సీఎం సభ.. అవస్థల కథ | people faced many problem in cm public meeting | Sakshi
Sakshi News home page

సీఎం సభ.. అవస్థల కథ

Published Tue, Nov 27 2018 10:54 AM | Last Updated on Tue, Nov 27 2018 10:54 AM

people faced many problem in cm public meeting - Sakshi

ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయంలో ఖాళీగా ఉన్న కుర్చీలు

సాక్షి, గుంటూరు/సత్తెనపల్లి/నకరికల్లు: జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన అంటే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సీఎం సభకు భారీగా ప్రజలను తరలించి విజయవంతం చేశామని అనిపించుకునేందుకు టీడీపీ నాయకులు తీసుకుంటున్న చర్యలు జిల్లా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు సమీపంలో రూ.6020.15 కోట్లతో తలపెట్టిన గోదావరి– పెన్నా నదుల అనుసంధానం మొదటి దశ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేశారు.

అనంతరం జరిగిన సభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలను తరలిం చారు. అయితే సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో కార్యకర్తలు, ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. కనీసం తాగునీటి వసతి కల్పించలేదు. మధ్యాహ్నమైనా భోజనం ఊసే లేకపోవడంతో సభ జరుగుతుండగానే ప్రజలు వెనుతిరిగారు. దీంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.


సభకు 200 ఆర్టీసీ బస్సులు
సీఎం సభకు జనాన్ని తరలించేందుకు టీడీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా   200 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ప్రైవేటు స్కూల్‌ బస్సుల్లో సైతం ప్రజలను తరలించారు. పిడుగురాళ్లకు చెందిన ఓ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రతి ప్రైవేట్‌ స్కూల్‌ నుంచి ఒకటి లేదా రెండు బస్సులు పంపాలని శనివారం ఆదేశించారని తెలిసింది.

పిల్లలను కూడా పంపాలని ప్రైవేట్‌ స్కూల్‌ యజమానులను అధికారులు ఆదేశించగా ప్రస్తుతం పాఠశాలల్లో పరీక్షల జరుగుతున్న నేపథ్యంలో సాధ్యం కాదని తేల్చిచెప్పారని సమాచారం. ఉన్న స్కూల్‌ బస్సుల్లో సగానికిపైగా సీఎం సభలకు తరలి వెల్లడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడ్డారు.

సాధారణంగా స్కూల్‌ బస్సులను ఇతర కార్యక్రమాలకు వినియోగించే సమయంలో రవాణా కార్యాలయం ద్వారా అనుమతి పొందాలి. రవాణా అధికారులే దగ్గరుండి సీఎం, టీడీపీ కార్యక్రమాలకు బస్సులను సమాకూర్చడంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకుని బస్సులు నడిపినా ఆశించిన స్థాయిలో ప్రజలు రాలేదని టీడీపీ ముఖ్యనేతలే చర్చించుకున్నారు.


ప్రయాణికుల పడిగాపులు
సీఎం సభకు జిల్లా నుంచి 200 ఆర్టీసీ బస్సులు నడపడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్తీక సోమవారం కావడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. సత్తెనపల్లి ఆర్టీసీ డిపో నుంచి 25 బస్సులు, పిడుగురాళ్ల డిపో నుంచి 30, మాచర్ల డిపో నుంచి 25 ఆర్టీసీ బస్సులను సీఎం సభకు కేటాయించారు.

గుంటూరు నగరంలోని పల్నాడు బస్టాండ్‌లో మాచర్ల, గురజాల, పిడుగురాళ్ల తదితర దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందుల పడ్డారు. సరిపడా బస్సులు లేకపోవడంతో ఆర్టీసీ డిపోల్లో గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

అరకొరగా ఉన్న బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఇదే అదునుగా ప్రైవేటు వాహన యజమానులు ప్రయాణికుల నుంచి భారీగా చార్జీలు వసూలు చేశారు. పది మంది ఎక్కాల్సిన ఆటోలో 30 మందిని తరలిం చారు. గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం ఇప్పటికీ లేదు.

ముఖ్యమంత్రి పర్యటనకు ప్రజలను తరలించేందుకు మాత్రం బస్సు వెళ్లని గ్రామాలకు కూడా ఆర్టీసీ బస్సులు పంపారు. సత్తెనపల్లి మండలం గర్నెపూడి గ్రామానికి ఎంతోకాలంగా బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు ప్రైవేటు వాహనాలు ఆశ్రయిస్తున్నారు. విద్యార్థులు ప్రమాదకర ప్రయాణం సాగిస్తున్నారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజాప్రతినిధులు అధికారులకు, పాలకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టిం చుకున్న నాథుడు లేడు. ప్ర

స్తుతం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆ గ్రామానికి కూడా ఆర్టీసీ బస్సులను పంపడంతో కొందరు మహిళలు తాము బస్సు ఎక్కేది లేదని భీష్మించారు. తప్పనిసరి పరిస్థితుల్లో యానిమేటర్‌ తనకు తెలిసిన కొద్దిమంది మహిళలను బస్సులో తీసుకెళ్లారు.


సీఎం రాక ఆలస్యం.. జారుకున్న జనం
గోదావరి–పెన్నా నదుల అనుసంధానం శిలాపలకం ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభా ప్రాంగణానికి ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోవాల్సి ఉండగా గంటన్నర ఆలస్యంగా వచ్చారు. ప్రసంగం కూడా చాలా ఆలస్యంగా మొదలుపెట్టారు. అప్పటికే సమయం మధ్యాహ్నం 1.40 గంటలు కావడంతో సీఎం ప్రసంగిస్తుండగానే జనం తిరిగి వెళ్లిపోవడం కనిపించింది.

కొందరు టీడీపీ నేతలు వారిని ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయిది. దీంతో సభలో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ముఖ్యమంత్రి ఎదుటే కుర్చీలు ఖాళీ అయ్యాయి. వెనుదిరుగుతున్న జనాలను ఆపేందుకు ప్రయత్నిస్తూ సీఎం దృష్టిలో పడేందుకు పలువురు తెలుగు తమ్ముళ్లు పోటీ పడ్డారు.  


వెట్టిచాకిరీ చేయించి భోజనం పెట్టరా?
నకరికల్లు(సత్తెనపల్లి): ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా  పారిశుద్ధ్య పనులు చేసేందుకు తీసుకొచ్చి భోజనం కూడా సమయానికి పెట్టరా అంటూ పలువురు పారిశుద్ధ్య కార్మికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. నకరికల్లులో సోమవారం ముఖ్య మంత్రి సభ సందర్భంగా దుగ్గిరాల, నాదెండ్ల, గణపవరం, రెంటచింతల తదితర ప్రాంతాల నుంచి సుమారు 90 మంది పారిశుద్ధ్య కార్మికులను తీసుకొచ్చారు.

రెండురోజులుగా కష్టపడుతున్న తమకు సోమవారం సాయంత్రం నాలుగు గంటలైనా భోజనం పెట్టించలేదని కార్మికులు మండిపడ్డారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. దూరప్రాంతాల నుంచి తీసుకొచ్చి వెట్టిచాకిరీ చేయించి పూటకు తిండి పెట్టడం కూడా చేయలేదని మండిపడ్డారు. ఈ లోగా పలువురు అధికారులు వచ్చి 4.30 గంటల సమయంలో భోజనాలు తెప్పించడంతో వివాదం సద్దుమణిగింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement