కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు
వయసు మీద పడుతున్న కొద్దీ వచ్చే కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని ఏపీ పెన్షనర్ల సంఘం కార్యదర్శి కేఎస్ హనుమంతరావు అన్నారు. విజయవాడ గవర్నర్ పేటలోని స్వాతంత్ర్య సమరయోధుల భవనంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల కోసం రాజమండ్రి గౌతమి నేత్రాలయం గురువారం ప్రత్యేకంగా నిర్వహించిన నేత్రవైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెన్షనర్లు ముఖ్యంగా తమ కంటి చూపును ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని, ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఈ శిబిరానికి మొత్తం 62 మంది హాజరు కాగా, వాళ్లలో 18 మందికి కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల పథకం (ఈహెచ్ఎస్) కింద వీళ్లందరికీ సోమవారం నాడు రాజమండ్రిలో ఆపరేషన్లు చేస్తారు. దీనికి సంబంధించి వాళ్లందరికీ రవాణా, ఆహారం, మందులు అన్నింటినీ ఆస్పత్రి అందజేస్తుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ల ప్రతినిధి టి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.