సన్నాయి నొక్కులు
- శ్రీకాకుళం సన్నాల కోసం రైతుల ఎదురుచూపు
- సరఫరా చేయలేక ప్రత్యామ్నాయం చూసుకోవాలని వ్యవసాయ అధికారుల సూచన
- హుద్‌హుద్‌తో గ్రామీణ విత్తనోత్పత్తి పథకం విఫలం?
అనకాపల్లి: ఈ ఏడాది వరుణుడు కరుణించినా ప్రభుత్వ యంత్రాంగానికి ముందుచూపులేని కారణంగా జిల్లా రైతులకు విత్తన కొరత శాపంగా మారింది. జిల్లాలో ఈ ఏడాది లక్షా 3 వేల హెక్టార్లలో వరి పంటను సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. విభిన్న బౌగోళిక స్థితులున్న జిల్లాలో ఏజెన్సీలో ఇప్పటికే వరి నారు, నేరుగా వెదజల్లే పద్ధతులలో రైతులు పంటల సాగుకు సన్నద్ధమవుతుండగా, మైదాన ప్రాంత రైతులకు ఈ నెలలో కురిసిన వర్షాలు సానుకూలంగానే మారాయి.
దోబూచులాడుతుందనుకున్న నైరుతికి తోడు అడపాదడపా నమోదయిన వర్షాలతో వరినారు పెంపకంపై రైతులు దృష్టి సారించారు. ఈ ఏడాది జిల్లా రైతుల కోసం 17 వేల క్వింటాళ్ల వరి విత్తనాన్ని వ్యవసాయ శాఖ సన్నద్ధం చేయగా రైతులంతా ఆశిస్తున్నది శ్రీకాకుళం సన్నాలు (ఆర్జీఎల్ 2537) కావడంతో వ్యవసాయ శాఖ సైతం చేతులెత్తేసింది.
హుద్‌హుద్ దెబ్బకు విత్తనోత్పత్తి కుదేలు : గత ఏడాది సంభవించిన హుద్‌హుద్ దెబ్బకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలు చేసిన గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కుదేలైంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహాయిస్తే విశాఖకు ఆర్జీఎల్ 2537 విత్తన కొరత తీవ్రంగా పరిణమించింది. జిల్లాలో లక్ష హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వరి సాగు చేస్తుం డగా కనీసం 75 వేల క్వింటాళ్ల వరి విత్తనం అవసరముంటుంది. ఏపీ సీడ్స్ ద్వారా జిల్లాకు సరఫరా అయ్యే ఆర్జీఎల్ 2537 బాగా తగ్గిపోవడంతో విత్తన కొరత జటిలంగా మారింది. ఉదాహరణకు గత ఏడాది అనకాపల్లి వ్యవసాయ శాఖ కార్యాలయం ఆధ్వర్యంలో 550 క్వింటా ళ్ల ఆర్జీఎల్ 2537 విత్తనాన్ని విక్రయించగా, ఈ ఏడాది ఇప్పటికి 200 క్వింటా ళ్ల విత్తనం రాగా వెం టనే అది అమ్ముడయింది. మహా అయి తే మరో 150 క్వింటాళ్ల విత్తనం వచ్చే అవకాశముందని వ్యవసాయాధికారి భాస్కర్ చెప్పారు.
విత్తన మార్పు మంచిదే కాని...
రైతులు విత్తన మార్పు కోరుకోవడం మంచిదే. అయితే ఆర్‌జెఎల్ 2537 విత్తనం కొరత ఏర్పడింది. మిగిలిన వాటిలో కూడా మంచిరకాలున్నాయి. వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకొని మిగిలిన వంగడాలను సాగుచేస్తే మంచిదే. హూదూద్ కారణంగా చాలా ప్రాంతాలలో వరి మునిగిపోయినందున విత్తన కొరత ఏర్పడింది.
- భాస్కరరావు,
వ్యవసాయాధికారి, అనకాపల్లి
వెనుదిరుగుతున్న రైతులు
వ్యవసాయ శాఖ, పీఏసీఎస్, ఇతరత్రా విత్తనాలను అమ్మే కేంద్రాలకు వెళుతున్న రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఎక్కడికివెళ్లినా ఆర్జీఎల్ విత్తనాలు అయిపోయాయనే సమాధానం రావడంతో రైతు లు నిరాశ చెందుతున్నారు. మైదాన ప్రాంతంలో ఉన్న మెట్ట ప్రాంత రైతులు ఏదో ఒక వంగడాన్ని సాగు చేసేందుకు సిద్ధమవుతున్నప్పటికీ సాగునీటి కాలువ పరిధిలోను, నదులకు ఆనుకొని లోతట్టు ప్రాంతాల రైతులు ఆర్జీఎల్ 2537 సాగు చేస్తేనే ఎంతో కొంత మిగులుతుందని భావిస్తున్నారు.