వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేయూలి
వల్లూరు: ప్రభుత్వం వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నింటినీ తక్షణం మాఫీ చేయాలని కమలాపురం ఎమ్మెల్యే పీ.రవీంధ్రనాధ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక మండల పరిషత్ సభాభవనంలో ఎంపీపీ పొన్నోలు పిచ్చమ్మ అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ ప్రభుత్వం నేటికీ ప్రజలను మభ్యపెడుతూనే ఉందని విమర్శించారు.
కనీసం వడ్డీలో కొంత భాగానికి కూడా సరిపోని విధంగా కేవలం 5 వేల కోట్లను విడుదల చేయడం దారుణమన్నారు. వారి అబద్దపు హామీతో నేడు రైతులు పంట రుణాలను పొందడానికి వీలు లేకుండా పోయిందని విమర్శించారు. దీని వలన ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఎండిపోతున్నప్పటికీ పంటల బీమా పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ గూడూరు రవి మాట్లాడుతూ ఎవరైనా స్వార్థంతో ఇతరులకు హాని చేయరాదన్నారు.
మంచి పనులు చేసి ప్రజాదరణ పొందడానికి కృషి చేయాలన్నారు. సమాజంలో మంచితనం, మార్పు అవసరమని పేర్కొన్నారు. కక్షలు ,కార్పణ్యాలకు దూరంగా ఉండి ప్రజాదరణ పొందడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. జెడ్పీటీసీ అబ్బిరెడ్డిగారి వీరారెడ్డి మాట్లాడుతూ వ ల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరారు. ఈ మేరకు సమావేశంలో తీర్మాణాలను చేపట్టి ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మొగిలిచెండు సురేష్, తహశీల్దార్ వెంకటేష్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు , ఎంపీపీ తనయుడు శివకుమార్‌రెడ్డి , మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.