governament negligence
-
సీఎం సభ.. అవస్థల కథ
సాక్షి, గుంటూరు/సత్తెనపల్లి/నకరికల్లు: జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన అంటే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సీఎం సభకు భారీగా ప్రజలను తరలించి విజయవంతం చేశామని అనిపించుకునేందుకు టీడీపీ నాయకులు తీసుకుంటున్న చర్యలు జిల్లా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు సమీపంలో రూ.6020.15 కోట్లతో తలపెట్టిన గోదావరి– పెన్నా నదుల అనుసంధానం మొదటి దశ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలను తరలిం చారు. అయితే సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో కార్యకర్తలు, ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. కనీసం తాగునీటి వసతి కల్పించలేదు. మధ్యాహ్నమైనా భోజనం ఊసే లేకపోవడంతో సభ జరుగుతుండగానే ప్రజలు వెనుతిరిగారు. దీంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. సభకు 200 ఆర్టీసీ బస్సులు సీఎం సభకు జనాన్ని తరలించేందుకు టీడీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా 200 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ప్రైవేటు స్కూల్ బస్సుల్లో సైతం ప్రజలను తరలించారు. పిడుగురాళ్లకు చెందిన ఓ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రతి ప్రైవేట్ స్కూల్ నుంచి ఒకటి లేదా రెండు బస్సులు పంపాలని శనివారం ఆదేశించారని తెలిసింది. పిల్లలను కూడా పంపాలని ప్రైవేట్ స్కూల్ యజమానులను అధికారులు ఆదేశించగా ప్రస్తుతం పాఠశాలల్లో పరీక్షల జరుగుతున్న నేపథ్యంలో సాధ్యం కాదని తేల్చిచెప్పారని సమాచారం. ఉన్న స్కూల్ బస్సుల్లో సగానికిపైగా సీఎం సభలకు తరలి వెల్లడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడ్డారు. సాధారణంగా స్కూల్ బస్సులను ఇతర కార్యక్రమాలకు వినియోగించే సమయంలో రవాణా కార్యాలయం ద్వారా అనుమతి పొందాలి. రవాణా అధికారులే దగ్గరుండి సీఎం, టీడీపీ కార్యక్రమాలకు బస్సులను సమాకూర్చడంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకుని బస్సులు నడిపినా ఆశించిన స్థాయిలో ప్రజలు రాలేదని టీడీపీ ముఖ్యనేతలే చర్చించుకున్నారు. ప్రయాణికుల పడిగాపులు సీఎం సభకు జిల్లా నుంచి 200 ఆర్టీసీ బస్సులు నడపడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్తీక సోమవారం కావడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. సత్తెనపల్లి ఆర్టీసీ డిపో నుంచి 25 బస్సులు, పిడుగురాళ్ల డిపో నుంచి 30, మాచర్ల డిపో నుంచి 25 ఆర్టీసీ బస్సులను సీఎం సభకు కేటాయించారు. గుంటూరు నగరంలోని పల్నాడు బస్టాండ్‌లో మాచర్ల, గురజాల, పిడుగురాళ్ల తదితర దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందుల పడ్డారు. సరిపడా బస్సులు లేకపోవడంతో ఆర్టీసీ డిపోల్లో గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అరకొరగా ఉన్న బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఇదే అదునుగా ప్రైవేటు వాహన యజమానులు ప్రయాణికుల నుంచి భారీగా చార్జీలు వసూలు చేశారు. పది మంది ఎక్కాల్సిన ఆటోలో 30 మందిని తరలిం చారు. గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం ఇప్పటికీ లేదు. ముఖ్యమంత్రి పర్యటనకు ప్రజలను తరలించేందుకు మాత్రం బస్సు వెళ్లని గ్రామాలకు కూడా ఆర్టీసీ బస్సులు పంపారు. సత్తెనపల్లి మండలం గర్నెపూడి గ్రామానికి ఎంతోకాలంగా బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు ప్రైవేటు వాహనాలు ఆశ్రయిస్తున్నారు. విద్యార్థులు ప్రమాదకర ప్రయాణం సాగిస్తున్నారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజాప్రతినిధులు అధికారులకు, పాలకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టిం చుకున్న నాథుడు లేడు. ప్ర స్తుతం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆ గ్రామానికి కూడా ఆర్టీసీ బస్సులను పంపడంతో కొందరు మహిళలు తాము బస్సు ఎక్కేది లేదని భీష్మించారు. తప్పనిసరి పరిస్థితుల్లో యానిమేటర్ తనకు తెలిసిన కొద్దిమంది మహిళలను బస్సులో తీసుకెళ్లారు. సీఎం రాక ఆలస్యం.. జారుకున్న జనం గోదావరి–పెన్నా నదుల అనుసంధానం శిలాపలకం ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభా ప్రాంగణానికి ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోవాల్సి ఉండగా గంటన్నర ఆలస్యంగా వచ్చారు. ప్రసంగం కూడా చాలా ఆలస్యంగా మొదలుపెట్టారు. అప్పటికే సమయం మధ్యాహ్నం 1.40 గంటలు కావడంతో సీఎం ప్రసంగిస్తుండగానే జనం తిరిగి వెళ్లిపోవడం కనిపించింది. కొందరు టీడీపీ నేతలు వారిని ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయిది. దీంతో సభలో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ముఖ్యమంత్రి ఎదుటే కుర్చీలు ఖాళీ అయ్యాయి. వెనుదిరుగుతున్న జనాలను ఆపేందుకు ప్రయత్నిస్తూ సీఎం దృష్టిలో పడేందుకు పలువురు తెలుగు తమ్ముళ్లు పోటీ పడ్డారు. వెట్టిచాకిరీ చేయించి భోజనం పెట్టరా? నకరికల్లు(సత్తెనపల్లి): ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పారిశుద్ధ్య పనులు చేసేందుకు తీసుకొచ్చి భోజనం కూడా సమయానికి పెట్టరా అంటూ పలువురు పారిశుద్ధ్య కార్మికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. నకరికల్లులో సోమవారం ముఖ్య మంత్రి సభ సందర్భంగా దుగ్గిరాల, నాదెండ్ల, గణపవరం, రెంటచింతల తదితర ప్రాంతాల నుంచి సుమారు 90 మంది పారిశుద్ధ్య కార్మికులను తీసుకొచ్చారు. రెండురోజులుగా కష్టపడుతున్న తమకు సోమవారం సాయంత్రం నాలుగు గంటలైనా భోజనం పెట్టించలేదని కార్మికులు మండిపడ్డారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. దూరప్రాంతాల నుంచి తీసుకొచ్చి వెట్టిచాకిరీ చేయించి పూటకు తిండి పెట్టడం కూడా చేయలేదని మండిపడ్డారు. ఈ లోగా పలువురు అధికారులు వచ్చి 4.30 గంటల సమయంలో భోజనాలు తెప్పించడంతో వివాదం సద్దుమణిగింది. -
ఎత్తిపోతున్న పథకాలు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: సాగునీటి సౌకర్యం లేని భూములను, బీడు భూములను బంజర్లుగా మార్చేందుకు ఉద్దేశించిన ఎత్తిపోతల పథకాలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయి. జిల్లాలో మొత్తం 355 ఎత్తిపోతల పథకాలను వందల కోట్లు వెచ్చించి నిర్మించినా..ప్రస్తుతం వాటిలో వందకు పైగా అసలెందుకూ పనికిరాకుండా పోయాయి. జిల్లాలోని ఎత్తిపోతల పథకాల స్థితిగతులను న్యూస్‌లైన్ బృందం సోమవారం పరిశీలించింది. సాగునీటి వసతి లేని పొలాలకు దగ్గరలో కానీ, కొంత దూరంలో నీటి పారుదల ప్రాంతాలుంటే అక్కడ నుంచి నీటిని సాగు భూములకు అందించడం ఎత్తిపోతల పథకాల ఉద్దేశం. జిల్లాలో పుష్కలంగా వాగులు, ఏరులున్నా..వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. గుండ్లకమ్మ, ముసి, పాత ముసి, పాలేరు, మన్నేరు, అట్లేరు, ముట్లేరు, ఉప్పుటేరు, ఎలికేరులు జిల్లాలో ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. వీటితో పాటు రాళ్లపాడు, దున్నపోతువాగు, ఉప్పువాగు, ఎర్రవాగు, చిల్లాకాలువ, పందివాగు తదితర నీటి వనరులున్నాయి. వీటిపై కొత్తగా ఎత్తిపోతల పథకాలు ఐదేళ్లుగా ఒక్కటి కూడా మంజూరు కాకపోగా..ఇప్పటికే ఉన్నవి గాడితప్పాయి. జిల్లాలో ఎత్తిపోతల పథకాల ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాల్లో వరి పంట పండించుకునే వీలుండగా, మరో లక్ష ఎకరాల్లో ఇతర ప్రత్యామ్నాయ పంటలు రైతులు సాగుచేసుకోవచ్చు. అయితే వాటిలో కనీసం 50 వేల ఎకరాలు కూడా సక్రమంగా సాగుచేసుకునే అవకాశం లేకుండా పోయింది. కొండపి నియోజకవర్గంలో పది పథకాలుంటే ఐదు పనికిరాకుండా పోయాయి. సింగరాయకొండ మండలంలోని కనుమళ్లకు చెందిన 500 ఎకరాలు సస్యశ్యామలం చేసేందుకు * 215 లక్షలు వెచ్చించి నిర్మిస్తే.. ఆ నిధులు మొత్తం మన్నేటిలో కలిసినట్లే అయింది. అసలు మోటార్లు మాయమయ్యాయి. సంతనూతలపాడు నియోజకవర్గంలో 6 పథకాలకుగాను ఒక్క ఎమిలేయర్ చానల్ స్కీం ఒక్కటే పంటలకు జీవం పోస్తోంది. కనిగిరి నియోజకవర్గంలో నాలుగు పథకాల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. మోటార్ల మరమ్మతులే పెద్ద సమస్య ఎత్తిపోతల పథకాలకు ప్రధాన సమస్య మోటార్లు. కంపెనీ మోటార్లు ఏర్పాటు చేయకపోవడం, అసంబ్లింగ్ మోటార్లు ఎక్కువగా పథకాలకు పెట్టడం వలనే తరచూ సమస్య వ స్తోంది. బిల్లులు మాత్రం కంపెనీ మోటార్ల పేరుమీదే ఉంటాయి. దీనికి తోడు విద్యుత్ సర్వీస్ ఈ స్కీమ్‌కు కేటగిరీ-4 కింద ఉండటంతో యూనిట్ ధర భారంగా మారుతోంది. ఒక్కో యూనిట్ ధర *5.37 లు కావటం, నెలకు బిల్లులు వేలల్లో రావడంతో వాటిని కట్టలేక రైతులు అల్లాడుతున్నారు. పథకం నిర్వీర్యం కావడానికి ఇదొక కారణం కూడా. కనీసం పరిశ్రమలకు ఇచ్చిన రాయితీలు కూడా సాగునీటి కోసం వినియోగించే ఎత్తిపోతల పథకాలకు ఇవ్వకపోవడం దారుణం. 97 పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాం - వై.వెంకటేశ్వరరావు, ఈఈ జిల్లాలో మూతపడిన 97 ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలి. వాటి మరమ్మతుల కోసం *51 కోట్లు నిధులు అవసరమవుతాయని పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చి, నిధులు విడుదలైతే జిల్లాలో పూర్వ వైభవం చవి చూడవ చ్చు. వేటపాలెం మండలం మోటుపల్లి పథకాన్ని *3.30 కోట్లతో ఆధునికీకరిస్తున్నాం. అదే విధంగా నాయినపల్లి పథకానికి *2.5 కోట్లతో పనులు జరుగుతున్నాయి.