన కాలం నాటి వేదాలను ఇక్కడవాళ్లు చెబితే పట్టించుకోరని, అవే విషయాలను అమెరికా, ఇంగ్లండ్ నుంచి వచ్చినవాళ్లు చెబితే శాస్త్రీయమా అని పరిపూర్ణనంద స్వామి ప్రశ్నించారు. బీఫ్ ఫెస్టివల్ కాదు... ఫెస్టివల్ జరుపుకుందామని ఆయన సూచించారు.