కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
పోలీసులకు, భూనిర్వాసితులకు తోపులాట, వాగ్వివాదం
సీపీఐ నాయకుల అరెస్టు, రాస్తారోకో
కలెక్టర్ వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నం
కరీంనగర్ : గౌరవెల్లి, గండిపల్లి, అనంతగిరి రిజర్వాయర్ల ముంపు నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్‌చేస్తూ సీపీఐ చేపట్టిన చలో కలెక్టరేట్ ఉద్రిక్తంగా మారింది. మూడుగంటలపాటు ఆందోళన కొనసాగింది. ముంపు గ్రామాల భూనిర్వాసితులకు 2013 భూసేకరణ, పునరావాస చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో భూనిర్వాసితులు ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకుని గేట్ ముందు బైఠాయించారు. సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఐ నాయకులు, భూనిర్వాసితులు పలుమార్లు కలెక్టరేట్‌లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో పోలీసులు, నిర్వాసితుల మధ్య తోపులాట జరిగింది. ఇదే సందర్భంలో రెండో గేట్ద్వారా కలెక్టర్ నీతూప్రసాద్ బయటకు వస్తుండడాన్ని గమనించిన సీపీఐ కార్యకర్తలు ఆమె వాహనాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని వాహనాన్ని ప్రెస్‌క్లబ్ ముందు వీధిగుండా బయటకు పంపించారు. అనంతరం భూనిర్వాసితులు మరోమారు లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా పోలీసులపై తిరగబడ్డారు. దీంతో పోలీసులు వెనక్కితగ్గారు. కలెక్టర్, జిల్లా అధికారులు ఎవరైనా వచ్చేంత వరకు కదలబోమని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పోలీసులు పెద్దఎత్తున చేరుకుని భూనిర్వాసితులు, సీపీఐ నాయకులను అదుపులోకి తీసుకుని వాహనాల్లో తీసుకెళ్తుండగా.. మహిళలు అడ్డుగా పడుకున్నారు. నాయకులను వదలాలని పట్టుబట్టడంతో ఉద్రిక్తతకు దారితీసింది. మూడుగంటలపాటు జరిగిన ముట్టడి అనంతరం పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకుని తరలించారు. దీంతో భూనిర్వాసితులు ప్రతిమ మల్టీప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.
ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది
–మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్
కలెక్టరేట్ ముట్టడికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మాట్లాడుతూ భూనిర్వాసితులకు సంబంధించి ప్రభుత్వానికి స్పష్టమైన నిర్ణయం లేదన్నారు. అప్రజాస్వామిక పోకడలతో ప్రజా ఉద్యమాలను అణిచివేస్తున్న ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని మంత్రి హరీశ్‌రావు అనడం అవివేకమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, నాయకులు బోయిని అశోక్, పి.కేదారి, కూన శోభారాణి, పెండ్యాల అయిలయ్య, అందె స్వామి, కర్రె భిక్షపతి, గడిపె మల్లేశ్, మాడిశెట్టి శ్రీధర్, పైడిపల్లి రాజు, మహేందర్, మణికంఠరెడ్డి, ముంపు గ్రామాల సర్పంచులు గంభీరపు వివేకానంద్, కోయ్యడ సృజన్‌కుమార్, కోమటిరెడ్డి జైపాల్‌రెడ్డి, బోడిగె కొమురయ్య, రాజయ్య, భూనిర్వాసితుల సమితి జేఏసీ నాయకులు జంగ సంపత్‌యాదవ్, సింగిరెడ్డి కొండల్‌రెడ్డి, బద్దం శంకర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, మాలోతు తనుకునాయక్, చాట్ల సంపత్, యాదయ్య పాల్గొన్నారు.